May 16,2023 16:49

ప్రజాశక్తి-కాకినాడ : సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి, వసతి గృహాల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ కృతికాశుక్లా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జగన్నాథపురంలో నూతనంగా నిర్మించిన ధీరుబారు అంబానీ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాం-1ను కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగాగీత జిల్లా కలెక్టరు డా.కృతికాశుక్లా, కుడా చైర్‌ పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌ మోనిటరింగ్‌ కమిటీ సభ్యులు డా. ఎం.పవన్‌ కుమార్‌, బి. వీరలింగేశ్వరరావు, పిల్లి జ్యోతి, సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ.. రూ.60 లక్షల రిలయన్స్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో కళాశాల వసతి గృహాన్ని అతి తక్కువ సమయంలో ఆరు నెలల కాలంలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాల భవనాలు పరిస్థితి, ఫిట్నెస్‌ వంటి అంశాలపై సమగ్ర సర్వే ద్వారా పరిశీలించడం జరిగిందన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి వసతి గృహాల బలోపేతానికి చర్యలు చేపట్టినట్టు కలెక్టరు తెలిపారు. ఇంకా నిధులు అవసరమైన చోట జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యే ఫండ్స్‌తో వసతి గృహాల ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందని, కాకినాడ ఆనంద నిలయంలో పెద్ద డార్మెంటరిని ఇటీవలే వినియోగంలోనికి తిసుకువచ్చామన్నారు. మాజీ లోక్‌ సభ స్పీకర్‌ స్వర్గీయ జీఎంస్సీ బాలయోగి కాకినాడలో చదివిన అంబేద్కర్‌ వసతి గృహాన్ని కూడా రూ.1కోటితో ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్‌ కాకినాడ హెడ్‌ అక్షయ బక్ష, సీఎస్‌ఆర్‌ హెడ్‌ పి.సుబ్రహ్మణ్యం, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జే. రంగలక్ష్మీదేవి, ఎపీఈడబ్లుఐడీసీ ఈఈ వి.లక్ష్మణ రెడ్డి, ఏ.ఎస్‌.డబ్లులు జీ.జాన్‌ బాబు, పీ.ఎన్‌.వీ. సత్యనారాయణ, వాణి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.