- ఐలు రాష్ట్ర నాయకులు సిహెచ్ ఎల్ ఎస్ మూర్తి
ప్రజాశక్తి -పల్నాడు జిల్లా :లౌకిక విధానానికి ఏకరూప పౌరస్మృతి గొడ్డలిపెట్టు అని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర నాయకులు సిహెచ్‌ఎల్‌ఎస్ మూర్తి తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ కార్యాలయంలో ఏకరూప పౌరస్మృతిపై ఆదివారం సెమినార్ జరిగింది. పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌కు ప్రముఖ న్యాయవాది బి సలీం అధ్యక్షత వహించారు. సెమినార్‌లో సిహెచ్‌ఎల్‌ఎస్ మూర్తి మాట్లాడుతూ.. యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని దేశ భవిష్యత్తు అభివృద్ధిలో ముందుకెళ్తుందని మతోన్మాదులు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనిని తిప్పికొట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల్లో చరిత్ర కనుమరుగయ్యే విధంగా కొత్త పాఠ్యపుస్తకాలు తయారు చేస్తు న్నారన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడపాలని బిజెపి ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. భారత రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయకుండా, కాషాయీకరణ పరిపాలన చేస్తోన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పాలించే హక్కు లేదన్నారు. బిజెపి ప్రభుత్వం చేస్తోన్న అరాచకాలను, దాడులను రాజకీయాలకతీతంగా ఖండించాలని కోరారు. కార్యక్రమంలో పల్నాడు విజ్ఞాన కేంద్రం కన్వీనర్ మస్తాన్‌వలి, గిరిజన రాష్ట్ర నాయకులు కోటా నాయక్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.