Jul 19,2023 13:33

డమాస్కస్‌ :   సిరియా రాజధాని డమాస్కస్‌పై బుధవారం ఇజ్రాయిల్‌ దాడికి తెగబడింది. ఈ దాడిలో ఇద్దరు సిరియా సైనికులకు గాయాలైనట్లు స్థానిక మీడియా సనా తెలిపింది. ఇజ్రాయిల్‌ ఆక్రమిత గోలెన్‌హైట్స్‌ నుండి స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 12.25 గంటలకు ఇజ్రాయిల్‌ క్షిపణులను ప్రయోగించిందని మీడియా తెలిపింది. సిరియా వైమానిక దళం ఆ క్షిపణులను ఎదుర్కొందని, చాలావరకు వాటిని కూల్చివేసినట్లు వెల్లడించింది. రాజధానికి పశ్చిమాన ఉన్న బీరట్‌ - డమాస్కస్‌ జాతీయ రహదారిపై ఉన్న డైమస్‌ నగరంలోని విమానాశ్రయానికి సమీపంలోని సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. క్షిపణులు సిరియా ప్రభుత్వ మిత్రుడైన లెబనీస్‌ సైనిక స్థావరం హజ్బుల్లాను తాకినట్లు పేర్కొంది. ఈ దాడిలో ఇద్దరు సిరియన్‌ సైనికులు గాయపడగా, కొంతమేర ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపింది.

సిరియా లక్ష్యంగా ఇజ్రాయిల్‌ దాడులకు దిగడం ఈ ఏడాది ఇది 20వ సారి అని బ్రిటన్‌కి చెందిన 'సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌' ప్రకటించింది. ఈ నెల 2న సిరియాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే. హోమస్‌ నగరంపై జరిపిన దాడిలో ఆస్తి నష్టం జరిగిందని సిరియా సైన్యం పేర్కొంది. ఇజ్రాయిల్‌ గతకొన్నేళ్లుగా డమాస్కర్‌ మరియు ఉత్తర సిరియన్‌ నగరమైన అలెప్పోలోని అంతర్జాతీయ విమానాశ్రయాలపై పలుసార్లు దాడిత చేసింది.