Jul 31,2022 17:48

అనగనగా చింతల కొండ కారడవి ప్రాంతం రకరకాల పక్షులు, పులులు, ఏనుగులు, కోతులు, జింకలకు నిలయం. ఎక్కడ్నుంచో వచ్చి ఓ ఇరవై కుటుంబాలు అక్కడ బస చేశాయి. ఆ గూడానికి 'కొత్తపల్లి' అని పేరు పెట్టుకున్నారు. గూడెంలో పిల్లల్లో పదిహేను సంవత్సరాల గిరి చురుకైన వాడు. గిరికి అడవి నచ్చింది. తండ్రి సీతన్నతో అడవికి వెళ్లేవాడు. పక్షుల శబ్దాలను అనుకరిస్తూ వాటితో స్నేహం చేశాడు.
గిరిని తమ అడవి చూపిద్దామని తీసుకెళ్లాయి పక్షలు. గిరి సరదాగా గెంతుతూ వెళ్ళాడు. దూరంగా చెట్ల కొమ్మల్లో కూర్చున్న కోతులు గాబరా పడుతూ శబ్దాలు చేశాయి. చెట్టు కిందే ఎండుటాకులు తింటున్న జింకలు పరుగులు తీశాయి. గిరి దానికి కారణమేంటని చిట్టి చిలుకను అడిగాడు.
'మాట్లాడకు.. అది మృగరాజు వారి ఆగమన సంకేతం' అంటూ గిరిని చెట్టు కొమ్మల్లో దాక్కోమని చెప్పింది. పక్కన పెద్ద మర్రిచెట్ల కిందకు వచ్చిన మృగరాజు సింహం ఆగ్రహంతో గాండ్రించింది. వెంటనే జంతువులన్నీ ఒక్కొక్కటిగా అక్కడకు చేరుకున్నాయి.
మృగరాజు గంభీరంగా 'మనలో కొంతమంది మిత్రులు అడవిలో జరుగుతున్న మార్పులపై ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ సమావేశం' అంటూ అడిగింది. వెంటనే గజరాజు ముందుకొచ్చి 'మహారాజా! మన అడవిలో కొన్ని రోజులుగా వింత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాత్రికి రాత్రి చెట్లు మాయం అవుతున్నాయి. వేల సంఖ్యలో కోతులు నివాసం కోల్పోయి పక్క అడవికి పారిపోయాయి. అడవిలో చెట్లు తగ్గటంతో ఆకులు గ్రాసం దొరకక జింకలు ఆకలితో మరణిస్తున్నాయి. తాగటానికి నీళ్లు దొరకట్లేదు'' అంటూ బాధను వ్యక్తపరిచాడు గజరాజు. మిగతా జంతువులన్నీ అవును అంటూ తల ఊపాయి.
'రెండు రోజుల్లో సమస్యలకు కారణాలు చెప్పండి. పరిష్కార మార్గం చెప్తాను' అంటూ గజరాజుకి బాధ్యత అప్పగించింది మృగరాజు.
కొన్నిరోజుల తరువాత, ఓ రోజు ఉదయాన్నే ఊర్లో ఇరుగు పొరుగువారు రాత్రి సింహం వచ్చి, మేకలను ఎత్తుకెళ్లింది అని సీతన్నతో చెప్పటం విన్నాడు గిరి. ఆ మరుసటి రోజు ఏనుగుల గుంపు పంటచేను తొక్కడమే కాకుండా ఇళ్లను కూల్చే ప్రయత్నం చేశాయి. సీతన్న బాణాలు ఎక్కు పెట్టి, వాటిని తరిమికొట్టాలని చూశాడు. అప్పుడు మృగరాజు మేకపిల్లను నోటితో పట్టుకుని ఏనుగులకు అడ్డంగా నిలబడ్డాడు. జంతువులన్నీ మృగరాజు వెనక బలగంలా నిల్చున్నాయి. 'మీరుంటున్న ఈ ప్రదేశం నా సామ్రాజ్యం. ఇక్కడ మీరు నరికిన చెట్లు ఎన్నో కోతులు, పక్షులకు నివాసాలు. మీరు వాడుతున్న పెద్ద చెరువు నీరు మా జంతు మిత్రులకు దప్పిక తీర్చేది. గ్రాసం లేక చాలా జింక మిత్రులు అడవిని విడిచి వెళ్లిపోవటంతో మాకు ఇబ్బంది అవుతుంది. ఇదే మా జంతు మిత్రుల ఆవేదన.' అంటూ తన కోపానికి కారణం చెప్పింది మృగరాజు.
దీనికి సీతన్న 'పట్నంలో మా భూములు, ఇల్లు అన్యాయంగా లాక్కుంటే ఇక్కడికొచ్చాం. మీరు కూడా మమ్మల్ని ఉండనీయకపోతే ఎక్కడ బతకాలి?' అంటూ కంటతడి పెట్టుకున్నాడు.
'మీ ఇల్లు, స్థలాలు లాగేసుకుంటే అంత కోపమొచ్చింది కదా.. మరి మా జంతు స్థావరాలను ధ్వంసం చేయటం న్యాయమా? అయినా మేము మీ అంత క్రూరం కాదు. మీరు ఇక్కడే ఉండొచ్చు. కానీ మా స్థావరాలను తాకొద్దు. మేము మీ గూడెంలోకి రాము' మృగరాజు గాండ్రిస్తూ సమాధానం చెప్పింది.
దీనికి సీతన్న 'మృగరాజా! మీతో పాటు ఉండమని చెప్పినందుకు ధన్యవాదాలు. మమ్మల్ని క్షమించండి. మీ స్థావరాలను కదిలించం. అంతేకాదు మీ అందరి కోసం నీటి కుంట తవ్వుతాం. పచ్చని చెట్లను పెంచుతాం' అని చెప్పాడు.
సంతోషించిన జంతువులన్నీ తమ స్థావరాలకు చేరుకున్నాయి. సీతన్న ఇచ్చిన మాట ప్రకారం గ్రామస్తులుతో కలిసి నీటి కుంటలు ఏర్పాటు చేశాడు. పచ్చని చెట్లను నాటాడు. అప్పట్నుంచి అందరూ హాయిగా జీవించారు.

ఆదిత్య పట్నాయక్‌
8984433779