న్యూఢిల్లీ : మేజర్లయిన పిల్లల పెళ్లిళ్లను పెద్దలు అడ్డుకోలేరనిఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. వివాహానికి తగిన వయసు కలిగిన యువతీయువకులు తమకు ఇష్టమైన భాగస్వామిని వివాహం చేసుకోవచ్చని, ఇటువంటి సందర్భంలో ఆ జంటల వివాహానికి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరని, రాజ్యాంగం ఆ జంటకు రక్షణ కల్పిస్తుందని హైకోర్టు వెల్లడించింది.
తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న జంటలకు పోలీసులు రక్షణ కల్పిస్తారని, అవసరమైన పక్షంలో వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణ అందిస్తారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్యాభర్తల వివాహ హక్కును ఏ విధంగానూ తక్కువ చేయకూడదని, ఇలాంటి జంటలకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ఆ రాష్ట్రంపై ఉందని జస్టిస్ తుషార్ రావు గేదెల అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న ఒక జంటకు పోలీసు రక్షణ కల్పిస్తూ, మేజర్లయిన యువతీయువకులు తమకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని ఒక కేసులో కోర్టు పేర్కొంది.