Sep 04,2022 11:34

జూలు విదిలించిన నాసిరకానికి
వంగి నమస్కరించాలి
సరసమైన ధర సరాసరి
సవాలు విసురుతుంటే
సవాలక్ష కష్టాల్ని పక్కనబెట్టి
బేరసారానికి తలొంచాలి

గద్దెనెక్కిన పుంజు కూతేస్తే
చప్పున మేల్కొని
దిక్కులు పరిగణించాలి
కాళ్ళిరిగిన ఉల్లాసం
పరుగుల పోటీకి దిగినట్టు
ఎకసెక్కాల మాటల విరుపులకు
ఆకాశానికేసి ఆశగా చూడాలి

ఊహల పత్రాలపై
కనివిని ఎరుగని సంతకాలు
రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంటే
నమ్మకానికి ముస్తాబు చేసి
సగటు వాకిట్లో కూర్చోబెట్టాలి
పరిస్థితులన్నీ పళ్ళికిలిస్తూ
సకిలింతలు పెడుతుంటే
చిరిగిన బట్టల్తో బజార్లు తిరగాలి

అదంతే మరి
మన్ను వేపుడు పొట్టలో కూరి
కాశి పరకల చీలికల మధ్యలో
గడ్డిపోచలా రైతు ఊగుతుండాలి
ఐదు ఒక్కట్ల ఐదుకే
పాలిత ఎక్కాలు ఆగిపోతుంటే
మిగిలిన కూడికలన్నీ
మూలాలను తుడిపేసుకోవాలి

గోడకు విసిరిన బంతి
ఎగిరెగిరి అక్కడికే చేరినట్టు
అరిగిపోయిన రికార్డులన్నీ
ఆపకుండా తిప్పుతూ కూర్చోవాలి

ఎందుకో అదంతే మరి
ఎన్ని అక్షరాల్ని పేర్చి
మార్చి మార్చి వాక్యాన్ని కూర్చినా
ఆ భావం బడుగుల ముందు
ముభావంగా కూర్చోవాలి
మౌనానికి చేయూతనివ్వాలి
అవును అదంతే మరి


- నరెద్దుల రాజారెడ్డి
96660 16636