Sep 20,2023 22:06

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, అసైన్డ్‌ చట్టసవరణకు బిల్లు
గుర్తింపు కోసం అధార్‌
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :పెన్షన్‌ స్కీమ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం మార్పు రాలేదు. పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఒపిఎస్‌) అమలు చేయాలన్న ఉద్యోగుల విజ్ఞప్తులను బేఖాతరు చేసింది. ఎన్నికల హామీని సైతం విస్మరించి గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌ (జిపిఎస్‌)కు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రిమండలి ఈ మేరకు రూపొందంచిన బిలులను ఆమోదించింది. నేటి (గురువారం) నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లును ఈ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనితో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా మంత్రిమండలి సమావేశం తీసుకుంది. సమావేశానంతరం సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రిమండలి నిర్ణయాలను మీడియాకు వివరించారు. సమాచారశాఖ కమిషనర్‌ టి.విజయకుమార్‌రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గన్నారు. ఎపి కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ బిల్‌ 2023ను మంత్రిమండలి ఆమోదించిందని, దీని వల్ల 2014 జూన్‌ 2వ తేదీ కంటే ముందు నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులు 21,748 మంది క్రమబద్దీకరణ అవుతారని తెలిపారు. వేర్వేరు విభాగాల్లో 10,115 మంది, ఎపివివిపిలో 11,633 మందికి లబ్దికలగనుందని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికి జిపిఎస్‌ను అమలు చేస్తామని చెప్పారు. ఉద్యోగ విరమణ సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లస్థలం కూడా ఉండటం లేదని, వారికి ఇళ్ల స్థలం ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అలాగే వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చూడాలనీ మంత్రిమండలి నిర్ణయించింది. వీటికి సంబంధించిన బిల్లులనూ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. చిరు ఉద్యోగులకు ఈ నిర్ణయం వరం లాంటిదని మంత్రి పేర్కొన్నారు. స్టాఫ్‌ ప్యాట్రన్‌ చట్టం 1994కు సవరణలు చేసినట్లు ఆయన తెలిపారు. దీని ప్రకారం డెఫ్‌ ఒలంపిక్స్‌, టెన్నిస్‌, మిక్స్‌డ్‌ డబుల్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన టీం కెప్టెన్‌ షేక్‌ జఫ్రీన్‌కు గ్రూప్‌-1 సర్వీసులో కోఆపరేటివ్‌ సర్వీస్‌ ఆఫ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ హోదా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఎపి వైద్య విధాన పరిషత్‌ చట్టం 1986ను రద్దు చేసి దాని పేరును డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌గా మార్చారు. ఈ బిల్లును కూడా అసెంబ్లీలో పెట్టనున్నారు. క్యాన్సర్‌ రోగులకు మరింత మెరుగైన చికిత్సలు అందించే చర్యల్లో భాగంగా విశాఖ కెజిహెచ్‌, గుంటూరు జిజిహెచ్‌, కపడ జిజిహెచ్‌లో క్యాన్సర్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో 353 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే 50 వేలమందిని వైద్య రంగంలో నియమించారని తెలిపారు. గ్రామీణ ప్రజలకూ వైద్యం చేరువ చేసే ప్రక్రియలో భాగంగా 53 వేలమందిని నియమించారని తెలిపారు. ఇక ముందు వేకేన్సీ ఉంటే వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకునేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఒంగోలు, ఏలూరు, విజయవాడలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల్లో 168 పోస్టులు, 11 ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యకళాశాలల్లో 99 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష మీద వైద్య రంగంలో ఉన్న అన్ని స్థాయిల సిబ్బంది అవగాహన కల్పిస్తారని తెలిపారు. దీని కింద నిర్వహించే పరీక్షలన్నీ ఉచితంగానే చేస్తారని, మందులూ ఉచితంగా ఇస్తారని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు యూనివర్శిటీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ మరియు రెగ్యులేషన్‌ చట్టం 2016 చట్ట సవరణ బిల్లును మంత్రిమండలి ఆమోదించింది. ప్రైవేటు యూనివర్శిటీలు కొత్తగా ఏర్పాటు చేస్తే వచ్చే అదనపు సీట్లలో 35 శాతం కన్వీనర్‌ కోటాలోకి వస్తాయని మంత్రి తెలిపారు. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాలలో 50 శాతం సీట్లు ఎస్‌టి విద్యార్థులకు కేటాయించేలా ప్రతిపాదనలను ఆమోదించారు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసే విధంగా ఎపి లెజిస్లేచర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఆధార్‌ చట్టంపై బిల్లు తెచ్చేందుకు మంత్రిమండలి ఆమోదించింది. వ్యక్తుల గుర్తింపు కోసం అధార్‌ వినియోగంపై చట్టబద్ధత తేవాలనేది దీని ఉద్దేశమని మంత్రి తెలిపారు. పోలవరం నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ అంచనా ఖర్చులో 8420 ఇళ్లకు రూ.70 కోట్ల అదనపు మంజూరుకు ఆమోదించారు.

  • యుపిఎస్‌సిలో ఉత్తీర్ణులకు ఆర్థిక సాయం

ఎపిలో యుపిఎస్‌సిలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఎస్‌సి, బిసి, ఎస్‌టి విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహం పేరుతో అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం ప్రిలిమ్స్‌లో సెలక్టయిన వారికి లక్ష, మెయిన్స్‌కు రూ.50 వేలు సాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యాశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలు అందుబాటులోకి తేవాలని మంత్రి మండలి నిర్ణయించింది, ఇంటర్నేషనల్‌ బకలారియట్‌ సిలబస్‌కు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. . మొదటి తరగతి నుండి ప్రారంభించి తరువాత అన్ని తరగతులకు విస్తరించనున్నారు. దీనికి ఎంఓయు కూడా చేసుకున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా కమ్యూనికేషన్‌ గ్యాప్‌ అనేది లేకుండా ఉంటుందని తెలిపారు. బాపట్ల, నాయుడుపేట, తణుకు మున్సిపాలిటీల్లో చదరపు మీటరుకు ఏడాదికి రూపాయి అద్దె ప్రాతిపదికన సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టుకు భూమి కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కాకినాడ బల్క్‌డ్రగ్‌ ప్రాజెక్టును అనకాపల్లి జిల్లా నక్కపల్లికి తరలింపునకు ఆమోదం తెలిపింది.

  • పలుశాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదముద్ర

ఉత్తరాంధ్ర పరిధిలో చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు రెండు భర్తీ చేయనున్నారు. ఎపి కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అధారిటీ శాశ్వత విభాగం ఏర్పాటు కోసం పదికొత్త పోస్టుల ఏర్పాటుకు ప్రతిపాదించగా ఆమోదించినట్లు తెలిపారు. చీఫ్‌ ఎలక్టోరల్‌ కార్యాలయంలో పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపారు. ఇకముందు యూనివర్శిటీల్లో నియామకాలు ఎపిపిఎస్‌సి ద్వారానే జరగాలని నిర్ణయించారు. ఆదోనీ వైద్యకళాశాలలో, 13 స్పెషల్‌ డిప్యూటీ, ఆరు డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఎపి హైకోర్టులో 40 ఆఫీసు సబార్డినేట్‌ పోస్టులు 28 డ్రైవర్‌ పోస్టులు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించేందుకు ఆమెదం తెలిపారు. ఎపి మోటార్‌ వెహికల్‌ చట్టం 1963 చట్ట సవరణనూ, అసైన్డ్‌ ల్యాండ్‌ చట్టం 1977కు సవరణ చేస్తూ తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో చినముషిడివాడలో ఎస్‌బిఐ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌కు ఎకరా భూమి 33 ఏళ్లపాటు లీజకు ఇవ్వనున్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం నాగులవరంలో 100 ఎకరాలను ఎపిఐఐసికి కేటాయించారు. గుంటూరుకు చెందిన విశ్వమానవ సమైఖ్యతా సంస్థద్‌ పరిషత్‌కు ఏడు ఎకరాలు కేటాయించారు. నెల్లూరు, కృష్ణా, బాపట్ల, విశాఖపట్నం జిల్లాల్లో ఫ్రభుత్వ శాఖలకు అవసరమైన భూముల కేటాయింపులకు ఆమోదం తెలిపారు.

  • విశాఖ పాలనా కేంద్రంపై చర్చ జరగలేదు

విశాఖలో దసరా నుండి పరిపాలనా కేంద్రం ఏర్పాటు చేస్తారన్న ప్రచారాన్ని మంత్రి కొట్టి పారేశారు. అసలు అటువంటి చర్చ జరగలేదన్నారు. విశాఖకు ఎప్పుడు వెళ్లాలనేది ముఖ్యమంత్రి చెబుతారని అన్నారు. దీనిపై ప్రత్యేకంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా లేదని పేర్కొన్నారు. విశాఖ పాలనా కేంద్రమని, అమరావతి శాసనరాజధాని, కర్నూలును న్యాయ రాజధాని అనిగతంలోనే నిర్ణయం జరిగిందపోయిందని పేర్కొన్నారు.

  • చంద్రబాబు అవినీతి నిరూపితం అయింది

చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని, దీనికి సంబంధించిన అనేక అధారాలను అధికారులు సేకరించారని మంత్రి తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై క్యాబినెట్లో చర్చ జరిగిందా అని విలేకరులు ప్రశ్నించగా అటువంటిదేమీ లేదని, అయినా ఆయన ఇప్పటికే జైల్లో ఉన్నాడని, ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదని తెలిపారు. అవినీతికి పాల్పడ్డాడని విచారణలోనూ తేలిందని, సంస్థలను మేనేజ్‌ చేయగలిగే వ్యక్తిగా పేరొందిన చంద్రబాబు చివరకు జైలు జీవితం అనుభవిస్తున్నాడని తెలిపారు. సిద్ధార్థ లూథ్రా లాంటి ప్రముఖ న్యాయవాదులు వచ్చి వాదించినా వారి వాదనల్లో పస లేకపోవడం వల్లే కోర్టు రిమాండు విధించిందని పేర్కొన్నారు.

  • జమిలిలో కేంద్ర నిర్ణయం ప్రకారమే

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపైనా క్యాబినెట్లో చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగానే వెళదామని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది.