Jun 14,2022 06:52

శ్రీలంక ఈశాన్య ప్రాంతం మున్నార్‌ జిల్లాలో అతిపెద్ద గాలిమరల విద్యుత్‌ ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోడీ ఒత్తిడితో అదానీ గ్రూపు వశం అయిందన్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ ఆరోపణ చేసింది చిన్నా చితకా వ్యక్తి దారినపోయే దానయ్య కాదు. శ్రీలంక ఎలక్ట్రిసిటీ వ్యవహారాల అధీకృత సంస్థ సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు (సెబ్‌) ఛైర్మన్‌ ఫెర్డినాండో స్వయంగా వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలపై పార్లమెంటరీ స్థాయి సంఘం (కోప్‌) శుక్రవారం చేపట్టిన విచారణలో మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ ఆశ్రిత పక్షపాతాన్ని ఫెర్డినాండో బహిర్గతం చేశారు. ఈ ఉదంతం మోడీ సర్కార్‌కు, బడా కార్పొరేట్లకు మధ్య పెనవేసుకున్న బంధాన్ని మరోసారి బట్టబయలు చేసింది. కాగా సెబ్‌ ఛైర్మన్‌ తన వ్యాఖ్యలు భావోద్వేగంలో చేసినవిగా వివరణ ఇచ్చుకున్నారు. పదవికి రాజీనామా చేశారు. శ్రీలంక అధ్యక్ష కార్యాలయం సెబ్‌ ఛైర్మన్‌ వ్యాఖ్యలను ఖండించింది. విండ్‌ పవర్‌ కాంట్రాక్టుల విషయంలో అనుచిత పక్షపాతం లేదని, పూర్తి పారదర్శకత, జవాబుదారీ తనం పాటించామని ప్రకటించింది. ఇంత జరుగుతున్నా ఇటు మోడీ ప్రభుత్వం అటు అదానీ గ్రూపు ఇప్పటి వరకు నోరుమెదపలేదు. వారి నిశ్శబ్దాన్నిబట్టే ఇద్దరూ తేలు కుట్టిన దొంగల బాపతని అర్థమవుతోంది.

శ్రీలంక పవన విద్యుత్‌ కాంట్రాక్టులపై మార్చిలోనే ఆరోపణలచ్చాయి. అప్పటి వరకు పోటీ బిడ్ల ద్వారా కాంట్రాక్టులివ్వగా నామినేషన్‌పై ఎవరికైనా ఇచ్చే విధంగా పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయగా, అక్కడి ప్రతిపక్షాల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, ప్రోత్సాహకాలపై ఒప్పందాలు జరిగాయి. అప్పుడే మోడీకి, రాజపక్స మధ్య 'వ్యూహాత్మక' బంధం బలపడింది. అంతేకాదు, అదానీ గ్రూపును భారత ప్రభుత్వ నామినేటెడ్‌ సంస్థ అని శ్రీలంక పేర్కొంటున్నది. పవన విద్యుత్‌ ప్రాజెక్టుల కంటే ముందే కొలంబో పోర్టులో ఒక పెద్ద టర్మినల్‌ను దక్కించుకోవడం ద్వారా అదానీ గ్రూపు ఆ దేశంలో ప్రవేశించింది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించిన వారెవరికైనా మోడీ సర్కారు అదానీని ప్రమోట్‌ చేసేందుకు శ్రీలంక వద్ద పైరవీ చేసిందని ఇట్టే తెలుస్తుంది. ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ రుణాలు పొందిన దేశాల్లో కార్పొరేట్‌ అవినీతి దండలో దారంలా ఉంటుంది. ఆ సంస్థల రుణాలపైనే ఆధారపడ్డ శ్రీలంక కార్పొరేట్‌ అనుకూల విధానాలను అమలు పర్చడం కద్దు. ఆ అనుకూల వాతావరణాన్ని తమ లాభాల కోసం ఉపయోగించుకోవడం అదానీ వంటి వారికి వెన్నతో పెట్టిన విద్య. కార్పొరేట్‌ సేవలో పునీతమయ్యే మోడీ ప్రభుత్వానికి అదానీ ఆత్మబంధువన్న విషయం జగద్విదితం. కాబట్టి అదానీ కోసం శ్రీలంకపై మోడీ ఒత్తిడి కూడా నిజమే!

అవినీతిలో అడ్డంగా దొరికినా ఎదురుదాడి చేయడం లేదంటే వ్యూహాత్మక మౌనం పాటించి తప్పించుకోవడం విషయాన్ని పక్కదారి పట్టించేందుకు హిందూత్వ మతతత్వాన్ని రేగ్గొట్టడం బిజెపి ప్రభుత్వానికి అలవాటై పోయింది. రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వం వద్ద అనిల్‌ అంబానీకి అనుకూలంగా ప్రధాన మంత్రి, ఆయన కార్యాలయం ప్రత్యక్షంగా పని చేసిందని ఆరోపణలచ్చినప్పుడు జెపిసి దర్యాప్తునకు అంగీకరించకుండా పార్లమెంట్‌ను హైజాక్‌ చేశారు. ఫ్రాన్స్‌లో విచారణ మొదలయ్యాక కూడా దర్యాప్తునకు ముందుకు రాలేదు. ప్రతిపక్ష నేతలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై ఇజ్రాయిల్‌ నుండి నిఘా సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుపైనా అక్కడ విచారణ జరుగుతున్నప్పటికీ ఇక్కడ మౌనం దాల్చారు. లలిత్‌మోడీ వీసా విషయంలోనూ ఇదే తీరు. చెప్పుకుంటూ పోతే మోడీ ప్రభుత్వ అవినీతి, క్విడ్‌ప్రోకో వ్యవహారాలపై పెద్ద గ్రాంధాలు తయారవుతాయి. దేశంలో ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రైల్వే, ఉక్కు, విద్యుత్‌, హైవే ప్రాజెక్టులు, బొగ్గు, డిజిటల్‌ కాంట్రాక్టులు, రూ.లక్షల కోట్ల రాయితీలు, కరోనా బెయిలవుట్‌లు, బ్యాంక్‌ రుణాల రద్దు, ప్రభుత్వరంగ సంస్థలు, సహజ వనరులు సమస్తం అంబానీ, అదానీలకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఇరుగుపొరుగు దేశాల్లో సైతం పైరవీలకు దిగడం కార్పొరేట్లకు నిస్సిగ్గుగా ఊడిగం చేయడమే.