అదానీ గ్రూప్ గత ఏడేళ్లుగా ఇండొనేషియా నుంచి పెద్ద మొత్తంలో బొగ్గును దిగుమతి చేసుకుంటోంది. దుబారు, తైవాన్, సింగపూర్ లోని మధ్యవర్తుల ద్వారా బొగ్గు దిగుమతి అవుతుంది. 2019 నుండి 2021 వరకు జరిగిన 30 రవాణా రికార్డులను ఆ పత్రిక పరిశీలించింది. ఇండొనేషియా నుంచి కొనుగోలు చేసిన వాస్తవ ధర కంటే మూడింతలు ఎక్కువ ధరకు భారత ఓడరేవుల్లో దింపినట్లు స్పష్టమవుతోంది.
గత రెండు దశాబ్దాలుగా, బొగ్గు సంబంధిత అవినీతి కథనాలను భారతదేశం చూసింది. 2014లో యుపిఎ-2 ప్రభుత్వం పతనం కావడానికి, బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం బొగ్గు గనుల కుంభకోణం. ఇప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో మరో బొగ్గు కుంభకోణం బైటపడింది. మోడీకి అత్యంత నమ్మకస్తుడైన గౌతమ్ అదానీ దిగుమతి చేసుకున్న బొగ్గు ధరను అత్యంత ఎక్కువగా చూపించి...వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన కథనాన్ని 'ఫైనాన్షియల్ టైమ్స్' వార్తాపత్రిక బయటపెట్టింది.
అదానీ దిగుమతి చేసుకున్న బొగ్గును వాస్తవ మార్కెట్ ధర కంటే రెండింతలు పెంచి దేశంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అధిక ధరలకు విక్రయించడం వెనుక ఉన్న వాస్తవాలను ఈ పత్రిక వెల్లడించింది. భారతీయ కస్టమ్స్ పత్రాలలో పేర్కొన్న వివరణాత్మక విశ్లేషణను ప్రచురించింది. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, భారతదేశంలో విద్యుత్ వినియోగదారుల నుండి అధిక చార్జీలు వసూలు చేయడం వల్ల కలిగే నష్టం రూ. 12,000 కోట్లు దాటుతుంది. అయితే అదానీ గ్రూప్ దీనిని ఎప్పటిలానే కొట్టిపారేసింది. ఇక, భారతదేశంలోని మీడియా అయితే అలాంటి వార్తాపత్రిక ఒకటి వున్నదన్న విషయమే తెలియదన్నట్లుగా వ్యవహరించింది.
అదానీ లాభాల రహస్యమిది...
అదానీ గ్రూప్ గత ఏడేళ్లుగా ఇండొనేషియా నుంచి పెద్ద మొత్తంలో బొగ్గును దిగుమతి చేసుకుంటోంది. దుబారు, తైవాన్, సింగపూర్ లోని మధ్యవర్తుల ద్వారా బొగ్గు దిగుమతి అవుతుంది. 2019 నుండి 2021 వరకు జరిగిన 30 రవాణా రికార్డులను ఆ పత్రిక పరిశీలించింది. ఇండొనేషియా నుంచి కొనుగోలు చేసిన వాస్తవ ధర కంటే మూడింతలు ఎక్కువ ధరకు భారత ఓడరేవుల్లో దింపినట్లు స్పష్టమవుతోంది. ఈ రవాణా రికార్డుల విషయమే తీసుకుంటే....అదానీకి ఏడు కోట్ల డాలర్ల అదనపు లాభం వచ్చిందని స్పష్టమవుతోంది. అంటే టన్నుకు 25-30 డాలర్ల చొప్పున ఇండొనేషియాలో లోడ్ చేసిన బొగ్గును భారత నౌకాశ్రయాలలో దించాక...65 నుంచి 80 డాలర్ల మధ్య ఉన్నట్లు చూపారు. అదానీ కంపెనీ బొగ్గును ఆ ధరకు భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, ఇతర కంపెనీలకు విక్రయించింది. దీనివల్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి వ్యయం పెరిగి... సరఫరా చేసే విద్యుత్ రేటు కూడా వాటికనుగుణంగా పెరగాల్సి ఉంది. అదానీ ఖజానాకు కోట్లాది రూపాయలు వచ్చాయిగానీ విద్యుత్ వినియోగదారులు మాత్రం దారుణంగా దోపిడీకి గురయ్యారు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ విషయంలో ఫిర్యాదు రావడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) 2016లో దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో భాగంగా డిఆర్‌ఐ పలు కంపెనీలకు నోటీసులు జారీ చేయగా.. 50 నుంచి 100 శాతం మేర ధరలు పెంచినట్లు గుర్తించారు. ఈ కుంభకోణం జరిగిన పద్ధతి ఏమిటంటే, అధిక ధర కలిగిన ఇన్‌వాయిస్‌లను సిద్ధం చేసి, ఇండొనేషియా నుండి బొగ్గును భారతదేశానికి డెలివరీ చేయడం, అది మూడవ దేశంలోని ఏజెన్సీ ద్వారా వచ్చినట్లు చూపడం. అయితే, ధర లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు తమకు అనుకూలమైన తీర్పు నిచ్చిందని అదానీ గ్రూప్ పేర్కొంది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ఒక సంఘటనను స్పష్టంగా వివరిస్తుంది. జనవరి 2019లో 74,820 టన్నుల బొగ్గుతో ఇండొనేషియా నుండి ఓడ బయలుదేరింది. ఇండొనేషియాలో దీని ధర 1.9 మిలియన్ డాలర్లు. అయితే, ఈ నౌక గుజరాత్ లోని ముంద్రాలో ఉన్న అదానీ సొంత ఓడరేవుకు చేరుకోగానే చూపిన ధర 4.3 కోట్ల డాలర్లు! బొగ్గును డిఎల్ అకాసియాలో తీసుకొచ్చారు. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, ఆ సంవత్సరంలో అటువంటి సరుకు రవాణా 30 సార్లు జరిగినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. బీమా, ఇతర నిర్వహణ ఖర్చులతో సహా మొత్తం దాని విలువ 142 మిలియన్ డాలర్లు. అయితే, భారత కస్టమ్స్‌కు సమర్పించిన పత్రాల్లో చూపించిన ధర 215 మిలియన్ డాలర్లు. ఆ విధంగా అదానీ గ్రూప్ భారత్‌లో బొగ్గును అత్యధిక ధరకు విక్రయించి లబ్ధి పొందుతోంది.
తైపీ లోని 'హై లింగోస్', దుబారు లోని 'తారస్ కమోడిటీస్ జనరల్ ట్రేడింగ్', సింగపూర్ లోని 'పాన్ ఆసియా ట్రేడ్ లింక్' ఈ వ్యాపారంలో అదానీ గ్రూప్‌కు మధ్యవర్తులుగా వ్యవహరించాయి. వీటిలో కొన్ని కంపెనీలు అదానీ గ్రూప్‌కి చెందిన బినామీ కంపెనీలని వార్తలు వచ్చాయి. దుబారులో ఉన్న ఈ కంపెనీలను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నడిపాడు. అతని రహస్య కార్యకలాపాలను హిండెన్‌బర్గ్ నివేదిక కూడా ప్రస్తావించింది. కస్టమ్స్ రికార్డుల ప్రకారం, అదానీ గ్రూప్ సెప్టెంబర్ 2021 నుండి జులై 2023 వరకు 2,000 నౌకల బొగ్గును దిగుమతి చేసుకుంది. ఈ పద్ధతిలో 7.3 కోట్ల టన్నుల బొగ్గు భారతదేశానికి చేరుకుందని కస్టమ్స్ పేర్కొంది. కస్టమ్స్‌కు అదానీ అందించిన పత్రాల ప్రకారం టన్నుకు సగటున 130 డాలర్ల చొప్పున బట్వాడా చేసినట్లు వెల్లడవుతోందని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. విదేశాల్లో దీని సగటు ధర 60-65 డాలర్లు మాత్రమే.
2016లో ఈ విధంగా రూ.30,000 కోట్లు పెంచినట్లు డిఆర్‌ఐ అంచనా వేసింది. అప్పటి నుంచి ఆ దిశగా పెద్దగా పరిశోధనలు జరగలేదు. కస్టమ్స్ పత్రాలు, అనేక రకాల సమాచారాల ఆధారంగా జర్నలిస్టులు డాన్ మాక్రామ్, డేవిడ్ షెప్పర్డ్, మాక్ హార్లో రూపొందించిన కథనం అక్టోబర్ 12న ఫైనాన్షియల్ టైమ్స్‌లో ప్రచురితమైంది. వాస్తవానికి, ఈ నివేదిక వెల్లడించింది గోరంత మాత్రమే. ఏళ్ల తరబడి మోడీ నీడలో అదానీ సాగిస్తున్న ఈ వ్యాపారంలో లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు దాగి ఉన్నాయి. ఈ వార్త వెలువడినప్పుడు, అదానీ గ్రూప్ సరైన సమాధానం ఇవ్వకుండా, అందులో పేర్కొన్న ఆరోపణలను తిరస్కరిస్తూ పత్రికా ప్రకటనను మాత్రమే విడుదల చేసింది. నరేంద్ర మోడీ మామూలుగా మౌన బాబా పాత్ర పోషిస్తున్నారు.
(వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్) జార్జ్ జోసెఫ్