
భారతీయులు ఒక జాతిగా మనుగడ సాగించటానికి ప్రధానమైన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతం. దీనికి బద్ధ విరోధులు పరివారీయులు. భిన్నత్వం అసలు వద్దే వద్దు. ఏకత్వం కన్నా ఏకీకరణే ముద్దు. అంటే యూనిటీ కన్నా యూనిఫార్మిటీ ముద్దు. వివిధ వర్గాలవారు ఐకమత్యంగా వుండటం కన్నా ఒకేవిధంగా ఉండటం వీరికి ప్రధానం. అలా అయితేనే దేశం బలంగా ఉంటుందనేది వారి వాదన. ఒకే విధం అంటే మెజారిటీ ప్రజలు ఎలా ఉంటే మిగతా వారు కూడా అలాగే ఉండటం అన్నమాట. ఈ భావజాలంలో భిన్నత్వానికి తావెక్కడిది ? అందరూ ఒకే సైజు చెప్పులు వేసుకుంటే బాగా నడుస్తారనటం లాంటిదే ఇది గూడా ! అందుకే ఇది వితండ వాదం.
ఇప్పుడు దేశంలో ఏకరూప పౌర స్మృతి గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చర్చ కొన్ని వర్గాలకే పరిమితమైంది గాని సామాన్య ప్రజలు దీన్ని గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. వాస్తవానికి సామాన్య ప్రజలకు ఇది ఒక పెద్ద విషయమే కాదు. కొంతమంది ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్న విషయం సామాన్య ప్రజానీకానికి పెద్ద విషమేమీ కాకపోవటానికి కారణం ప్రజల అవసరాలకు, పాలకుల అభిరుచులకు మధ్య వున్న వ్యత్యాసమే. ఏమిటీ ఆ వ్యత్యాసం? ప్రజలు కోరుకుంటున్నది రోటీ, కపడా, మకాన్. అంటే కడుపు నిండా తిండి, వంటి నిండా బట్ట, తల దాచుకోటానికి నీడ. కానీ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్నది అయోధ్యలో రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు, ఏకరూప పౌర స్మృతి.
ప్రజలు కోరుకుంటున్నది మెరుగైన ఉపాధి అవకాశాలు, మెరుగైన విద్య, వైద్య సదుపాయం, తాగునీరు, సాగు నీరు, స్థిరమైన విద్యుత్తు, అందుబాటులో వుండే నిత్యావసర వస్తువుల ధరలు. కానీ సంఫ్‌ు పరివార్ ప్రాధాన్యం మాత్రం హిందీ, హిందూ, హిందుత్వ. ఇది ఈనాటిది కాదు. భారతీయులు ఒక జాతిగా మనుగడ సాగించటానికి ప్రధానమైన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి బద్ధ విరోధులు పరివారీయులు. భిన్నత్వం అసలు వద్దే వద్దు. ఏకత్వం కన్నా ఏకీకరణే ముద్దు. అంటే యూనిటీ కన్నా యూనిఫార్మిటీ ముద్దు. వివిధ వర్గాలవారు ఐకమత్యంగా వుండటం కన్నా ఒకేవిధంగా ఉండటం వీరికి ప్రధానం. అలా అయితేనే దేశం బలంగా ఉంటుందనేది వారి వాదన. ఒకే విధం అంటే మెజారిటీ ప్రజలు ఎలా ఉంటే మిగతా వారు కూడా అలాగే ఉండటం అన్నమాట. ఈ భావజాలంలో భిన్నత్వానికి తావెక్కడిది? అందరూ ఒకే సైజు చెప్పులు వేసుకుంటే బాగా నడుస్తారనటం లాంటిదే ఇది గూడా! అందుకే ఇది వితండ వాదం. ఈ ఏకీకరణ వాదం ఒక ఉన్మాద భావజాలం లోనుంచి పుట్టింది. వైవిధ్యాలను సహించదు. ఒకే విధానం కావాలి దేశమంతటా అంటుంది. ఒక దేశం ఒక ఎన్నిక, ఒక దేశం ఒక పన్ను, ఒక దేశం ఒక పౌర స్మృతి. తదుపరి ఒక దేశం ఒక భాష అనే నినాదాలు ఈ ఏకీకరణలో భాగమే. ఆ పైన ఒక దేశం ఒక వాతావరణం అన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతానికి ఒక దేశం ఒక ఎన్నిక అనేది కుదరలేదు. అది కుదిరేదికాదు మన రాజ్యాంగ వ్యవస్థలో అని చెప్పలేదు కేంద్ర ఎన్నికల సంఘం. పార్లమెంటుకు శాసన సభలకూ ఒకేసారి ఎన్నికలకు మేము సిద్ధమే అని చెప్పింది! కానీ అది రాజ్యాంగపరంగా కుదిరేది కాదని తెలుసుకొని ప్రస్తుతానికి వెనకడుగు వేశారు పాలకులు.
అయితే 21వ లా కమిషన్ మాత్రం ఏకరూప పౌర స్మృతి పస్తుత పరిస్థితులలో అవసరం లేదు, అభిలషణీయం కూడా కాదని తేల్చిచెప్పింది 2018లో. అది కూడా ఎంతోమంది అభిప్రాయాలు తీసుకొని, ఎంతోమంది భాగస్వాములతో చర్చలు జరిపిన తరువాత చేసింది ఆ సిఫార్సు. అయితే, అది పాలకులకు రుచించలేదు కనుక బుట్ట దాఖలు చేసి, పార్లమెంటుకు ఎన్నికలు కేవలం సంవత్సరం లోపు ఉండగా మళ్ళీ ఈ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. ఏకరూప పౌరస్మృతి మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో పార్లమెంటు ఆలోచించవలసిన అంశం ఒకటి వున్నది. ఇది చాలా చాలా కీలకమైన అంశం. ఈ అంశం ప్రాధాన్యతను మనం పెద్దగా గుర్తించినట్లు అనిపించడంలేదు. అదేంటంటే సామాజిక పరివర్తన చట్టం ద్వారా వస్తుందా అన్న ప్రశ్న.
ఏకరూప పౌర స్మృతి గూడా సామాజిక పరివర్తన కోసం ఉద్దేశించబడినదే గదా! మనిషి అంతరంగాన్ని మార్చటం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం గదా. సమాజం తీరు తెన్నులు మారడం అంటే మనిషి ఆలోచనా విధానంలో మార్పు రావటమేకదా ? మనిషి వేరు సమాజం వేరు కాదు కదా. మరి ఈ మార్పు కేవలం చట్టం ద్వారానే సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నకి అవును అని సమాధానం చెబితే అది అవివేకమూ, అమాయకత్వమూ అవుతుంది. దీన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే విషయం అర్ధమౌతుంది. ఇప్పటి వరకు ఏ దేశంలోనూ చట్టం ద్వారా సామాజిక మార్పు రాలేదు. మనలాంటి దేశాల్లో అది ఇంకా మరీ కష్టం. సంప్రదాయం అనేది మనిషి అంతరంగంలో తరతరాలుగా జీర్ణించుకొని పోయి వుంటుంది. అటువంటి పరిస్థితిలో హడావుడిగా చట్టం చేసి రేపటి నుంచి మనుషులు ఈ విధంగా ఆలోచించాలి, ఈ విధంగా వ్యవహరించాలి అని ఆదేశించటం సాధ్యమా ?
మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషిలోనూ సమాజ ధోరణిలోనూ మార్పు రావాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. మనిషిని ఒప్పించి తీసుకువచ్చే మార్పు నిలబడుతుంది. మనిషిని నొప్పించి తీసుకువచ్చే మార్పు నిలవదు. ఒక పద్ధతిలో నుంచి మరో పద్ధతిలోకి మారటం అంటే రైలు బండి పట్టాలు మారినంత యాంత్రికంగా జరగదు. మనిషి మార్పు అవసరాన్ని అర్ధం చేసుకోవాలి, ఆ మార్పుని అంతర్లీనం చేసుకోవాలి. ఇది చాలా సమయం పట్టే ప్రక్రియ. ఇది జరగటానికి ముందు అనేక సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు, శక్తులు బహుళ వ్యూహంతో మనిషి ఆలోచన మార్చాలి. మనిషిని ఒప్పించటానికి ఓపికతో వ్యూహాన్ని అమలు చెయ్యాలి. ఈ వ్యూహాన్ని ఎవరు అమలు చెయ్యాలి? మార్పును కోరేవారు అమలు చెయ్యాలి. ఎప్పుడైనా మార్పును కోరేవారు మొదట్లో కొద్దిమందే వుంటారు. ఆ కొద్దీ మంది సమాజాన్ని ప్రభావితం చేసేవారై ఉండాలి. సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి కవులకు, కళాకారులకు, మేధావులకు, విద్యావంతులకు, సంఘసంస్కర్తలకు, మీడియాకు ఉంటుంది. వీరందరూ కలసి మనిషి ఆలోచనా విధానాన్ని మార్చే ప్రయత్నం చెయ్యాలి. ఇది ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనే అయ్యేది కాదు. మనం కోరుకున్న మార్పు సాకారం అవ్వటానికి సహనం, సంయమనం చాలా అవసరం. ఎప్పుడైతే మార్పు కోరేవారు మార్పుకు అనువైన వాతావరణం సృష్టిస్తారో అప్పుడే మనిషి ఆ మార్పు అవసరాన్ని అంతర్లీనం చేసుకుంటాడు. మార్పును అంగీకరించటానికి సిద్ధమవుతాడు. తన నడవడిని మార్చుకోవటానికి సుముఖంగా ఉంటాడు. అది చట్టం చెయ్యటానికి సరైన సమయం. అంతేగానీ సమాజాన్ని మార్పుకి సిద్ధం చెయ్యకుండా చట్టం చేసి చేతులు దులుపుకుంటే వచ్చేదేమీ ఉండదు.
ప్రస్తుత సందర్భంలో కూడా ప్రజలు కోరుకుంటున్నది ఒకటి, పాలకులు ఇవ్వాలనుకుంటున్నది వేరొకటి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలుగానీ పార్లమెంటుగానీ ప్రజల అభీష్టం మేరకే వ్యవహరించాలిగానీ అందుకు భిన్నంగా వెళ్ళరాదు. ఒకవేళ ప్రభుత్వం ప్రజల అభీష్టానికి విరుద్ధంగా నడుస్తుంటే అది తప్పు అని చెప్పాల్సిన గురుతర బాధ్యత మీడియా మీద వున్నది. కానీ ప్రధాన మీడియా ఆ బాధ్యతను విస్మరిస్తున్నట్లు కనిపిస్తుంది. పార్లమెంటు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం పట్ల ఆ మీడియా వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. ఏకరూప పౌర స్మృతి సందర్భంగా పాలకులు వ్యవసాయ చట్టాల విషయంలో ఎదురైన అనుభవాన్ని విస్మరించటం విచారకరం. ఏ రైతుల శ్రేయస్సు కోసం సాగు చట్టాలు చేశామని చెప్పారో ఆ రైతుల విశ్వాసం పొందలేకపోయారు. దానికి అవరసమైన కసరత్తు చెయ్యలేదు. వ్యవసాయ చట్టాల మీద సరైన చర్చ జరగలేదు. రైతు సంఘాలతో సంప్రదింపులు జరగలేదు. జీవితాన్ని ప్రభావితంచేసే చట్టాలు చేసేటప్పుడు సంబంధిత వర్గాలలో అవగాహన కల్పించవలసిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. సాగు చట్టాల విషయంలో అది జరగలేదు. రైతులకు వ్యవసాయం వృత్తి కాదు. అది వారికి జీవితం. ఆ జీవితాన్ని చట్టం ద్వారా ఇబ్బందుల పాలుచేస్తున్నారు అనుకొన్న రైతుల మనోభావాలను అర్ధం చేసుకోలేకపోయారు నాయకులు. ఇప్పుడు ఏకరూప పౌర స్మృతి విషయంలోనూ అదే జరుగుతోంది.
ప్రజల విశ్వాసాలు, ఆచార సంప్రదాయాలతో ముడిపడి వున్న అంశాల మీద చట్టం చెయ్యటం సులువు కాదు. దానికి ముందుగా ప్రజలను సమాయత్తం చెయ్యాలి. మార్పు పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించాలి. విస్తృతమైన చర్చ జరగాలి. వివాహం, విడాకులు, సంతానం, దత్తత, వారసత్వం అనేవి ఉద్వేగంతో కూడుకున్న వ్యక్తిగత అంశాలు. ఇటువంటి సున్నితమైన అంశాల మీద చట్టం చేసే ముందు చాలా కసరత్తు చెయ్యాల్సి ఉంటుంది. ఆయా వర్గాల వారితో విస్తృత సంప్రదింపులు జరపాలి. వారి విశ్వాసాన్ని పొందాలి. పౌర స్మృతి ఆచారాలు, సంప్రదాయాలతో కూడుకున్నది. ప్రజలకు ఏదో చేసినట్లు చూపించాలి. అది అనుత్పాదక అంశాలయితే ప్రజలు బేరీజు వేసుకోలేరు. వారికి ఏ మాత్రం ప్రయోజనం అనేది. అందుకనే వివాదాస్పదమైన విషయాలను తెర మీదకు తీసుకువస్తే ప్రజల దృష్టి మరల్చడం శులభం. దీనివలన ఎన్నికల్లో గెలిచినా చరిత్రహీనులుగా నిలిచిపోయే ప్రమాదం వున్నది. అన్నివేళలా చరిత్రను తిరగరాయలేము అన్న విషయం కూడా తెలుసుకోవాలి. కానీ నేటి పాలకులు చరిత్ర గతిని మార్చాలనుకుంటున్నారు. కానీ ఈ కోరిక నెరవేరేది కాదని తెలుసుకోవాలి. ప్రపంచంలో ఏ దేశంలోనూ చరిత్రను తిరగ రాయటం కుదరలేదు. అలాంటి ప్రయత్నం వల్ల భావితరాల వారికి చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సత్యాన్ని తెలుసుకునే హక్కు అందరికీ వుంది. మరో విషయమేమిటంటే మన రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 ప్రకారం ఏకరూప పౌర స్మృతి కోసం రాజ్యం కృషి చెయ్యాలని ఆదేశించిన మాట వాస్తవం. అదే ఆదేశిక సూత్రాలు ప్రజా సంక్షేమానికి సంబంధించి పలు అంశాలను నెరవేర్చాలని గూడా ఆదేశించిన సంగతి మరచి పోరాదు. ప్రజాసంక్షేమాన్నీ నెరవేర్చే అంశాలను అమలు చేయాలంటే ఆర్థిక వనరులు కావాలి. ఏకరూప పౌర స్మృతికి నిధులేమీ అవసరం లేదు, ఇది అనుత్పాదక అంశం కాబట్టి. మతపరమైన అంశాలమీద, ఆచారాలు సంప్రదాయాలమీద చట్టం చేసేటప్పుడు అనుసరించవలసిన జాగ్రత్తలు ఏవీ పాటించటం లేదు. ఇది ప్రజల్లో అసంతృప్తిని, అపోహలను సృష్టించగలదు. అందువలన పట్టుదలకు పోకుండా సంయమనం పాటించి ప్రజలకు తగు సమయమిచ్చి లోతుగా చర్చించిన తరువాతే ముందుకు వెళ్తే ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీడియా సంస్థలు కూడా విడమర్చి విశదీకరించి చెప్పవలసిన గురుతర బాధ్యతను విస్మరించరాదు.
(వ్యాసకర్త లోక్‌సభ సచివాలయంలో మాజీ డైరెక్టర్)
గుమ్మడిదల రంగారావు