Jul 12,2023 22:26
  • అసైన్డ్‌ భూముల యజమానులకు యాజమాన్య హక్కులు
  • పోలవరం ముంపు, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఇంజనీరింగ్‌ విభాగం
  • దళితుల స్మశాన వాటికలకు 1050 ఎకరాలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా భూమిలేని నిరుపేదలకు అసైన్డ్‌ భూములను పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా 54,129.45 ఎకరాలను 46,935 మంది పేద రైతులకు పంపిణీ చేసేందుకు సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశం ఆమోదించింది. లంక భూముల విషయంలో మూడు కేటగిరీల కింద 9,062 ఎకరాల రైతులకు అనుకూలంగా అసైన్‌మెంట్‌ పట్టాలు ఐదేళ్ల లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా 19,176 మంది రైతులకు మేలు జరగనుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. అసైన్డ్‌ భూములను కేటాయించి 20 ఏళ్లు పూర్తయ్యిందని, ఒరిజనల్‌ అసైన్డ్‌దారునికి హక్కులు అనుభవించేలా భూయాజమాన్య హక్కులను ఇచ్చేందుకు కేబినెట్‌ గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఒరిజనల్‌ అసైన్డ్‌ యజమాని చనిపోయి ఉంటే వారి కుటుంబ సభ్యులకు లీగల్‌హైర్‌ ద్వారా వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 22 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. గ్రామాల్లో కులవృత్తులు చేసుకునే వారికి ఇనామ్‌ భూములు ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో ఉండేవని, వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. ఫలితంగా 1,13,610 మంది రైతులకు 1,68,603.71 ఎకరాల భూములు ఈ జాబితా నుంచి తొలగించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 2013కు ముందే వీరందరికీ రైత్వారీ పట్టాలిచ్చినప్పటికీ 2013 అనంతరం ఆయా భూములపై మళ్లీ ఆంక్షలు పెట్టారని, ఆంక్షలను తొలగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్‌సిలకు స్మశాన వాటికలకు స్ధలాలు లేవని సర్వేలో తేలిందని, ఇందులో 1700 రెవెన్యూ గ్రామాల్లో వారికి అందుబాటులోని 1050.08 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. స్మశానాలకు స్ధలాల కేటాయింపు అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. మరో 266 రెవెన్యూ గ్రామాల్లో భూసేకరణ చేసి ప్రభుత్వం ఇవ్వనుందని వివరించారు. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీమ్‌ కింద గతంలో 16,213 ఎకరాలు పొందిన నేపథ్యంలో కట్టాల్సిన రుణాలను రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 14,233 మందికి గతంలో భూములు, వారు కట్టాల్సిన రుణాలను ప్రభుత్వం మాఫీ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కూడా మాఫీ చేయడంతో రూ.2 వేల కోట్ల విలువైన భూములపై వారికి పూర్తిహక్కులు కలుగుతాయని పేర్కొన్నారు. వీరందరికీ ఆగస్టు మొదటి వారంలో హక్కు పత్రాలను ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు సహాయ పునరావాస పనుల కోసం ప్రత్యేక ఇంజనీరింగ్‌ డిపార్టుమెంట్‌ ఏర్పాటు. ఆరుగురు అధికారులు, 73 పోస్టులతో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ శాఖల సిబ్బందితో ప్రత్యేక విభాగం ఏర్పాటు. వీటికి అదనంగా మరో ఆరు ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు భర్తీ.

విశాఖ భూముల అక్రమాలకు సంబంధించి ముగ్గురు సభ్యుల సిట్‌ తొలి నివేదికకు మంత్రివర్గం ఆమోదం. మొత్తం 69 సిఫార్సులకు ఆమోదం. మరో 18 సిఫార్సులపై మరింత శోధన అవసరమని నివేదిక.

సిఆర్‌డిఎ పరిధిలో ఈనెల 24న పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం. 50,793 మందికి పట్టాలివ్వగా అందులో 47,017 ఇళ్లు మంజూరయ్యాయి. లే అవుట్లలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ.384.52 కోట్లు కేటాయింపు.
అర్చకులకు పదవీ విరమణ లేకుండా చేసిన చట్టసవరణకు ఆమోదం. ప్రభుత్వ ఉద్యోగులలాగానే దేవాదాయశాఖ ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ వయస్సు 60 నుంచి 62కు పెంపు.
కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాల్లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు మంజూరు. తాడేపల్లి రెవెన్యూ డివిజన్‌లో 19 పోస్టుల మంజూరు. కొత్తగా ఏర్పాటు చేసిన ఒంగోలు, అనంతపురం, నంధ్యాల, చిత్తూరు, విజయనగరం, మచిలీపట్నం సౌత్‌ మండలాల్లో 70 పోస్టుల మంజూరుకు ఆమోదం.
రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో దర్యాప్తు విభాగానికి తొమ్మిది పోస్టుల మంజూరు. వీటితో పాటు మరో 21 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.
చెన్న్తోకడపావిజయవాడ, కడపాబెంగుళూరు, కడపావిశాఖపట్నం మధ్య విమానాలు నడుపుతున్న ఇండిగోకు మరో ఏడాది వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కొనసాగింపు.
ఎపి వైద్య విధాన పరిషత్తును ప్రభుత్వ విభాగంలో కలిపేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌కి మంత్రి వర్గ ఆమోదం. విశాఖ పట్టణంలో విమ్స్‌ను మెడికల్‌ కళాశాలగా మార్పు.
ప్రస్తుతం ఉన్న 11 మెడికల్‌ కళాశాలల్లో కార్డియాలజీ, కేథలాబ్‌, సిటివిసి విభాగాల్లో 94 పోస్టుల మంజూరుకు ఆమోదం. ప్రతి మూడు నెలలకొకసారి నివేదిక ఇవ్వాలని సిఎం ఆదేశం.
వైఎస్‌ఆర్‌ జిల్లా గండికోట ముంపు బాధితులకు రూ.454.6 కోట్లు. 10,231మంది కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీ, ఫేజ్‌ 2, 3లో ముంపు బాధితుల తరహాలోనే ఫేజ్‌ా1 బాధితులకు రూ.10 లక్షల చొప్పున ప్యాకేజీ. ఎపిఐఐసి పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమలకు 352.79 ఎకరాల కేటాయింపునకు సంబంధించి 44 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కర్నూలులో క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 247 పోస్టులు మంజూరు చేశారు.

కేబినెట్‌ ఆమోదించిన అంశాలు క్లుప్తంగా..

  • భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి, లంక భూముల కేటాయింపునకు ఆమోదం.
  • అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద జిందాల్‌ న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్ల పంపెడ్‌ స్తోరేజీ ప్రాజెక్టుకి ఆమోదం.
  • టిడ్కో కాలనీల్లోని 260 ఎకరాలను విక్రయించడంతో పాటు హడ్కో నుంచి రూ.750 కోట్లు రుణంగా తీసుకునే ప్రతిపాదనకు అనుమతి.
  • గండికోట రిజర్వాయర్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.454 కోట్ల పరిహారం ప్యాకేజీ మంజూరుకు ఆమోదం తెలిపింది.
  • జూలై నెలలో చేపట్టే సంక్షేమ పథకాల అమలుకు ఆమోదం.
  • ఈ నెల 18 జగనన్న తోడు, 21న నేతన్న నేస్తం పథకాల అమలుకు ఆమోదం.
  • సున్నా వడ్డీ కింద రూ.1,350 కోట్లు, జగనన్న విదేశీ విద్య, తదితర పథకాల అమలుకు లబ్ధిదారులకు ఆర్థిక సాయం.
  • భూమిలేని నిరుపేదలకు అసైన్డ్‌ భూమిపై ఆంక్షలు తొలగిస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
  • 54వేల ఎకరాల అసైన్డ్‌ భూములు, 9,062 ఎకరాల లంక భూములపై రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ కేబినెట్‌ ఆమోదం.
  • 20 ఏళ్లుగా హక్కులు లేని అసైన్డ్‌ భూములకు హక్కులు కల్పిస్తూ నిర్ణయం.
  • 1700 రెవెన్యూ గ్రామాల్లో 1050 ఎకరాల భూమిని స్మశానవాటికలకు కేటాయింపు.
  • ల్యాండ్‌ పర్చేస్‌ స్కీమ్‌ కింద ఉన్న భూమికి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను మినహాయిస్తూ నిర్ణయం.
  • 22ఏ లో ఉన్న ఇనాం భూముల విషయంలోనూ హక్కులు కల్పించేందుకు కేబినెట్‌ ఆమోదం.
  • విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బందికి ఉద్యోగ విరమణ వయసు 63 నుంచి 65 ఏళ్లకు పెంపు.
  • ఏపీలోని 5 కొత్త మెడికల్‌ కళాశాలల్లో 706 పోస్టులు, బోధన కోసం 480 పోస్టుల భర్తీకి ఆమోదం.
  • పోలవరం ప్రాజెక్టు పునరావాసం కోసం ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగం ఏర్పాటు.. పోస్టుల భర్తీకి నిర్ణయం.
  • ప్రభుత్వ పరిధిలోని దేవాలయాల్లో ఆర్చకులకు ఉద్యోగ విరమణ లేకుండా చట్ట సవరణకు ఆమోదం.
  • కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో 13 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుల భర్తీకి నిర్ణయం.
  • విశాఖలో భూముల కుంభకోణంపై సీట్‌ నివేదికకు ఆమోదం. మరోమారు ఈ వ్యవహారంపై విచారణకు అనుమతి.