Jun 25,2023 15:33

హింస, అహింస మార్గాల్లో నేటి సమాజానికి ఏది అవసరం? ఇందులో ఏ వాదమైనా సమాజానికి పూర్తిగా అర్థమైందా.. అనే కోణాన్ని ఆవిష్కరించే కథే ''అహింస'' అన్నారు దర్శకుడు తేజ. సుమారు 30 లక్షల రూపాయలతో అప్పట్లో తీసిన 'చిత్రం' ఆయనకు కోట్ల రూపాయల కలెక్షన్లు తెచ్చి పెట్టింది. కొత్తవారిని పరిచయం చేయడం తేజ ప్రత్యేకం. ఉదరుకిరణ్‌, నితిన్‌ వంటి స్టార్‌ నటులకు తొలి ప్రయత్నంలోనే బ్రేక్‌ ఇచ్చిన ఘనత దర్శకుడు తేజదే. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు మనవడు, సురేష్‌బాబు కుమారుడు దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'అహింస' చిత్రాన్ని తెరకెక్కించారు. సహజంగానే ఒక ప్రముఖ సినీ కుటుంబం నుంచి ఓ నటుడు వస్తున్నాడంటే అందరి దష్టి ఆ సినిమాపై ఉంటుంది. అందులో తేజ దర్శకుడు కావడంతో 'అహింస'పై మరింత ఆసక్తి ఏర్పడింది. మరి తేజ ఆ అంచనాలను అందుకున్నారా? కొత్త నటుడు అభిరామ్‌ ఎలా నటించారు? తదితర విషయాలు తెలుసుకుందాం.

3


ఇక కథలోకి వెళితే.. బుద్ధుడు అహింసా మార్గాన్ని ప్రబోధించాడు. దానికి అందరూ ప్రభావితం కావడం వల్లే చరిత్రలో మనదేశంపై విదేశీ దాడులు ఎక్కువగా జరిగాయనే వాదన నేపథ్యంలోనే ఈ సినిమా తీస్తున్నట్లు తేజ చెప్పారు. అహింసా మార్గం ఉత్తమమని భావించిన కథానాయకుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ధర్మాన్ని కాపాడేందుకు హింస న్యాయమేనన్న ఆలోచన వైపు ఎలా వచ్చాడనేది ఈ చిత్రం కథ. రఘు (అభిరామ్‌ దగ్గుబాటి), అహల్య (గీతికా తివారీ) బావామరదళ్లు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. అదేరోజు అహల్యపై అత్యాచారం జరుగుతుంది. దుష్యంతరావు (రజత్‌ బేడి) కొడుకులే ఈ అఘాయిత్యానికి పాల్పడతారు. అంగబలం, అర్ధబలం ఉన్న దుష్యంతరావుపై చట్టరీత్యా పోరాడటానికి సిద్ధపడతాడు రఘు. అతడికి న్యాయవాది లక్ష్మి (సదా) అండగా నిలుస్తుంది. మరి ఈ పోరాటంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి..? చివరికి గెలుపు ఎవరిది? అహింసావాదాన్ని నమ్మే రఘు ఈ పోరాటంలో తాను నమ్ముకున్న విలువల్ని పక్కన పెట్టాడా? లేదా?
ఒక బలవంతుడిపై బలహీనుడు చేసే పోరాటమే ఆసాంతం ఈ కథ. కథానాయకుడు, ప్రతినాయకుడు పాత్రల తీరు చూస్తే 'జయం-2' అని ఎవరైనా వెంటనే చెప్పేస్తారు. అహింసావాదాన్ని నమ్ముకున్న కథానాయకుడు తన వారిని కాపాడే విషయంలో హింస తప్పులేదనే మార్గంవైపు వెళ్లడం ఈ సినిమాలో కీలకాంశం. దర్శకుడు చెప్పదలుచుకున్నది అదే. అలాంటప్పుడు చిత్రానికి దర్శకుడు 'అహింస' అనే టైటిల్‌ ఎందుకు పెట్టారో అర్థం కాదు. సినిమాలో మొత్తం ఛేజింగ్‌లు, యాక్షన్‌ సీక్వెన్స్‌లతో హింస బాగానే ఉంది. అత్యాచారానికి పాల్పడిన వారిని పట్టుకునే సన్నివేశాలు, పతాక సన్నివేశాలు, సెకాండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు మాత్రం బాగున్నాయి. అయితే కథానాయకుడి పాత్ర ప్రయాణం, ఇతర పాత్ర భావోద్వేగాలతో ప్రేక్షకుడు అంతగా కనెక్ట్‌ కాడు. ప్రథమార్ధంలో హీరో హీరోయిన్స్‌ మధ్య బంధాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. ఆ తర్వాత కథలోని మలుపులు, సంఘర్షణలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేకపోయాయి. తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కూడా ఎక్కడా కలగదు. సదా పాత్ర పరిచయం బాగుంది. అయితే ఆ తర్వాత డ్రామాను కొత్తగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. హీరో హీరోయిన్‌ని తీసుకువెళ్లడం, అడవుల్లో సాగే పోరాట ఘట్టాలు కొంతమేరకు మెప్పిస్తాయి.

2


అభిరామ్‌ తొలిసారి నటిస్తున్నవాడిలానే కనిపించాడు. అక్కడక్కడా నటనలో పరిణతి లేదనేది స్పష్టమవుతూనే ఉంది. పాత్రకు తగ్గట్టుగా చాలా సన్నివేశాల్లో ఫర్వాలేదనిపించాడు. గీతికా తివారీ అభినయం మాత్రం బాగుంది. రజత్‌ బేడి, కమల్‌ కామరాజు తదితరుల నటన మరీ అతిగా ఉంది. సదా లాయర్‌ లక్ష్మిగా తనదైన స్థాయిలో నటన కనబరిచింది. మిగతా పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. సాంకేతికంగా సినిమా బాగుందనే చెప్పాలి. కెమెరా, సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్‌లో చాలా లోపాలున్నాయి. రొమాంటిక్‌ ప్రేమకథలను తెరకెక్కించడంలో దర్శకుడు తేజకి ప్రత్యేకత ఉంది. అయితే అదే ప్రతి సినిమాలో రిపీట్‌ కావడం మైనస్‌. ఈ సినిమా చూస్తుంటే ఆయన పాత సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడికి తప్పక గుర్తుకొస్తాయి. మంచి కథనే ఎంచుకున్నా, ఆసక్తిగా తీయడంలో దర్శకుడు తేజ విఫలమయ్యారు. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. కథ, హీరో, హీరోయిన్స్‌ పాత్రలు బలమైతే, కథనం, భావోద్వేగాలు పండించ లేకపోవడం బలహీనతలు. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో అస్పష్ట 'అహింస' అనాలి. 'హింస' అని టైటిల్‌ పెడితే సరిపోయేది.

నటీనటులు : అభిరామ్‌ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కల్పలత, కమల్‌ కామరాజు, దేవి ప్రసాద్‌ తదితరులు
నిర్మాత : పి. కిరణ్‌
దర్శకత్వం : తేజ
సంగీతం : ఆర్పీ పట్నాయక్‌
సినిమాటోగ్రపీ : సమీర్‌ రెడ్డి
ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల : జూన్‌ 2, 2023