Jul 15,2023 13:43

ఎమ్మిగనూరు (కర్నూలు) : సమస్యలు పట్టించుకోని పాలకవర్గాల విధానాన్ని ప్రశ్నించడంతోపాటు పరిష్కరించేదాకా ప్రజలందరిని కూడగట్టి ఉద్యమాలు నిర్వహిద్దామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కే.ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు.

శనివారం ఎమ్మిగనూరు పట్టణంలోని తేరుబజార్‌ సర్కిల్‌ వద్ద సిపిఎం జిల్లా నాయకులు సి.గోవిందు అధ్యక్షతన జరిగిన జీపు జాత కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్‌ దేశాయి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... కర్నూలు జిల్లా నుండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులుగా అత్యున్నత పదవులు అలంకరించినా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా జిల్లాకు చేసింది మాత్రం శూన్యమన్నారు. కర్నూలు జిల్లా రెండుగా విడిపోయిన తర్వాత కరువు ప్రాంతం మాత్రమే కర్నూలు జిల్లాగా మిగిలిపోయిందన్నారు. జిల్లా సంక్షేమం పట్టని పాలకుల విధానాలకు వ్యతిరేకంగా, కర్నూలు జిల్లా సమగ్ర అభివఅద్ధిని కోరుతూ వందలాదిమందితో జూలై 26 నుండి 31 వరకు ఆదోని నుండి కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌ వరకు మహాపాదయాత్ర నిర్వహించి, వేలాది మందితో మహాధర్నాను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, ఎక్కడికక్కడ వాటి పరిష్కారం కోరుతూ సచివాలయ అధికారులకు ఇస్తూనే, గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలను మరింత చైతన్యం చేస్తూ.. ప్రశ్నించే వారిగా తీర్చిదిద్దడంలో భాగంగానే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో జీపు జాతాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు ఎమ్మిగనూరు నుండి ప్రారంభించిన ఈ జీపు జాత ఎమ్మిగనూరు పట్టణం, మంత్రాలయం, నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాలలోని అన్ని గ్రామాలలో ప్రజలను చైతన్యం చేస్తూ జాత సాగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పిఎస్‌ రాధాకఅష్ణ, నారాయణ, యండి.ఆనంద్‌ బాబు, అంజిబాబు, గురు శేఖర్‌, ఎమ్మిగనూరు మండల కార్యదర్శి హనుమంతు, నాయకులు రాముడు, సురేష్‌, నరసింహులు, కరుణాకర్‌, ఆంథోనీ, రాజు, తదితరులు పాల్గొన్నారు.