May 05,2023 11:01

హైదరాబాద్‌ : మండుటెండలో నగరంలో ప్రధాన రోడ్లపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్‌ సిబ్బంది అవస్థలు అన్నీఇన్నీ కావు.. ముఖ్యంగా ఎండకు ఎదురు నిలబడి ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేస్తూ ... హెల్మెట్‌లో తల ఉడుకెత్తిపోతుంటే.. చమటలు కారుతూ ట్రాఫిక్‌ సిబ్బంది పడే బాధ అందరికీ తెలిసిందే..! మరి.. ఆ ట్రాఫిక్‌ సిబ్బంది పెట్టుకునే హెల్మెట్‌లో ఏసీ ఉంటే..! ఆహా.. మండుటెండలో తల చల్లగా అన్నట్లుంది కదా..!

ట్రాఫిక్‌ సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏసీ హెల్మెట్లు వచ్చేశాయ్..! రాచకొండ సీపీ వీటిని రెండు రోజుల క్రితం ప్రయోగాత్మకంగా కొంతమంది సిబ్బందికి అందజేశారు. బ్యాటరీతో నడిచే ఈ హెల్మెట్‌ లోపల, ముఖానికి, మూడు వైపుల నుంచి చల్లని గాలి వీచేలా తయారుచేశారు. దీనిలోని బ్యాటరీని అరగంట ఛార్జింగ్‌ చేస్తే 3 గంటలపాటు వస్తుంది. హెల్మెట్ల పనితీరు బాగుంటే మిగిలిన కానిస్టేబుల్స్‌కు అందించాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.