Jul 28,2023 10:52

 సిఐటియు రాష్ట్ర కమిటీ


ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విశాఖ స్టీలు ప్లాంటును కేంద్రం ఇప్పటి వరకూ ప్రైవేటీకరించలేకపోయిందని ఇప్పుడు అదానీని, గంగవరం పోర్టును అడ్డుపెట్టుకుని ముడి సరుకు రాకుండా అడ్డుకుంటూ నష్టాలబాట పట్టిస్తోందని సిఐటియు రాష్ట్ర కమిటీ పేర్కొంది. గంగవరం పోర్టు నుంచి అదానీని గెంటేయాలని కోరింది. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్‌ నరసింగరావు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. మూడు రోజుల నుంచి వెయ్యి కోట్ల విలువగల కోకింగ్‌ కోల్‌ను గంగవరం పోర్టులోకి రాకుండా అదానీ కంపెనీ ఆపేసిందని, రూ.71 లక్షలు విశాఖ ప్లాంటు డేమరేజ్‌ కట్టిందని తెలిపారు. పోర్టులో ఉన్న కోల్‌ను కూడా కన్వేయర్‌ బెల్టు రిపేరు పేరుతో సరఫరా నిలిపేసిందని, పోర్టును అదానీ స్వాధీనం చేసుకున్న తరువాత రవాణా ఛార్జీలు విపరీతంగా పెంచిందని వివరించారు. రూ.51 కోట్ల బకాయి ఉన్నారనే నెపంతో ప్లాంటు ఉత్పత్తిని దెబ్బతీయడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం, అదానీ కలిసి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. స్టీలు ప్లాంటు భూములు 1,100 ఎకరాలు అదానీ పోర్టుకు ప్రభుత్వం అప్పగించిందని, విశాఖకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటపాడు మండలంలో పనికిరాని ప్రభుత్వ భూములు స్టీలుప్లాంటుకు ఇచ్చినట్లు రికార్డుల్లో చూపించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి గంగవరం పోర్టులో ఉన్న 10.54 శాతం వాటాను మోడీ ఒత్తిడితో కారుచౌకగా పోర్టు యాజమాన్యానికి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి బదిలీ చేశారని అన్నారు. ఇప్పటికీ పోర్టుకు స్టీలు ప్లాంటే నీటిని సరఫరా చేస్తోందని, అయినా ప్లాంటును దెబ్బతీసే విధంగా అదానీ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఉత్పత్తిని దెబ్బతీసి కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని, రెండున్నరేళ్ల నుంచి ఉత్పత్తిని 40 శాతం తగ్గించారని, ఫలితంగా ఏడాదికి రూ.3,900 కోట్లు ప్లాంటుకు నష్టాలు వచ్చాయని అన్నారు. ఇప్పుడు పోర్టును అడ్డుపెట్టుకుని ముడి సరుకు రాకుండా అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో సుదీర్ఘ పోరాటం తరువాత 590 మంది గంగవరం, దిమ్మపాళెం గ్రామాల నుండి నిర్వాసితులను యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులుగా తీసుకుందని, వారికి ఇప్పటికీ రూ.14 వేల జీతం ఇస్తున్నారని తెలిపారు. పర్మినెంటు చేయాలని 22 రోజుల నుండి పోరాడుతున్నా పోర్టు యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని అన్నారు. గత వారం నుండి స్టీలు ప్లాంటులో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయని, రాష్ట్రంలో ఏకైక భారీ పరిశ్రమ దెబ్బతింటున్నా ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్లు నటిస్తోందని విమర్శించారు.
అదానీ కంపెనీతో మాట్లాడే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో గంగవరం పోర్టును ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.