
సమాజంలో కొందరు తమ సంపాదనను కుటుంబానికి ఖర్చు చేస్తూ, ఇంకా ఉంటే తరువాతి తరాల కోసం దాస్తుంటారు. మరికొందరు మాత్రం తాము సంపాదించిన దానిలో ఇతరులకు సహాయపడటానికి ఉపయోగిస్తారు. పుదుచ్చేరికి చెందిన సి.గణేషన్ ... వికలాంగ పిల్లలకు అన్ని విధాలుగా సహాయం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వైకల్యం ఉన్న పిల్లల్లో ఆత్మన్యూనతాభావాన్ని పోగొట్టడానికి, వారిలో నిబిడీకృతమైన సృజనాత్మకత శక్తులను వెలికితీయటం ద్వారా ఉన్నతులుగా తయారు కావటానికి తన వంతుగా కృషి చేస్తున్నారు.

1989లో పుదుచ్చేరికి చెందిన సి.గణేషన్ అధ్యాపకుడిగా పనిచేసేవారు. అతడి అక్క జిప్‌మర్‌లో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అతడు తన అక్కకు తోడుగా వైద్యశిబిరాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఓసారి జిప్‌మర్ సంస్థ ద్వారా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. తన అక్కతో పాటు ఆ శిబిరానికి వెళ్లిన గణేశన్ ... శిబిరానికి హాజరైన పిల్లలను చూసి గణేషన్ చలించిపోయాడు. శారీరక వైకల్యంతో బాధపడే పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు ఇలా అనేకమంది ఇక్కడికి వచ్చారు. నడవలేని వారు, మరుగుజ్జుతనం, చూపులేనివారు, మూగ, చెవిటి వారు, మానసిక వైకల్యంతో బాధపడేవారు ... ఇలా రక రకాల సమస్యలతో బాధపడేవారు తారస పడ్డారు. ఈ శిబిరానికి రావటానికి వారు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశాడు. వారికి తగిన శిక్షణ ఇస్తే ... వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ఏమన్నా సాధిస్తారు కదా ... అని బలంగా భావించాడు.
కారున్నై విద్యాసంస్థ ఏర్పాటు
ఆ ఆలోచనను అక్కతోనూ, భార్యతోనూ పంచుకొని ... పుదుచ్చేరిలో వికలాంగ పిల్లల కోసంకారున్నై స్కూలు ఏర్పాటుచేశాడు. అది పూర్తిగా ప్రత్యేకావసరాలున్న పిల్లల కోసమే! అది సఫలం కావటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. వికలాంగ పిల్లలకు చదువుతోపాటు వివిధ నైపుణ్యాల్లో కూడా శిక్షణ ఏర్పాటు చేశారు. మరికొందరికి థెరపీ సైతం అందజేశారు. గణేషన్ చేస్తున్న కృషిని స్వచ్ఛంద సంస్థలు గుర్తించాయి.
రోటరీ క్లబ్ ఆఫ్ కాస్మోస్, రోటరీ క్లబ్ సెంట్రల్, ఇంటిగ్రా సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ వంటి సంస్థలు విరాళాలను అందజేశాయి. గణేషన్ సతీమణి రేవతి కూడా ఈ కృషిలో భాగస్వాములయ్యారు. ఆమె ఆడియాలజీ, స్పీచ్ థెరపీలో స్పెషలిస్ట్‌గా మారారు. పిల్లలతో మరింత మమేకమయ్యారు. పిల్లలకు చదువుతోపాటు వారు ఆనందంగా గడిపేందుకు క్రీడలు, చిత్రలేఖనం, సంగీతం వంటి వాటిలో తర్ఫీదు ఇస్తున్నారు.
నైపుణ్యం సాధించి..
కరున్నైలోని అధ్యాపకులు, తల్లిదండ్రులు, సహాయక సిబ్బంది పిల్లలతో సన్నిహితంగా మెలుగుతారు. తగిన బోధనా పద్ధతులను కొనసాగిస్తారు. విద్యార్థి బలాబలాలు, వారి అవసరాలను బాగా అర్థం చేసుకోవటానికిగాను తల్లిదండ్రులతో మాట్లాడారు. తెలుసుకున్న అంశాల ఆధారంగా సమగ్ర విద్యా విధానంతో బోధన అందుబాటులో ఉంచుతారు. చదవటం, రాయటం, ఆర్థిక అక్షరాస్యత, అవసరమైన సాంకేతికత, వ్యక్తిగత, సామూహికంగా అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 8 మంది అనాథలతోపాటు 85 మంది విద్యార్థులు ఉన్నారు.
తొమ్మిదేళ్ల క్రితం కారున్నైలో చేరినప్పుడు బహూర్‌కు చెందిన అజిత్ వయసు 15. ఇప్పుడు అతడు దుకాణం, వంటగదిని నిర్వహిస్తున్నాడు. కారున్నై నుండి వచ్చే జీతంతో తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ సంస్థలో పనిచేస్తూ, తమ కుటుంబ ఇంటి నిర్మాణానికి ఇప్పటివరకు రూ.4.5 లక్షలు సహాయంగా ఇచ్చానని మురుగవల్లి గర్వంగా చెప్పారు. మత్తిని బంధువులు విడిచిపెట్టడంతో పోలీసులు కారున్నైకి తీసుకొచ్చారు. నేడు, అతను నివాసి మాత్రమే కాదు. ఇంటి పర్యవేక్షకుడు కూడా. ఎన్‌ఐఒఎస్ స్కీమ్ ద్వారా 10 మంది ఇక్కడి విద్యార్థులు సెకండరీ విద్యను పూర్తి చేశారు. మరికొందరు మెకానిక్, స్క్రీన్ ప్రింటింగ్, బుక్ బైండింగ్, హౌస్ కీపింగ్‌లో శిక్షణ పొందుతున్నారు.