
మన జవాన్ల ఉపాధి లేదా పెన్షన్ ప్రయోజనాల భద్రతకు హామీ కల్పించేలా తమ నిధులు లేవని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ వనరులను సమకూర్చుకునేందుకు మార్గాలు లేవని కాదు. మిత్రులైన తన కార్పొరేట్లు పొందే అపార లాభాలను కాపాడేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి వుంది. వారికి పలు పన్ను రాయితీలను అమలు చేస్తూ తన ఉదారతను చాటుకుంటోంది. ఇంతటి అధ్వాన్న స్థితిలో అసమానతలు కలిగిన ఈ దేశంలోనే శత కోటీశ్వరులు కూడా తయారవుతున్నారు. పైగా వారిని తయారు చేయడంలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో వుంది. కానీ, సుసంపన్నులపై పన్నులు విధించడం కన్నా...ఉపాధి కోసం యువతలో నెలకొన్న అసహనాన్ని, వారి దుర్బలత్వాన్ని ఉపయోగించుకుని...ఇటువంటి అక్రమమైన షరతులు, విధి విధానాలను రుద్దడం ప్రభుత్వానికి చాలా తేలిక.
ఇటీవల ఏ వార్తాపత్రిక చూసినా ప్రధాని మోడీ తన తల్లి వందవ పుట్టిన రోజు సందర్భంగా ఆమె పాదాల దగ్గర మోకరిల్లిన ఫోటోనే కనిపించింది. 'అమ్మ అనే పదం అన్నిటినీ మించింది' అని మోడీ చేసిన వ్యాఖ్యలు, ఆ సందర్భంగా ఆయన మనసు లోని మాటలు చాలా పత్రికల్లో వచ్చాయి. ఆ ఫోటో చూసి ఎంతమంది తల్లులు... పోలీసుల లాఠీ దెబ్బలకు, బుల్లెట్లకు గాయపడిన తమ కొడుకుల గురించి ఆలోచిస్తూ వుండి వుంటారు? ఇంత దయార్ద్ర హృదయంతో తల్లి పాదాల ముందు మోకరిల్లిన ఆ కుమారుడు (మోడీ) తీసుకువచ్చిన ఇటువంటి పథకం (అగ్నిపథ్) వల్ల తమ పిల్లలు కన్న కలలు చెల్లా చెదురైపోతే, వారెన్నటికీ రెగ్యులర్ సైనికులు కాలేరంటే, వారి తల్లులు విలపించరా? తమ పిల్లలకు చదువు చెప్పించేందుకు, వ్యయభరితమైన శిక్షణా తరగతుల్లో చేర్చేందుకు, మరింత మెరుగైన జీవితాన్ని అందించేందుకు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారో? వాటి గురించి ఆలోచించారా? సాయుధ బలగాల్లో చేరేందుకు అవసరమైన కఠోరమైన శారీరక పరీక్షలు పాసయ్యేందుకు, అందుకు అవసరమైన పోషకాహారాన్ని తీసుకునేందుకు వారెన్ని కష్టాలు పడ్డారో ఆలోచించారా? ఇటువంటి కఠోర సాధన చేసే క్రమంలో పెరిగిపోయిన రుణ భారం గురించి వారు ఆలోచించారా? ఈ తల్లులందరూ కూడా భద్రత కోసం (తమ పిల్లల ఉపాధి భద్రత కోసం, తమ కుటుంబాల భద్రతకై) ఆలోచించారు. నిరసనలు, ఆందోళనలు చేస్తున్న వారి ఇంటర్వ్యూలు ఒక్కోటి చూస్తుంటే ఇది చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. కానీ ప్రధాని మరో రకంగా ఆలోచిస్తున్నారు.
ఇటీవల యూరప్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ఎన్‌ఆర్‌ఐలతో మాట్లాడుతూ, ''ప్రస్తుతం భారత్ సురక్షితమైన భవితవ్యం గురించి ఆలోచించడం లేదు. సవాళ్ళను ఎదుర్కొనడానికి సిద్ధంగా వుంది. వినూత్నంగా ఆలోచించి, ఆచరించేందుకు సంసిద్ధంగా వుంది.'' అని వ్యాఖ్యానించారు. కానీ ప్రధాని ప్రస్తావిస్తున్నటువంటి స్టార్టప్‌లు నూతన భారతంలో చాలా కొద్దిగానే వున్నాయి. ఈనాడు దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్న మెజారిటీ యువత తాము, తమ కుటుంబాలు ఎదుర్కొన్న సవాళ్ళతో, ముప్పులతో విసిగిపోయి వున్నారు. ఆర్థికంగా, భావోద్వేగాల పరంగా ఏవిధంగా చూసినా వారు తీవ్ర అసహనంతో వున్నారు. దేశానికి ఒక పక్క సేవ చేస్తూనే మరోపక్క తమ కుటుంబాలకు సుస్థిరమైన, భద్రతతో కూడిన భవితవ్యాన్ని అందించాలని వారు కలలు కన్నారు. రిస్క్ తీసుకునే యువత అంటూ ప్రధాని ప్రశంసలు కురిపించే మాటలు వినాలనుకోవడం లేదు. మాతృ ప్రేమను చూపించే ఆయన ఫోటోలు చూడాలనుకోవడం లేదు.
ప్రధాని అయి వుండి ఇటువంటి వాస్తవాన్ని ఎలా విస్మరించారు? దశాబ్దాల పరంగా భారత్‌లో అత్యధిక సంఖ్యలో నిరుద్యోగులు వున్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీ గురించి ఒక్క ప్రకటన పడితే అనేక లక్షల్లో దరఖాస్తులు వస్తాయి. గ్రామీణ యువతకు సైన్యంలో చేరడమనేది మొదటి ఎంపికగా వుంటుంది. ప్రతి ఏటా దాదాపు 50 వేల నుండి 60 వేల మంది రిటైరవుతుంటే, అంతే సంఖ్యలో రిక్రూట్ అవుతుంటారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా, కోవిడ్ పేరుతో అన్ని రిక్రూట్‌మెంట్లు ఆగిపోయాయి. 2020-21లో 97 రిక్రూట్‌మెంట్ ర్యాలీలు జరపాలని భావించినట్లు ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియచేసింది. కానీ వాటిలో కేవలం 47 మాత్రమే నిర్వహించింది. ఆ 47 ర్యాలీల్లో కూడా కేవలం నాలుగింటికి మాత్రమే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సిఇఇ) నిర్వహించారు. ఆ తర్వాత రిక్రూట్‌మెంట్లను నిలిపివేశారు. 2021-22 సంవత్సరానికి 87 రిక్రూట్‌మెంట్ ర్యాలీలు జరగాల్సి వున్నాయి. వాటిలో ఇప్పటివరకు కేవలం నాలుగింటిని మాత్రమే జరి పారు. వాటికి ఎలాంటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష కూడా జరపలేదు.
ఫలితంగా 2021 డిసెంబరు నాటికి, సైన్యంలో 1,04,053 మంది సిబ్బంది కొరతగా వున్నారు. నేవీలో 12,431 ఖాళీలు, వైమానిక దళంలో 5,471 ఖాళీలు వున్నాయి. సాధారణంగా అనుసరించే క్రమంతో ఈ ఖాళీలను భర్తీ చేయడానికి బదులుగా ప్రభుత్వం, భద్రతతో కూడిన, శాశ్వత ఉద్యోగాన్ని నాలుగేళ్ళ కాంట్రాక్టుగా మార్చే పథకంతో ముందుకు రావడంతో దేశవ్యాప్తంగా అశాంతి, అసహనాలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తాయి.
షార్ట్ టర్మ్ కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమితులయ్యే మహిళలకు సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఈ పథకం వుంది. అటువంటి మహిళా అధికారుల విషయంలో వారికి శాశ్వత ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అగ్నిపథ్ పథకం అటువంటి ఆశలకు చెల్లు చీటీ రాస్తోంది. సైన్యంలో శాశ్వత సిబ్బందిగా మహిళలు చేరే అవకాశాలకు ఫుల్‌స్టాప్ పెడుతోంది. మహిళల ప్రవేశానికి అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ నిబంధనలు అనుమతిస్తున్నప్పటికీ ఈ నాలుగేళ్ళ పథకం వల్ల వారెలా లబ్ధి పొందుతారు? ఆ తర్వాత వారికి ఉపాధి అవకాశాలు మరింత కష్టమవుతాయి.
పూర్తి స్థాయి వేతనాలు చెల్లించకుండా, పెరుగుతున్న పెన్షన్ బిల్లు భారాన్ని తగ్గించాలన్నదే ఈ పథకం వెనుక ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా వుంది. నయా ఉదారవాద ఆర్థిక విధానాల పంథాను అనుసరిస్తూ, భారత్‌లో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి కార్మికులు, ఉద్యోగులు గెలుచుకున్న హక్కులను కాలరాయాలని చూస్తు న్నాయి. పెన్షన్ పథకాలతో
సహా రిటైర్‌మెంట్ ప్రయోజ నాలను నీరు గార్చాలని చూస్తు న్నాయి. ప్రభుత్వ సర్వీసులతో సహా సంఘటిత రంగంలోని ఉద్యోగ ల్లో ప్రధాన భాగం పెన్షన్ లేదా గ్రాట్యూటీ లేకుండా పనిచేస్తున్నారు. 2018-2021 మధ్య ఇటువంటి కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువై 20 లక్షల పైచిలుకు చేరిందని ఇటీవల మంత్రి పార్లమెంట్‌లో తెలియచేశారు. ఇవేమీ కొత్త ఉద్యోగాలు కాదు. శాశ్వతం నుండి కాంట్రాక్టుకు మారిన రిక్రూట్‌మెంట్ స్వభావం వల్ల తలెత్తినవి.
ఇప్పుడు ఈ దారుణమైన దోపిడీని సాయుధ బలగాలకు కూడా విస్తరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా వుంది. కానీ ఇక్కడో ప్రధానమైన అదనపు అంశం వుంది. ఈ యువత వారి ప్రాణాలను పణంగా పెడతారు. తమను మృత్యువు నీడలా వెన్నంటి వుంటుందని వారికి తెలుసు. అగ్నిపథ్ పథకంలో జనరల్స్, ఆఫీసర్లను మినహాయించారు. కేవలం జవాన్లకు మాత్రమే ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. నాలుగేళ్ళ తర్వాత వారికి అందచేసే మొత్తంలో దాదాపు సగం మొత్తం వారి వేతనాల్లో నుండే వుంటుంది. పైగా యువతను కాస్త శాంతింపచేసేందుకు పది శాతం రక్షణ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వ రిక్రూట్‌మెంట్, ఖాళీలు ఇవన్నీ చూస్తుంటే ఆ హామీ అమలుపై కాస్తంతైనా నమ్మకం కుదరడం లేదు.
మన జవాన్ల ఉపాధి లేదా పెన్షన్ ప్రయోజనాల భద్రతకు హామీ కల్పించేలా తమ నిధులు లేవని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ వనరులను సమకూర్చుకునేందుకు మార్గాలు లేవని కాదు. మిత్రులైన తన కార్పొరేట్లు పొందే అపార లాభాలను కాపాడేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి వుంది. వారికి పలు పన్ను రాయితీలను అమలు చేస్తూ తన ఉదారతను చాటుకుంటోంది. ఇంతటి అధ్వాన్న స్థితిలో అసమానతలు కలిగిన ఈ దేశంలోనే శత కోటీశ్వరులు కూడా తయారవుతున్నారు.
పైగా వారిని తయారు చేయడంలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో వుంది. అంతేగాక ప్రస్తుత ప్రభుత్వ హయాంలో, భారత బిలియనీర్లు తమ సంపదకు 700 బిలియన్ల డాలర్లను అదనంగా సమకూర్చుకున్నారు. ప్రాధాన్యతా రంగాలకు అవసరమైన నిధులను, వనరులను సమకూర్చుకోగల మార్గాలు వారికి వుంటా యి. కానీ, సుసంపన్నులపై పన్నులు విధించడం కన్నా... ఉపాధి కోసం యువతలో నెలకొన్న అసహనాన్ని, వారి దుర్బలత్వాన్ని ఉపయోగించుకుని...ఇటువంటి అక్రమమైన షరతులు, విధి విధానాలను రుద్దడం ప్రభుత్వానికి చాలా తేలిక.
అగ్నివీరులకు జరిగే అన్యాయంతో పాటు ఇటువంటి కాంట్రాక్టు సైనికుల వల్ల...సాయుధ బలగాల పోరాట స్ఫూర్తి, నైపుణ్యాల వృద్ధి దెబ్బ తినే ప్రమాదమూ పొంచి వుంది. ఇదంతా కూడా దేశ భద్రతకే వినాశకరంగా పరిణమిస్తుంది. నిపుణులు, రిటైరైన సాయుధ దళాల సిబ్బంది ఇదే రీతిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని తమిళనాడు, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంపీలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. భారతదేశ ప్రయోజనాల రీత్యా ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలి.
( వ్యాసకర్త : సిపి(ఐ)ఎం పొలిట్‌బ్యూరో సభ్యులు )
బృందా కరత్