Aug 04,2023 16:21

ప్రజాశక్తి - రేపల్లె:నిబందనలు పాటించని ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రేపల్లె మండల విద్యాశాఖ అధికారి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆర్య మాట్లాడుతూ జిల్లాలో విద్యాహక్కు చట్టం ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యా సంస్థలకు చుట్టంలా పనిచేస్తుందని జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వల్లే కార్పొరేట్‌ విద్యా సంస్థలు విచ్చలవిడితనంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు, కార్పొరేట్‌ విద్యా సంస్థల ఆగడాలను అరికట్టడంలో ఎస్‌ఎఫ్‌ఐకి ఉన్న చిత్తశుద్ధి కూడా విద్యాశాఖ అధికారులకు లేదని అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని తమ పనితీరు మార్చుకోకుంటే ఎస్‌ఎఫ్‌ఐ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రేపల్లెలో రెండవ శనివారం, ఆదివారం సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహించి విద్యార్థుల మానసిక పరిస్థితి అర్థం చేసుకోకుండా హింసిస్తున్నారని పండుగల సమయంలో కూడా సెలవులు ఇవ్వకపోవడంతో మండల విద్యాశాఖ అధికారి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు, విద్యా హక్కు చట్టం జీవో నెంబర్‌ 1/94 ప్రకారం ప్రతి పాఠశాలలను తల్లిదండ్రుల కమిటీ వేసి పాఠశాలల్లో చేసే నిర్ణయాలను తల్లిదండ్రుల కమిటీతోపాటు విద్యార్థి సంఘ నాయకులతో చర్చించాలని ఈ నిబంధనను ఏ ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యా సంస్థ కూడా పాటించడం లేదని అన్నారు. ట్యూషన్‌ పేరుతో అనుమతులు లేకుండా రాత్రి 8 గంటల వరకు స్టడీ హవర్స్‌ పెట్టడం సరికాదన్నారు. రాత్రి సమయంలో ఆడపిల్లలు పాఠశాల నుండి ఇంటికి వెళ్లడానికి అనేక ఆటంకాలు ఉన్నాయని, బస్సుల కోసం ఆటోల కోసం రోడ్లమీద ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. 8 గంటల వరకు ట్యూషన్‌ పెడుతున్న పాఠశాలల నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి సూర్య ప్రకాష్‌, నాయకులు ప్రవీణ్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.