అమాస రేయి
అడవిలో నెత్తుటివాన కురుస్తున్న వేళ..
ఆమె.. తెగిన పేగుల్ని ముడేసుకొనీ
జల్లెళ్లయిన ఒరిగిన వీరుల దేహాల్లోంచి
చిమ్ముతున్న నెత్తుటిదారను
కడవలకెత్తుకొనీ ..
వాగులో కలుపుతోంది!
వాగు.. ఎరుపెక్కిన ఆకాశంలా..
ఆమె.. రాలిపోయిన పొద్దులకు
చీకటివాగులో చితిమంటల స్నానం జేసి
ఆరిపోయిన చితిని చేటకెత్తి
విత్తులు వెదజల్లినట్టు
పిడికిళ్లతో కాటిబుగ్గిని
పొలాల్లో జల్లుతోంది!
పోడు.. పోరువంతమైన ఆకుబట్టలా..
'ఎవరమ్మా వీళ్లంతా..'
దగ్ధ కంఠంతో ఆమెనడిగాను దుఃఖపుదారిలో..
'ఈ దేశపు నుదుటాకాశం మీంచి
రాలిపోయిన కుంకుమ పొద్దులు..
పేగుతెగిన తల్లుల కడుపుకోతలు!' అందామె
ఓ శోకదేవతలా నడచిపోతూ..!!
సిరికి స్వామినాయుడు