
సిపిఎస్ రద్దు నేడు ఎన్నికల ఎజెండాగా మారింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగించుకున్న హిమాచల్ ప్రదేశ్, తాజాగా ఎన్నికల నగారా మోగిన గుజరాత్ రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు అంశాన్ని ఎజెండా పైకి తెచ్చారు ఉద్యోగులు. ఇక్కడ బిజెపి ఓటమి పాలైతే సిపిఎస్ రద్దుకు సానుకూల పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పుడు దేశంలో ఓపిఎస్ అమలవుతున్న రాష్ట్రాల సంఖ్య ఐదుకు చేరింది. ఏడుకు చేరే దారి వెదకాలి. అలాగే 2023 మే, డిసెంబర్ నెలల మధ్య కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలు ముందుకొస్తున్నాయి. అక్కడ కూడా సిపిఎస్ సమస్యను ఎన్నికల ఎజెండాగా మార్చాల్సిన అవసరముంది. ఇక్కడ కూడా ప్రధానంగా ఓపిఎస్ అమలుకు మోకాలు అడ్డం పెడుతున్న పార్టీ బిజెపి. మిగతా పార్టీలపై ఒత్తిడి పెంచగలిగితే సిపిఎస్ రద్దుకు గట్టి హామీ పొందగల అవకాశం వుంది. ఇక 2024లో జాతీయ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. జాతీయ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికల వేడి తగలక మానదు. 2022, 2023 ఎన్నికల్లో ఆశించిన విధంగా సిపిఎస్ రద్దుకు కట్టుబడిన ప్రభుత్వాలు వచ్చినట్లైతే, 2024 జాతీయ ఎన్నికల నాటికి సిపిఎస్ రద్దు విషయాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు విస్మరించలేని ఒక అనివార్య పరిస్థతి ఏర్పడుతుంది. సిపిఎస్ రద్దు కావాలంటే దేశంలో ఈ సానుకూల పరిస్థితులే సమకూరాలి. అప్పుడిక 2024లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నాటికి సీన్ రివర్స్ కాక తప్పదు. అయితే ఈ అంచనాలు వాస్తవ రూపం దాల్చాలంటే, ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సిపిఎస్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకోవాలి. అందుకోసం సదస్సులు, సెమినార్లు, ధర్నాలు, ఆందోళనలు అవిశ్రాంతంగా జరుగుతూనే వుండాలి. చిన్న చిన్న అవరోధాలకే ఆగిపోకూడదు. పాలక వర్గాలు తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాయి. మొన్న సెప్టెంబర్‌లో జరిగిన సిపిఎస్ వ్యతిరేక ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అణచివేసిన తీరు దీనికి ఉదాహరణ. కాబట్టి జావగారిపోవడం కాదు. తట్టుకొని నిలబడాలి. అందుకు ఐక్య కార్యాచరణ అత్యవసరం. ఉద్యోగులు వారి సంఘాల మధ్య గరిష్ట స్థాయి ఐక్యత సాధించడంతో పాటు కార్మిక సంఘాల సహకారాన్ని కూడా తీసుకోవాలి. వాస్తవానికి సిపిఎస్ చట్టం కాకుండా 2004 నుండి దాదాపు దశాబ్ద కాలం పాటు పార్లమెంట్‌లో పోరాడింది వామపక్షం. కాబట్టి సిపిఎస్ వ్యతిరేక ఉద్యమానికి వామపక్ష పార్టీలు, వాటి ఆధ్వర్యంలోని ప్రజాసంఘాలు నిజమైన మిత్రులు. ఈ విధమైన విశాల మద్దతు కూడగట్టగలిగితేనే ఉద్యోగుల సిపిఎస్ రద్దు కల నెరవేరుతుంది. కాబట్టి ఉద్యోగులు, వారి సంఘాలు ఈ దిశగా ఆలోచించి ఆచరణకు పూనుకోవడం నేటి కర్తవ్యం.
- వి.రాజగోపాల్,
సెల్ : 9133084262