Jan 29,2023 07:53

చారడేసి కళ్లు.. వంకీల జుట్టు.. అన్నింటికి మించిన అభినయం.. ఆమెను గొప్పనటిని చేశాయి. వెండితెరపై వెలుగొందిన తార.. కృష్ణుడు అంటే ఎన్టీఆర్‌ ఎలాగో, సత్యభామ అంటే జమునే మన మదిలో మెదులుతారు. మిస్సమ్మ చిత్రంలో అమాయకత్వం.. పండంటికాపురంలో రాణీ మాలినీదేవి.. మూగమనసులలో గౌరమ్మ.. గుండమ్మ కథలో పెంకిపిల్ల.. ఇలా అనేక పాత్రలు ఆమె అద్భుత అభినయానికి అద్దంపడతాయి. నాటితరం తెలుగు ప్రేక్షకుల్లో ఆమె అభిమానులు అనేకమంది.. ఆమె స్టయిల్‌ను ఫాలో అయిన నాటి మహిళలు ఎందరో.. తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకులుగా రాణించినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అందులో కొందరు మాత్రమే తమదైన కళా ప్రతిభను ప్రదర్శించి, తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి నటీమణుల్లో మణిపూస జమున. ఆమె మాతృభాష తెలుగు కాకపోయినా, తెలుగింటి అమ్మాయిగా ప్రేక్షకుల మదిలో స్థిరస్థాయిగా నిలిచిపోయారు.
తండ్రి వ్యాపారరీత్యా మకాం దుగ్గిరాలకు మార్చారు. అక్కడే జమున హైస్కూలు విద్యాభ్యాసం మొదలైంది. చదువులోనే కాదు.. ఆటపాటల్లోనూ జమున ఫస్టే. అంతరజిల్లా పాటల పోటీల్లో జమునకు ప్రథమ బహుమతి వచ్చింది. అప్పటి నుంచీ నటన, గానం, సంగీతంపై ఆమె మక్కువ ఏర్పడింది. 'ఛలో ఢిల్లీ' నాటకంలో వసుంధర పాత్ర పోషించారు. అప్పట్లో కమ్యూనిస్టుల ప్రాభవం.. ప్రజానాట్యమండలిగా వర్ధిల్లుతున్న దశ. ఆ సమయంలో గరికపాటి రాజారావుగారు జమునతో 'మా భూమి' నాటకంలో కమల చెల్లెలుగా కీలకపాత్ర వేయించారు. ఆమె నటనను చూసి, సినీ పరిశ్రమకూ రాజారావుగారే పరిచయం చేశారు. బుర్రకథ పితామహుడు నాజర్‌ ఆధ్వర్యంలో జమున శిక్షణ తీసుకొన్నారు. సంగీతం అంటే జమునకు మక్కువ. చిన్నప్పుడే హార్మోనియం, వీణ నేర్చుకొన్నారు.

  • సినీ అరంగేట్రం..
1

దుగ్గిరాలకు చెందిన శ్రీమన్నారాయణకు చిత్రసీమతో అనుబంధం ఉంది. ఆయన కొన్ని చిత్రాల్లో నటించారు. ఆయన సిఫార్సు మేర 'జై వీర భేతాళ' అనే జానపద చిత్రంలో కథానాయికగా జమునకు అవకాశం వచ్చింది. అందులో గుమ్మడి కథానాయకుడు. స్కూలు ఫైనల్‌ పరీక్షల్ని సైతం పక్కన పెట్టి, అమ్మానాన్నలతో మద్రాస్‌ బయల్దేరింది జమున. 'జై వీర భేతాళ'లో మంచి వేషమే. ఈ సినిమాతో కెరీర్‌ మలుపు తిరుగుతుందనుకున్నారు జమున. కానీ దురదృష్టవశాత్తూ ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అయితే.. జమున నిరాశ పడలేదు. ఆ విషయం ఆమె ఎక్కడా ప్రస్తావించేవారు కాదు. ఆ వెంటనే ప్రజానాట్యమండలికి చెందిన గరికపాటి రాజారావు నిర్మించిన 'పుట్టిల్లు'లో ఛాన్స్‌ వచ్చింది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే 'వద్దంటే డబ్బు' ఆఫర్‌ వచ్చింది. అయితే ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. తొలి సినిమా ఆగిపోవడం, రెండు చిత్రాలు ఫ్లాప్‌ అవ్వడంతో జమున కెరీర్‌ ఏమవుతుందోనని అనుకున్నారు. కానీ 'మా గోపీ' చిత్రం ఆర్థికంగా విజయం సాధించడంతో పాటు జమునకూ మంచిపేరు తెచ్చింది. 'నిరుపేదలు', 'మిస్సమ్మ', 'వదిన గారి గాజులు', 'అంతా మనవాళ్లే' ఇలా వరుస విజయాలతో జమున చిత్రసీమలో ఒక వెలుగు వెలిగారు. ఏ పాత్రకైనా జమున సరితూగుతుందన్న గుర్తింపు తెచ్చుకొన్నారు. 'దొంగరాముడు', 'తెనాలి రామకృష్ణ', 'మూగ నోము', 'రాము', 'బొబ్బిలి యుద్ధం', 'నాదీ ఆడజన్మే', 'పూల రంగడు', 'రాముడు - భీముడు'... ఇలా ఒకటా రెండా, పదుల సంఖ్యలో సినిమాలన్నీ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. అన్నపూర్ణ, జగపతి, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ వంటి పెద్ద సంస్థలన్నింటిలోనూ జమున చిత్రాలు చాలానే చేశారు. ఎన్టీఆర్‌తో ఏకంగా 31 చిత్రాల్లో జమున కథానాయికగా నటించారు. దాదాపు అవన్నీ హిట్లే. అన్నింట్లోనూ రకరకాల పాత్రలు చేయడం వైవిధ్యభరితంగా జమున పేరొందారు. అలా జమున కెరీర్‌ నాన్‌స్టాప్‌గా దూసుకుపోయిందనే చెప్పాలి.

  • పదేళ్లుగా కథనాయికగా..
1

కథానాయికగా పదేళ్లు చిత్రసీమలో ఉండడం ఓ అరుదైన ఘనత. దానికి కారణం.. విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటన. అల్లరి అమ్మాయిగా, పొగరుబోతు గృహిణిగా, అమాయకపు ఇల్లాలిగా ఇలా అన్ని పార్వ్శాలూ పలికించారు. సత్యభామ పాత్రలకు ఆమెదే పేటెంట్‌. సత్యభామ పాత్రని ఎలా చేయాలో భావి తరాలకు ఆమె ఓ పాఠం నేర్పించి వెళ్లారు. 'వినాయక చవితి'లో తొలిసారి సత్యభామ అవతారం ఎత్తారు జమున. అందులో ఆ పాత్ర సాత్వికంగానే ఉంటుంది. 'శ్రీకృష్ణ తులాభారం'లో మాత్రం సత్యభామగా జమున విశ్వరూపం చూడొచ్చు. 'సత్యభామ పాత్రని నువ్వు చేయలేవు..' అని హితులు, శ్రేయోభిలాషులు ఆమెను వెనక్కిలాగే ప్రయత్నం చేస్తే ఓ ఛాలెంజ్‌గా స్వీకరించి, ఆ పాత్రని రక్తికట్టించారు. అప్పటి నుంచీ.. సత్యభామ పాత్రంటే జమున గుర్తుకురావడం పరిపాటి. 'పండంటి కాపురం'లో రాణీ మాలినీదేవి.. పాత్ర జమున కెరీర్‌లో మరో కలికితురాయి.

  • ట్రెండ్‌ ఫాలోయర్‌..
1

పెద్దింటి అమ్మాయిగా రాణీమాలినీ దేవిగా ఆమె చూపించిన దర్పం.. ఇంకెవ్వరికీ సాటి రాదు. జమున కట్టు బొట్టు కూడా కొత్తగా కనిపిస్తాయి. ఆమె కళ్లకు పెట్టుకునే కాటుక దగ్గర నుంచి, ఆమె చీర కట్టుకూ అప్పట్లో ఎంతోమంది అభిమానులు. 'జమున చీరలొచ్చారు' అంటూ వస్త్ర దుకాణాల దగ్గర బోర్డులు పెట్టేవారంటే.. ఆ రోజుల్లో జమున క్రేజ్‌ని ఎంతుందో అర్థం చేసుకోవొచ్చు. ఆమె స్టయిల్‌ను హావభావాలతో సహా నాటి మహిళలు ఫాలో అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. ఆమె మాట తీరు, ఆ దర్పం అన్నీ ఆమె అభిమానులు చాలామంది అనుకరించేవారు.

  • ఇష్టాయిష్టాలు..

జమునకు కుక్కలంటే చాలా ఇష్టం. ఆమె ఇంట్లో ఎప్పుడూ ఓ అరడజను బుజ్జి కుక్కలు తిరుగుతూ ఉంటాయి. దాదాపు తన జీవిత కాలంలో దాదాపుగా వంద కుక్కపిల్లల్ని పెంచుకొన్నారావిడ. ఆమెకు వెన్న, మీగడ అంటే ఎంతో ఇష్టం. తన స్నేహితుల దగ్గరికి ఆమె ఎప్పుడు వచ్చినా.. వారు ఆమె దగ్గరికి వచ్చినా వెన్న, మీగడ తీసుకుని వస్తారు. ఆమెకు అవి అంటే అత్యంత ప్రీతిపాత్రం.

  • విభేదాలు..సర్దుబాట్లు..
1

'భూకైలాస్‌' చిత్రం షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటన కారణంగా ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ జమునతో కలసి నటించకూడదని నిర్ణయించుకొన్నారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు వీరి ముగ్గురి మధ్య మాటలే లేవు. 'గుండమ్మ కథ' చిత్రంతో వీరి మధ్య రాజీ కుదిరింది. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, జమున లను ఒకచోట కూర్చో బెట్టి రాజీ కుదిర్చింది చక్రపాణి. అక్కినేని సరసన గుండమ్మ కథ చిత్రంలో నటించిన జమున ఈ ఒప్పందంలో భాగంగా నందమూరితో 'గులేబకావళి కథ' చిత్రంలో నటించారు. అలాగే అక్కాచెల్లెళ్లలా ఉండే సావిత్రితో కూడా ఎవరో గిట్టనివాళ్లు తగాదాపెట్టారని, ఏడాదిపాటు మాట్లాడుకోలేదనీ, ఆ తర్వాత మళ్లీ కలిసిపోయామని జమున ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే తమిళ చిత్రసీమలో జయలలితతోనూ రిహార్సల్స్‌ సందర్భంలో గొడవపడినా, ఆమె నటన చూసి, ఫిదా అయినట్లు జమున ఒక సందర్భంలో చెప్పారు.

  • కొత్త హీరోలతోనూ..
1

హీరోయిన్‌గా అగ్ర స్థానంలో ఉన్న తరుణంలో కూడా కొత్త హీరోల సరసన నటించడానికి జమున అభ్యంతరం చెప్పేవారు కాదు. కైకాల సత్యనారాయణ తొలి చిత్రం 'సిపాయి కూతురు'లో జమునే హీరోయిన్‌. అలాగే రమణమూర్తి తొలి చిత్రం 'ఎమ్మెల్యే'లో కూడా జమున కథానాయికగా నటించారు. అలాగే హరినాథ్‌ తొలిచిత్రం 'మా ఇంటి మహలక్ష్మి'లో జమునే కథానాయిక. వీరి తర్వాత తరంలో కృష్ణంరాజు విలన్‌ వేషాల నుంచి హీరో పాత్రలు వేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన సరసనా జమున నటించారు. సాధారణంగా హీరోయిన్లకు కెరీర్‌ చాలా తక్కువ. నిత్యం పోటీని ఎదుర్కొంటూ కొంతకాలం తర్వాత తెర మరుగవుతుంటారు. కానీ జమున విషయం అలా కాదు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌తో ప్రారంభించి, తర్వాతి తరం హీరోలు కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, రామకృష్ణతో కూడా ఆమె నటించారు. హాస్య చిత్రాల కథానాయకుడు చలం సరసన 'మట్లిలో మాణిక్యం' సినిమాలో జమున హీరోయిన్‌గా నటించడం ఆ రోజుల్లో సంచలనం. దాదాపు పాతికేళ్లు హీరోయిన్‌గా కొనసాగి, జమున చరిత్ర సృష్టించారు.

  • ఆ పాట నాడు గొప్ప క్రేజ్‌..

ఎన్టీఆర్‌, కృష్ణ హీరోలుగా నటించిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో 'తొలిసారి నిన్ను చూశాను నేను' పాటలో జమున ఇచ్చిన అప్పియరెన్స్‌ అప్పట్లో పెద్ద క్రేజ్‌. అందులో హీరో అమ్మాయిలతో ఎక్కువగా తిరుగుతుంటాడు. అలాంటి క్యారెక్టర్‌ పక్కన ఎందుకు చేశావంటూ జమున విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. ఆ సమయంలో కృష్ణ, జమున 'మమత' చిత్రంలో కలసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కొడైకెనాల్‌లో జరుగుతున్నప్పుడు 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం పాటలో నటించమని కృష్ణ అడిగితే జమున కాదనలేకపోయారని ఒక సందర్భంలో ఆమె చెప్పారు.

  • బహుభాషా నటి..
1

జమున కన్నడ అమ్మాయి అయినా.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా నటించారు. ఆ చిత్రాలు కూడా ఘన విజయాలందుకున్నాయి. తమిళ మహానటులు ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌, జెమినీ గణేశన్‌ వంటి వారితో జమున నటించి, ఆకట్టుకున్నారు. 'పణం పడుత్తుం పాడు' (1954), చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. 'మిస్సియమ్మ(మిస్సమ్మ)', తెనాలి రామన్‌, తంగమలై రహస్యం, తిరుట్టు రామన్‌, నాళయతీర్పు వంటి పలు విజయవంతమైన చిత్రాలు జమున నటించినవే. క్యారెక్టర్‌ నటిగా 'తూంగాదే తంబి తూంగాదే' చిత్రంలో కమల్‌హాసన్‌కు తల్లిగా నటించారు. అప్పట్లో తమిళ పరిశ్రమలో హీరోలకు సమానంగా పారితోషికం పొందిన సావిత్రి తర్వాత ఆ స్థాయిలో అందుకున్న నటి జమునే.
మూడేళ్ల పాటు ఇద్దరు అగ్ర హీరోలు జమునని దూరం పెట్టారు. ఆ సమయంలో జమున బాలీవుడ్‌పై దృష్టి పెట్టారు. అక్కడ 12 చిత్రాల్లో నటించారు. 'మిలన్‌' చిత్రం ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వచ్చింది. అప్పుడే చాలామంది ముంబైకి మకాం మార్చేయమని జమునకు సలహా ఇచ్చారు. అందుకు ఆమె సమ్మతించలేదు. తెలుగు చితస్రీమని వదల్లేదు. 'గుండమ్మ కథ'తో జమున హవా మళ్లీ మొదలైంది. కథానాయికగా కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే తిరుపతిలో జువాలజీ లెక్చరర్‌గా పనిచేస్తున్న రమణారావుని వివాహం చేసుకొన్నారు జమున. పెళ్లి తరవాత కూడా పదేళ్ల పాటు కథానాయికగా అగ్ర స్థానంలోనే ఉన్నారు. అందుకు భర్త సహకారం చాలా ఉందని ఆమె ఒక సందర్భంలో చెప్పారు. ఆ తరవాత కొడుకు వంశీకృష్ణ, కూతురు స్రవంతి పుట్టారు. అటు పిల్లల్ని చూసుకొంటూ, ఇంటి వ్యవహారాలు చక్కబెట్టుకొంటూ, సినిమాల్లోనూ జమున రాణించారు.

  • నా కూతుర్ని చూసి గర్వపడుతుంటా!

స్రవంతి ప్రపంచస్థాయి కళాకారిణిగా రాణిస్తుంది. అమ్మగా ఇంతకంటే సంతోషం ఏం కావాలి? ఐ లవ్‌ హర్‌. మనవడూ అమ్మ దారిలోనే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు అని ఆమె కూతురు, మనవడు గురించి సగర్వంగా చెబుతారామె.

  • కలకాలం కళాకారిణిగా..

కళాకారుల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎనలేని సేవలు చేశారు జమున. రాష్ట్రమంతా తిరిగి పదివేల మంది కళాకారుల వివరాలు సేకరించారు. వాళ్లకు ఇళ్లస్థలాలు మంజూరు చేయడంలో కృషి చేశారు. కొన్ని కాలనీలకు 'జమున' పేరు పెట్టడం ఆమె కృషికి నిదర్శనం.

- స్నేహ డెస్క్‌