
సంధ్యా సమయం! సూర్యుడు పడమరలోకి జారిపోతున్నాడు.. చీకటి వెలుగుని పారద్రోలడానికి విశ్వప్రయత్నం చేసి సఫలీకృతమవుతోంది. గోధూళి వేళ కావడంతో పశువులు ఇంటికి చేరుకుంటున్నాయి. పక్షులు అరుస్తూ గూళ్ళకు మరలుతున్నాయి. దూరంగా ఎక్కడి నుంచో తీతువు వికృతంగా అరుస్తోంది. ఆ అరుపు చెవులకు భయంకరంగా సోకడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు శ్రీధర్.
గదంతా చీకటి పరుచుకొని ఉంది.. పిట్టల అరుపులు తప్ప అంతా నిశ్శబ్దం.. అది డాబా మీద ఒంటరి గది కావడంతో నిర్మానుష్యంగా ఉంది.. కళ్ళు నలుపుకుంటూ చుట్టూ చూశాడు.. గోడకి నిచ్చెన.. ఎదురుగుండా కొక్కేనికి వేలాడుతున్న ఉరితాడు.. కింద స్టూలు.. పక్క టేబుల్ మీద నిద్రమాత్రల డబ్బా.. వాటిని చూడగానే అతనికి ఆందోళన మొదలైంది. అసలేం జరిగింది.. ఎంత ప్రయత్నించినా ఏం జరిగిందో అర్థం కావటం లేదు, ఆలోచిస్తూ ఉంటే తల వేడెక్కిపోతోంది.
ఒక్కసారిగా లేచి, కిటికీలోంచి చూశాడు. అప్పుడే వీధిలైట్లు వెలగడంతో వెలుగు పరుచుకొని, వీధంతా నిర్మానుష్యంగా కనిపిస్తోంది.
అదేంటి వీధంతా నిర్మానుష్యంగా ఉంది! అంటే తను తన ఊళ్ళోనే ఉన్నాడా? ఆలోచనల హోరు మళ్ళీ మొదలైంది. చేతివేళ్ళతో నుదుటి మీద కణతలను గట్టిగా నొక్కుకున్నాడు శ్రీధర్. దాహం బాగా వేస్తుండటంతో సీసాలోని నీళ్ళు తాగాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది..
అసలు ఏం జరిగింది? తనెప్పుడు పట్నం నుంచి తన పల్లె వచ్చాడు? అమ్మ ఏది? ఎదురుగుండా తాడు, కింద స్టూలు ఏమిటి? ఆ నిద్రమాత్రలేమిటి? కొంప తీసి తను ఆత్మహత్యకి ప్రయత్నించాడా? అయితే మరి నిద్ర ఎలా వచ్చింది? మళ్ళీ ఆలోచనల హోరు..
అతను స్టూలుని కిటికీ దగ్గరికి లాగి, వీధిలోకి చూస్తూ కూర్చున్నాడు. అప్పుడప్పుడు కొందరు మనుషులు కనిపిస్తున్నారు. మధ్యలో పశువులు.. ఇంటికి తిరిగి వస్తున్న రైతులు.. ఎదురుగుండా ఆకాశంలో చంద్రవంక.. దాని చుట్టూ మిలమిల మెరుస్తున్న నక్షత్రాలు, రాను రాను అతనికి ఏం జరిగిందో గుర్తుకు రాసాగింది.. ఉదయం అతను తన ఊరొచ్చాడు. అమ్మ తనని చూసి ఆశ్చర్యపోవడం మదిలో మెదిలింది. అనుకున్న ప్రకారం జరిగితే ఈ పాటికి తను చనిపోయి ఉండేవాడు. ఆ విషయం గుర్తుకు రాగానే అతని శరీరం జలదరించింది. ఎదురుగుండా ఉరితాడు మృత్యుపాశంలా కనిపిస్తూ భయం గొలుపుతోంది. ముందుగానే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడం వల్ల ఆ తాడుని నిచ్చెన సాయంతో ఎక్కి, ఖాళీగా ఉన్న ఫ్యాను హుక్‌కి వేలాడదీసి, కింద స్టూలు పెట్టాడు..
ఒకవేళ ఉరి వేసుకోవడం కుదరకపోతే ప్రత్యామ్నాయంగా నిద్రమాత్రలు తెచ్చుకున్నాడు. అందుకే త్వరగా భోజనం చేసి, ఎవ్వరూ ఉండరని మేడ మీద ఉన్న గదిలోకి వచ్చాడు. తను ఇంటర్ నుంచే ఈ గదిని చదువుకోసం వాడుకునేవాడు. అతను ఎప్పుడు పల్లెకొచ్చినా, ఈ గదిలోనే ఎక్కువగా గడుపుతుంటాడు. అతని తల్లి పార్వతి ఎప్పుడూ ఆ గదికి రాదు. ఆ ధైర్యంతోనే అతను ఆ గదిని ఎంచుకున్నాడు. తను ఉదయం ఇంటికి వచ్చినప్పుడు ఎంత త్వరగా చనిపోదామా అన్న ఆరాటం ఉండేది. అందుకే తల్లితో ఎక్కువ మాట్లాడకుండా స్నానం చేసి, భోజనం చేశాడు. భోజనం చెయ్యకపోతే అడగటానికి గదిలోకి అమ్మ వస్తుందని, ఇష్టం లేకపోయినా తినేసి మేడ మీదకు వచ్చాడు.
ఎవరైనా వస్తారేమోనని తలుపు వేసి స్టూలు ఎక్కి, తాడుని హుక్‌కి వేలాడదీశాడు. ఆ సమయంలో ఫోన్ రావడంతో కిందకు దిగి, ఫోన్‌లో మాట్లాడి ఆలోచనల్లోకి, తరువాత నిద్రలోకి జారుకున్నాడు. బహుశా చావంటే ఉన్న బెంగే అతన్ని నిద్ర పోయేటట్లు చేసిందేమో?.
ఆలోచనల్లోంచి తేరుకున్నాడు శ్రీధర్. ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? బహుశా ఆ ఫోన్ రాకుండా ఉండి ఉంటే ఈ పాటికి తాను చనిపోయి ఉండేవాడేమో? మళ్ళీ అతను వీధిలోకి చూశాడు. ఇప్పుడు వీధంతా నిర్మానుష్యంగా ఉంది.
చీకటి పూర్తిగా ఆక్రమించేసి, నిశ్శబ్దం ఆవరించింది. మళ్ళీ గది వంక చూశాడు. ఎదురుగుండా గోడకి నిచ్చెన.. దాన్ని చూడగానే వైకుంఠపాళి గుర్తుకు వచ్చింది. అందులో నిచ్చెనలు పైకి వెళ్ళటానికి, పాములు కిందకు దిగడానికి ఉంటాయి. నిచ్చెన అంటే సోపానం.. పైకి వెళ్ళటానికి ఉపయోగపడే సాధనం, జీవితంలో కూడా ఎదగటానికి నిచ్చెనలాంటి అవకాశాలు కావాలి. తనకు అలాంటి నిచ్చెనలు దొరకలేదు. కాబట్టే సమస్యలనే పాములనోట్లో పడి, జీవితంలో ఓడిపోయాడు.
నిచ్చెన.. దాన్ని చూస్తూంటే అతనికి ఎప్పుడో తన మాస్టారు చెప్పిన.. మనము పైమెట్లు ఎక్కడానికి పనికొచ్చే నిచ్చెన మన అంతిమయాత్రకి కూడా పనికొస్తుంది.. అన్న వాక్యం గుర్తొచ్చి ఒళ్ళు గగుర్పొడిచింది. అంటే తాను ఆ నిచ్చెనని పాడె ఎక్కడానికే ఉపయోగించాడన్న మాట.
మళ్ళీ ఆలోచనల హోరు మొదలైంది. అతని ఆలోచనలు గతం వైపు మళ్ళాయి.
బబబ
శ్రీధర్ తండ్రి సత్యం ఓ సన్నకారు రైతు. కొడుకుని ఎంతో కష్టపడి చదివించాడు. తనకున్న ఐదెకరాల్లో మూడెకరాలు అమ్మి, కొడుకుని ఇంజనీరింగ్ చదివించాడు. శ్రీధర్ కష్టపడి చదివి, ఇంజనీరింగ్ పాసయ్యాడు. ఆ తరువాత ఉద్యోగాల వేట కోసం హైదరాబాద్ వెళ్ళాడు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అతనికి కావ్య పరిచయమై, అది ప్రేమగా పరిణామం చెందింది. ఉద్యోగాలు రాగానే పెళ్ళి చేసుకుందామని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. కానీ హైదరాబాద్‌లో రెండేళ్ళున్నా శ్రీధర్‌కు, కావ్యకూ ఉద్యోగాలు రాలేదు.
కావ్య ప్రేమ విషయం తెలిసి, ఆమె తండ్రి రఘునందనరావు ఆమెని మందలించాడు. అతను ఓ పారిశ్రామికవేత్త. తన కూతురు ఓ సామాన్య రైతు కొడుకైన శ్రీధర్ని ప్రేమించి, పెళ్ళి చేసుకోబోవడాన్ని అతను జీర్ణించు కోలేకపోయాడు. వెంటనే కూతుర్ని విశాఖ పిలిచి, ఇంట్లో కట్టడి చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీధర్‌తో ఆమె వివాహన్ని ఒప్పుకోనని స్పష్టం చేశాడు.
కొద్ది నెలల తరువాత ఆమె వివాహాన్ని అమెరికాలో డాక్టరుగా పనిచేస్తున్న కిషోర్‌తో నిశ్చయించాడు. ఈ వార్త శ్రీధర్‌కి తెలిసి, ఆందోళన చెందాడు. కావ్యని కలుద్దామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఇంతలో పులి మీద పుట్రలా అతని తండ్రి సత్యం మరణించాడు. అప్పుల వాళ్ళు బాకీలు తీర్చమని ఒత్తిడి చెయ్య సాగారు. ఇలా నలువైపుల నుంచి శ్రీధర్ మీద సమస్యలు దాడి చేయడంతో అతను ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఏం చెయ్యాలో తోచలేదు.
ఒక పక్క నిరుద్యోగం.. ఇంకో పక్క కావ్యతో విఫలమైన ప్రేమ.. మరో పక్క తండ్రి మరణం.. ఆర్థిక బాధలు.. ఇలా సమస్యల ముప్పేట దాడిలో చిక్కుకుని, మానసికంగా బలహీనపడ్డాడు. ఏం చెయ్యాలో దారితోచక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని తన పల్లెకు వచ్చాడు.
బబబ
కొద్దిసేపటికి ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు శ్రీధర్.
ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఉదయం వచ్చినప్పుడున్న ఆవేశం ఇప్పుడతనిలో లేదు. ఉదయం ఎంత త్వరగా ఇంటికొచ్చి ఆత్మహత్య చేసుకుందామా అన్న ఆలోచనతో వచ్చాడు. కానీ ఐదు గంటల తరువాత ఇప్పుడా పరిస్థితి లేదు సరికదా.. చావంటే భయం వేస్తోంది. ఉదయం అతని ఆలోచనల్లో తెగింపు కనిపించింది కానీ ఇప్పుడు బతకాలన్న ఆశ బయలుదేరింది.. అయినా సరే అతను ఓ నిర్ణయానికొచ్చి కుర్చీలోంచి లేచి, వేలాడుతున్న తాడు దగ్గరికొచ్చాడు. మనుషుల ప్రాణాలను నిర్దయగా తీసివేసే యమపాశంలా కనిపిస్తోందది.. కాసేపు దానివైపు చూసి, స్టూలు ఎక్కుతుండగా తలుపు చప్పుడైంది.. వెంటనే పరుగున తలుపు దగ్గరకొచ్చి అక్కడ కాసేపు నిలబడ్డాడు. నిశ్శబ్దం.. ఏ అలికిడీ లేదు. కాసేపు నిలబడి తలుపు తీశాడు. బయట కొచ్చి చుట్టూ చూశాడు. మెట్లవైపు దృష్టి పెట్టాడు.. ఎవ్వరూ లేరు ? నిర్మానుష్యంగా వుంది. ఎవరైనా తలుపు కొట్టారా ? లేక తన భ్రమా? కొద్దిసేపు అక్కడే నిలబడి లోపలికొచ్చి, మళ్ళీ తలుపు వేశాడు. అతని కెందుకో ఇప్పుడు గుండె దడ మొదలైంది. తన గుండె శబ్దం తనకే స్పష్టంగా వినిపిస్తోంది.
ఎవరు ఆ తలుపు కొట్టారు? కొంపతీసి మృత్యదేవత కాదు కదా? అయినా తాను తొందరపడి తలుపు తీశాడు.. అలా తియ్యకుండా ఉండవలసింది. మళ్ళీ ఆలోచనల హోరు మొదలైంది. బ్రతికి మాత్రం తను ఏం చెయ్యగలడు? తనకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఇంక మరణమే శరణం.. ఆ ఆలోచన రాగానే మళ్ళీ స్టూలు దగ్గరికి వెళ్ళాడు.. యమపాశం అతన్ని ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తోంది..
గదంతా నిశ్శబ్దం.. దూరంగా మళ్ళీ తీతువు అరుపు గుండెలదిరేలా వినిపిస్తోంది.. దాంతో మళ్ళీ గుండె దడ మొదలైంది. లబ్.. డబ్.. లబ్.. డబ్.. గుండె చప్పుడు చెవుల్లో స్పష్టంగా వినిపిస్తోంది.. ఇంతలో మళ్ళీ తలుపు చప్పుడైంది. దడ.. దడ.. తలుపు చప్పుడు.. లబ్ డబ్.. గుండె సవ్వడి.. రెండూ మిళితమై అపశ్రుతిలా వినిపిస్తున్నాయి.
ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని చూస్తుంటే శ్రీధర్‌కి ఏదో కీడు జరగబోతోందన్న సంకేతం కనిపించింది. ఈసారి మాత్రం తలుపు తియ్యకూడదని నిర్ణయించుకొని కొద్దిసేపు అక్కడే నిలబడ్డాడు. కానీ మళ్ళీ తలుపు చప్పుడు ప్రారంభమైంది.. ఈ సారి నిర్విరామంగా.. అతనికి అలజడి మొదలైంది. అతని మనసు డోలాయమానంలో పడింది. తలుపు తియ్యాలా వద్దా? ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు..
కానీ అది నిర్విరామంగా కొనసాగుతుండటంతో పరిగెత్తి, కిటికీలోంచి చూశాడు.. మెట్లు ఖాళీగా కనిపించాయి. అయినా తలుపు చప్పుడౌతోంది.. ఎవరు?.. అలా ఆలోచిస్తున్న సమయంలో.. 'శ్రీధర్! తలుపు తియ్యి..!' అన్న మాటలు ఆ తలుపు చప్పుడుతో కలిసిపోయి వినిపించాయి. అతనికి ఆ పిలుపుతో భయం మరింత పెరిగింది.. ఏం చెయ్యాలో తెలియటం లేదు. తలుపు మరింత గట్టిగా కొడుతున్నారు. 'శ్రీధర్.. శ్రీధర్ తలుపు తియ్యి.. ఒక పక్క ఎడతెగని ఆలోచనలు. ఇంకో పక్క తలుపు చప్పుడు. మరోపక్క గుండె శబ్ధం. మెదడులో హోరు మొదలైంది. అతనికేం చెయ్యాలో తోచటం లేదు. రాను రాను తలుపు చప్పుడు ఆలోచనల్ని డామినేట్ చేస్తోంది. అతను తాడుని తీసి, పక్కకు విసిరేసి తలుపు తీశాడు.
ఎదురుగా కావ్య నిలబడి ఉంది. 'తలుపు అంతలా కొడుతున్నా తియ్యవేమిటి? నువ్వేం చేస్తున్నావో అనీ భయపడి పోయాను తెలుసా?' అంది కావ్య లోపలికి వస్తూ.. కావ్యని చూడగానే అతని మస్తిష్కం మొద్దుబారిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఆమెకు మంచినీళ్ళ సీసా మూత తీసి ఇచ్చాడు. నీరు తాగుతూ ఆమె కుర్చీలో కూర్చొని, చెప్పటం మొదలుపెట్టింది. నాన్న మన పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో నాకేం తోచలేదు. నిన్ను ఎలా కలవాలో అర్థం కాలేదు. ఈలోగా నాన్న నా పెళ్ళి ఇంకొకరితో నిశ్చయం చెయ్యడంతో నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కానీ మన ఎకనామిక్స్ లెక్చరర్ రాఘవ గారు చెప్పిన 'మానవజన్మ సృష్టిలో అన్నిటికన్నా అత్యంత గొప్పది. అతి కొద్దిమందికి మాత్రమే ఆ అవకాశం వస్తుంది. బతికుంటే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. గొప్పవాటిని చూడవచ్చు. అనుభవించటానికి, ఆస్వాదించటానికి ఈ ప్రపంచం కన్నా గొప్పది ఏదీ లేదు. పిరికివాళ్ళే చనిపోవాలని అనుకుంటారు. నిరాశ చెందకుండా ఆశతో ముందుకెళితే దేన్నైనా సాధించవచ్చు.
'అగాధమగు జలనిధిలోనా ఆణి ముత్యమున్నటులే,
శోకాలా మరుగున దాగీ సుఖమున్నదిలే'
ఆ సుఖాలను మనం శోధించాలి. అందుకు మనం పోరాటం చెయ్యాలి.. అన్న మాటలు గుర్తుకొచ్చి నన్ను నేను నిగ్రహించుకొన్నాను. ఈలోగా నువ్వేం చేసుకుంటావోనన్న భయం కలిగింది.. అయినా ఎప్పుడూ ఆత్మహత్య పిరికివాళ్ళే చేసుకుంటారని నువ్వు నాతో చెప్పే మాటలు గుర్తుకొచ్చి నువ్వు ఆ పని చెయ్యవనే ధైర్యం వచ్చింది. నిన్నరాత్రి నాన్న ఢిల్లీ వెళ్ళడంతో అమ్మకి చెప్పకుండా ఇలా వచ్చేశాను.. అయినా చచ్చి ఏం సాధిస్తాం చెప్పు? అది పిరికివాళ్ళు చేసే పని. ఎలాగైతేనేం నేనెంతగానో ఇష్టపడి ప్రేమించిన నీ దగ్గరకు వచ్చేశాను. ఇక నా జీవితం పండినట్లే.. కష్టాల్నైనా, సుఖాల్నైనా కలిసే పంచుకుంటూ ముందుకెళదాం..' అంటూ శ్రీధర్ దగ్గరకు వచ్చి, గట్టిగా కౌగిలించుకుంది.
ఆమె స్పర్శకు అతను పులకించిపోయాడు.. జీవితం ఇంత గొప్పదా అనీ ఆమె కౌగిలించుకున్న క్షణాన అనిపించింది.. గంట క్రితం దాకా జీవితం వ్యర్థం అనుకున్నవాడు ఇప్పుడు జీవితం చాలా చాలా గొప్పదనీ, అందమైనదనీ..లాంటి భావనకి వచ్చి ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు.
గన్నవరపు నరసింహమూర్తి
narasimhamurtygannavarapu@gmail.com