
బాల్యాన్ని దాటి యవ్వనంలోకి ప్రవేశించే వారధి కౌమార ప్రాయం. ఇది పిల్లల జీవితంలో కీలకమైనది. ప్రత్యేకమైనది కూడా! ఈ దశలో పిల్లల్లో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు వేగంగా సంభవిస్తాయి. పిల్లలు తమ మాట వినటం లేదనే ఫిర్యాదులు కూడా ఈ దశలోనే ఎక్కువగా వినిపిస్తాయి. ఈ వయస్సులో పిల్లలకు తల్లిదండ్రులు మరింత దగ్గరగా ఉండాలి. వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ, అవసరమైన గైడెన్స్ ఇస్తుండాలి.
కౌమార (టీనేజి) దశలో బాలబాలికల్లో శరీరంలోనూ, మానసికంగా వచ్చే బాహ్య, అంతర్గత మార్పులు ఇట్టే తెలిసిపోతాయి. అబ్బాయిలూ, అమ్మాయిల్లోనూ సొంత ఆలోచనలు, అభిప్రాయాలు, ఆకర్షణ వంటివి మొదలవుతాయి. తమను అందరూ గుర్తించాలనే తపన పెరుగుతుంది. అందంపై ఆసక్తి మొదలవుతుంది. ఇతరులతో పోల్చుకోవడం కూడా పెరుగుతుంది. ఇంట్లో వాళ్లు అర్థం చేసుకోలేదనో, స్నేహితులు పట్టించుకోవటం లేదనో తమలో తామే కుమలిపోతుంటారు. కొందరు చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా స్పందిస్తారు. దేనిని ఎంతవరకూ తీసుకోవాలో తెలియక గందరగోళానికి గురవుతారు. తక్కువ మార్కులు వచ్చినా, తక్కువగా చూడబడినా ఆత్మన్యూనతకు గురవుతారు. ఇలాంటప్పుడే తల్లిదండ్రులు మరింత దగ్గరగా ఉండాలి. స్నేహితుల మాదిరిగా వ్యవహరించాలి. పిల్లల నుంచి అన్ని విషయాలూ మాట్లాడుతూ తగిన గైడెన్స్ ఇవ్వాలి. కుటుంబ సభ్యులు టీనేజ్ పిల్లల ప్రవర్తన, కదలికలను ఒకింత కనిపెట్టి ఉండటం మంచిదని మానసిక వైద్యులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు.
కౌమార దశలో ఒత్తిళ్లు అధికం
కౌమార దశ (టీనేజ్) శారీరకంగా తలెత్తే సమస్యలు సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన నైపుణ్యాలు అలవర్చుకోవడం ఎంతో అవసరం. బలాలు, బలహీనతలు, ఇష్టాయిష్టాలు, శక్తి సామర్థ్యాలను గుర్తించడం, తమను తాము కొత్తగా ఆవిష్కతం చేసుకునేలా 'జీవన నైపుణ్య విద్య' దోహదపడుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొనే దశలో పిల్లలను అప్రమత్తం చేయాల్సి వుంటుంది.
ఈ దశలో వేగంగా జరిగే శారీరక, మానసిక, భావోద్వేగ, మేథోపరమైన మార్పులు కమపద్ధతిలో జరుగుతాయి. వాటిని అర్థం చేసుకోవటానికి, తదనుగుణంగా నడవటానికి ఇళ్లల్లో, విద్యాలయాల్లో అవగాహన కల్పించాలి.

అప్రమత్తత చాలు... ఆందోళన వద్దు
12 - 17 సంవత్సరాల మధ్యలో పిల్లల్లో శారీరకంగా అనేక మార్పులు వస్తుంటాయి. అమ్మాయిలూ, అబ్బాయిల్లో టీనేజ్‌లో వచ్చే మార్పులపై ఆందోళన అవసరం లేదు. ఆడపిల్లల్లో వచ్చే మార్పులపై ప్రధానంగా తల్లి చర్చించాలి. తినే ఆహారంలో ఆకుకూరలు, పండ్లు వంటివి తీసుకోవటం ద్వారా హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరుగుతుంది. పిల్లలకు స్కూళ్లల్లో టీనేజ్ సమస్యలపై అవగాహన కల్పించాలి. తద్వారా వారు భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవచ్చో తెలుసుకుంటారు. ఈ దశలో ఏర్పర్చే అవగాహన, అప్రమత్తత భవిష్యత్తుకు పునాది అవుతుంది.
- డాక్టర్ సిహెచ్.ఉదయ్ కుమార్
పొందూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి, శ్రీకాకుళం జిల్లా.

భావోద్వేగాల నియంత్రణ ముఖ్యం
కౌమార దశలో బాల బాలికలు భావోద్వేగపరమైన మార్పుల్ని, పెల్లుబుకుతున్న లైంగిక స్పందనల్ని అర్థం చేసుకోవాలి. ప్రమతత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలి. శారీరక మార్పులు భావోద్వేగపరమైన ఒత్తిడిని కలగజేస్తాయి. చిరాకు, భయం, ఆందోళన, స్థిమితం లేకపోవడం తదితర లక్షణాలు కనపడతాయి. చిన్న చిన్న విషయాలకు, అప్రధానమైన అంశాలకు భావోద్వేగపరంగా చలించిపోవడం ఈ వయసు వారి లక్షణం. ఫ్యాషన్ దుస్తులు, మ్యాచింగ్ నగలు, బొట్లు, గాజులు, జోళ్ళు, పువ్వులు, సెంట్లు, శిరోజాలంకరణ పట్ల మోజు పెరుగుతుంది. తల్లిదండ్రుల్ని ఎదిరించి మాట్లాడడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వారి మాటను లెక్కచెయ్యకపోవడం జరుగుతుంది. చదువుమీద శ్రద్ధాసక్తులు తగ్గి, కొంతమంది దురలవాట్లకు లోనయ్యే ప్రమాదం వుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు అవగాహన కల్పిస్తే భావోద్వేగాలను నియంత్రించుకునేలా అవగాహన కల్పించొచ్చు.
- డాక్టర్ ఎం శ్రీనివాసరావు
ఐటిడిఎ డిప్యూటీ డిఎంఅండ్ హెచ్‌ఒ
యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.