
దేశంలో మహిళలపై యాసిడ్ దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ యాసిడ్ దాడులను పురుషాహంకారానికి ప్రతీకగా చూడాల్సి వుంది. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో ద్వారకకు చెందిన పదిహేడేళ్ల అమ్మాయిపై జరిగిన యాసిడ్ దాడి ఇందుకు తాజా ఉదాహరణ. 2005లో యాసిడ్ దాడికి గురై, ప్రాణాలతో బయటపడిన లక్ష్మీ అగర్వాల్ తనలాంటి బాధితుల హక్కుల కోసం పోరాడుతున్నది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టిన సందర్భాలలో అసహనంతో అనాలోచితంగా ఇటువంటి దాడులకు ఒడిగట్టడం మానవత్వానికే మాయని మచ్చ.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం 2016 నుంచి 2021 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 1686 యాసిడ్ దాడులు జరిగాయి. అంటే ప్రతీ సంవత్సరం సగటున 250 నుంచి 300 యాసిడ్ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. 2021లో ప్రతి నెలా సగటున 14 యాసిడ్ దాడులు జరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ యాసిడ్ దాడుల్లో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉన్నాయి. తన ప్రేమను అంగీకరించలేదనే ఒకే ఒక కారణంగా....సదరు అమ్మాయి జీవితాన్ని, అందాన్ని చెరిపివేయాలనే దుర్మార్గపు ఆలోచనతో ఈ యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారు. 2013 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని దుకాణాల్లో యాసిడ్ అమ్మరాదు. కానీ ఇటీవల ఆన్‌లైన్ ద్వారా కూడా యాసిడ్ అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది. నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా వుంది.
గత కొన్ని సంవత్సరాలుగా యువత మీద పలు వెబ్‌సైట్ల ప్రభావం వుంటోంది. అవి వారిలో చెడు అలవాట్లు, సెక్స్, హింసా ప్రవృత్తిని ప్రేరేపించేలా వున్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎక్కువ సమయం కేటాయించాలి. వారు చూసే వెబ్‌సైట్లు, చేసే స్నేహాలపై దృష్టి సారించాలి. తల్లిదండ్రులు, టీచర్లు స్నేహితుల వలే మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలి.
ఈరోజు కుటుంబ సభ్యులు ఒకే చోట ఉన్న సందర్భంలో కూడా ఎవరి సెల్ గోల వారిదే. దగ్గరగా ఉన్నా దూరం పెంచుకుంటున్న పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మానసిక రుగ్మతలు పెరిగి, నానా సమస్యలు తలెత్తుతున్నాయనిపిస్తోంది. ముఖ్యంగా దేశంలో దాదాపు 40 శాతం మంది ప్రజానీకం పలురకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అసహనం, హింసా ప్రవృత్తి రోజురోజుకు పెరిగిపోతున్నది. రకరకాల మత్తులకు యువత బానిస అవుతున్నది.
వ్యక్తుల సమూహమే సమాజం. అటువంటి వ్యక్తుల జీవన విధానం ఒక క్రమ పద్ధతిలో కొనసాగితేనే సమాజంలో చోటుచేసుకుంటున్న వికృత చేష్టలకు చెక్ పెట్టగలం. మన ప్రవర్తన మీదనే సమాజం ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. అప్పుడు మాత్రమే యాసిడ్ దాడులు, అఘాయిత్యాలు, హత్యలు, ఆత్మహత్యలు వంటి వాటిని అరికట్టగలం.
అదే సమయంలో పాలకుల పని తీరు, స్వభావం కూడా ప్రజలపై ప్రభావం చూపుతుందనే విషయం నేటి పాలకులు, ప్రభుత్వాలు గ్రహించాలి. చట్టాలు చేయడమే కాకుండా, వాటిని సక్రమంగా అమలు చేయడంలోనూ చిత్తశుద్ధి చూపాలి. రేప్ చేసిన వారు, యాసిడ్ దాడుల చేసిన వారు, హత్యలు మానభంగాలు చేసిన వారు, అవినీతిపరులు బయట ప్రపంచంలో స్వేచ్ఛగా సంచరిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. నేరారోపణ ఎదుర్కొంటున్న వారు జైలు నుండి బయటకు వస్తుంటే, భారీ ఎత్తున పూలదండలు, బాణాసంచా కాల్చి ఆహ్వానం పలుకుతుండటం దేనికి సంకేతం ?
పౌర సమాజమూ ఆలోచన చేయాలి. మానవ విలువలకు, నైతిక ప్రవర్తనకు మారు పేరుగా నిలవాల్సిన మన దేశం...అసభ్యకర ప్రవర్తనకు, హింసకు, అవినీతికి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుండడం బాధాకరం. మన చుట్టూ అవిద్య, నిరుద్యోగం, పేదరికం తాండవిస్తుంటే, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతుంటే, అత్యాచారాలు, యాసిడ్ దాడులు పెరిగిపోతుంటే బతుక్కు భద్రత ఎలా వుంటుంది? ఇటువంటి తరుణంలో ....తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మీడియా, ప్రభుత్వాలు, పాలకులు తమ సమయాన్ని, బాధ్యతలను అంకిత భావంతో చిత్తశుద్ధితో నిర్వర్తించడం ద్వారానే ఉత్తమ పౌర సమాజాన్ని నిర్మించగలం.
- ఐ.పి.రావు,
సెల్ : 6305682733