ప్రజాశక్తి - యంత్రాంగం : ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులతో అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, అల్పపీడన ప్రభావంతో గంటకు 30 - 40 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతాల్లో గాలులు వీచే అవకాశాలున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. మహానందిలో 96.8 మిల్లీమీటర్లు, అత్యల్పంగా ఉయ్యాలవాడలో 14.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు జలుమూరు మండలం కొమనాపల్లి వద్ద వంశధార నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కూర్మనాథపురం సమీపంలోని 3 ఆర్ కాలువ కుడి గట్టుకు గండిపడటంతో కూర్మనాథపురంతో పాటు రామయ్యవలస, తాళ్లవలస, గుగ్గిలి, గుండువలస, పాగోడు, కరవంజ తదితర గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాలు ముంపునకు గురయ్యాయి. పాగోడు గ్రామ సమీపంలోని 11 ఆర్ కాలువపై నిర్మించిన వంతెన ఎత్తుగా లేకపోవడంతో కొమనాపల్లి, శ్రీముఖలింగం, మర్రివలస, అచ్యుతాపురం, నగరికటకం, కత్తిరివానిపేట, సురవరం, దంపాకు, తిమడాం, సైరిగాం, అల్లాడ, అందవరం, పర్లాం, మాకివలస తదితర గ్రామాలకు చెందిన వేలాది ఎకరాలు నీటి మునిగాయి. ఆమదాలవలస మండలంలోని దూసి, కొత్తవలస వద్ద పంట పొలాలు నీట మునిగాయి.










