Aug 26,2023 15:50

ప్రజాశక్తి-కాకినాడ : బడి ఈడు పిల్లలు అందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో వుండే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో జరుగుతున్న గ్రాస్‌ ఎన్రోల్మెంట్‌ సర్వే సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్‌లో విద్యా శాఖకు సంబంధించి గ్రాస్‌ ఎన్రోల్మెంట్‌, వాలంటీర్ల ఎడ్యుకేషన్‌ సర్వే, నాడు నేడు కింద చేపట్టిన పనులపై కలెక్టర్‌ విద్యా శాఖ, ఇంటర్‌ మిడియట్‌, నైపుణ్య శిక్షణ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాలో చేపట్టిన విద్యార్థుల సర్వే పురోగతి, నైపుణ్య శిక్షణ తరగతుల వివరాలు ఇతర అంశాలపై ఎంపీడీవో, ఎంఈవోలతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. బడి బయట ఉన్న బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేరే విధంగా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి ఇంటికి పరిమితం కాకుండా తప్పనిసరిగా పాఠశాల, నైపుణ్య శిక్షణ కేంద్రాలలో ప్రవేశాలు కల్పించాలన్నారు. పదో తరగతి తప్పిన విద్యార్థులకు తిరిగి అదే తరగతి అభ్యసించేలా చూడాలన్నారు. ఇంటర్‌ తప్పిన విద్యార్థులను ఓపెన్‌ స్కూల్‌, నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా అందిస్తున్న కోర్సుల్లో ప్రవేశం కల్పించాలని కలెక్టర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ శిక్షణ కేంద్రాల ద్వారా వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రాముఖ్యంగా జిల్లాలో జరుగుతున్న గ్రాస్‌ ఎన్రోల్మెంట్‌ సర్వే రానున్న సెప్టెంబర్‌ నెల ఐదునాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులకు స్పష్టం చేశారు. అదేవిధంగా వాలంటీర్ల సర్వే నూరు శాతం పూర్తి కావాలన్నారు. ఈ సర్వేలో మరణించిన, వలస వెళ్లిన తదితర విద్యార్థుల వివరాలను పున్ణ పరిశీలించి యాప్‌లో సక్రమంగా నమోదు చేయాలన్నారు. ఇందుకు మండల విద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ, జిల్లా విద్యాశాఖ అధికారి జీ.నాగమణి, ఆర్‌ఐవో ఎన్‌.ఎస్‌.వీ.ఎల్‌.నరసింహా, వికాస పీడీ కె లచ్చారావు, కాకినాడ ఐటీఐ ప్రిన్సిపల్‌ ఎంవీజీ.వర్మ, నైపుణ్య శిక్షణ అధికారి, కాకినాడ, పెద్దాపురం డీఎల్డీవోలు, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.