అలసిన నా మనసుకి అవని అంత ఓర్పు కావాలి
కదిలే నా పాదాలకు గగనమంత
విశాలమైన శాంతి కావాలి
మదిలో మెదిలే నా ఆలోచనలకు
కాస్త విరామం కావాలి
పరుగులు తీసే నా ఆవేశానికి
అడ్డుకట్ట వేసే ఒక మాట కావాలి
పరవళ్ళు తొక్కే నా కలానికి
కాస్త మనశ్శాంతి కావాలి
నా ఆలోచనలకు ఏకాంతం కావాలి
ఉరుకుల పరుగుల ఈ కాలంలో
పలకరించే బంధం కావాలి
మర మనుషులు తిరిగే
ఈ కాలంలో బంధుత్వం కావాలి
నన్ను నన్నుగా మార్చే ఆత్మబలమే
ఆయుధంగా కావాలి
నిజాన్ని బద్దలు కొట్ట గలిగేంత ధైర్యం కావాలి
మరిగే ఆవేశం కరిగించే మంచితనం కావాలి
సంద్రంలో ఇమిడి పోయిన
నా కన్నీరు కరిగే రోజు రావాలి
ఏరులై పారుతున్న
నా గుండె రోదన ఆగే క్షణం కావాలి
నిశీధి అంచుల్లో సంచరిస్తున్న
నా ఆవేదన అంతం కావాలి
నిండు పున్నమి వెలుగులో
జాజి కొమ్మ నేను అవ్వాలి
విశ్వాన్ని నిద్ర పుచ్చే హాయి పాట నేను అవ్వాలి
నా కోసం నేను బ్రతికే రోజు నాకు కావాలి
నాకు నేనే కావాలి....
పోలగాని.భానుతేజశ్రీ
విజయవాడ