- సోలార్ కోసం లీజు పద్ధతిలో భూముల సేకరణ
- లీజు ఇవ్వకుంటే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లా రైతుల్లో అదాని అక్రమాల వ్యవహారం గుబులు రేగుతోంది.ఈ జిల్లాలో ప్రతిపాదించి సోలార్ పార్కుకు భూమిలిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన రైతాంగంలో నెలకొంది. గతంలో లాగా భూములను సోలార్ పార్కు కోసం పూర్తి స్థాయిలో సేకరించడం లేదు. లీజు పద్ధతిలో సేకరించేందుకు అనుమతినిచ్చారు. ఏడాదికి ఎకరానికి రూ.30 వేలు లీజు చెల్లించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ ఉత్తర్వుల్లో లీజు సంస్థ చెల్లించకపోతే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి భరోసా లేదు. మరోవైపు అదాని సంస్థ పెద్ద ఎత్తున మోసపూరిత విధానాలు అనుసరిస్తోందంటూ వస్తున్న రైతులు చర్చనీయాంశంగా మారాయి. దీంతో సంస్థ సంస్థ లీజు చెల్లించకపోతే పరిస్థితి ఏమవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తమకు భరోసా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
ఎంత భూమి ?
సోలార్ పార్కు కోసమని లీజు పద్ధతిలో భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోంది. ఇది వరకే భూములు కేటాయిస్తూ మంత్రివర్గంలోనూ తీర్మానం చేసింది. అనంతపురం జిల్లాలోని నాలుగు మండలాల్లోని డి.హీరేహల్, కణేకల్, రాయదుర్గం, బొమ్మనహల్ మండలాల్లోని 13 గ్రామాల్లోని 11831.81 ఎకరాల భూమిని సోలార్ సార్కు కోసం గుర్తించారు. ఇందులో 9817.18 ఎకరాలు పట్టా భూములు, 557.52 ఎకరాలు ప్రభుత్వ భూమి, 1457.14 అసైన్డ్ భూమిని గుర్తించారు. ఇందులో కొన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో సాగుభూమి మొత్తం అదాని కంపెనీ సోలార్ పార్కు కింద తీసుకుంది. డీ.హీరేహల్ మండలంలోని సోమలాపురం గ్రామంలో 1006.41 ఎకరాలు, మురిడిలో 1432.4 ఎకరాలు, కడలూరులో 1008.22 ఎకరాలు, దొడగట్ట గ్రామం పరిధిలో 881.17 ఎకరాలు, కడలూరు గ్రామంలో 1309.88 ఎకరాలు, పులకుర్తి గ్రామంలో 1022 ఎకరాలు మొత్తం ఈ మండలం పరిధిలో 6660.08 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. కనేకల్ మండలం పరిధిలోని హుళికేరి గ్రామం పరిధిలో 691.36 ఎకరాలు, జక్కలవడికి గ్రామం పరిధిలో 932.14 ఎకరాలు, యర్రగుంట గ్రామంలో 1087.37 ఎకరాలు మొత్తం 2711.37 ఎకరాలు సేకరిస్తున్నారు. రాయదుర్గం మండలం పరిధిలో గ్రామదట్ల గ్రామం పరిధిలో 1117.03 ఎకరాలు సేకరిస్తున్నారు. బొమ్మనహల్ మండలం పరిధిలో నేమకల్లు గ్రామంలో 575 ఎకరాలు, ఉంతకల్లు గ్రామంలో 343.18 ఎకరాలు, ఇలంజి గ్రామంలో 425.15 ఎకరాలు మొత్తం బొమ్మనహల్ మండలంలో 1343.33 ఎకరాలు మొత్తంగా కలిపి 11831.81 ఎకరాలు సేకరించనున్నారు.
భరోసా ఇస్తేనే : బోయన్న సాయన్న, ఇలంజీ గ్రామం, బొమ్మనహల్ మండలం
ఆదాని కంపెనీకి భూములివ్వాలని కోరారు. అయితే ఇప్పటి వరకు ఒప్పందాలు జరగలేదు. ఇప్పుడేమో ఆ సంస్థపై పెద్దఎత్తున వార్తా కథనాలు వస్తున్నాయి. కొంత అయోమయంలోనూ ఉంది. ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా భరోసానిస్తే తాము ఆలోచిస్తాం. లేకపోతే ఇవ్వడం సాధ్యమవదు.
ప్రభుత్వ హామీ ఉండాలి.
వి.రాంభూపాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి
లీజుకు ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం కాబట్టే, నిర్ధేశించిన మొత్తానికి ప్రభుత్వమే హామీ ఉండాలి. గతంలోనూ ఉమ్మడి జిల్లాలో లేపాక్షి నాలెడ్జి హబ్ పేరుతో 8484 ఎకరాల భూములు ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టారు. భూములు తీసుకున్న వారు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. రైతులకు భూములుపోయాయి. ఉపాధి రాలేదు. ఇప్పుడు ఆదానికి ఏకంగా పరిహారం కూడా లేకుండానే లీజు పద్ధతిలో భూమలు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.










