Nov 08,2022 07:12

భారతదేశంలో అతని నియామకం గురించి ఎంత హడావుడి చేసినప్పటికీ, రిషి సునాక్‌కు సంబంధించిన ఈ వివరాలకు ఏ మాత్రమూ ప్రాధాన్యత లేదు. అతడు బ్రిటిష్‌ ఫైనాన్స్‌ పెట్టుబడి ఎంచుకున్న వ్యక్తి అన్నదే ప్రధానం. గోల్డ్‌మన్‌ సాక్స్‌ సంస్థలో అతను ఉద్యోగిగా ఇదివరకు పని చేశాడు. హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరించాడు. అతను ద్రవ్య పెట్టుబడి ప్రపంచం నుండి వచ్చిన వ్యక్తి. కార్పొరేట్‌ ఫైనాన్స్‌ మనిషి.

అందుచేత అటు పన్ను రాయితీలు, ఇటు ప్రభుత్వ వ్యయం తగ్గింపు-రెండూ ఒకేసారి అమలు జరిగినప్పుడు దేశంలో వచ్చే మొత్తం లాభాలలో కార్పొరేట్లకు వచ్చే వాటా పెరుగుతుంది. అదే సమయంలో చిన్న, మధ్య తరహా పెట్టుబడిదారుల వాటా తగ్గుతుంది.

రిషి సునాక్‌ కార్మిక వర్గాన్ని బలి చేయడం ద్వారా మాత్రమే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలను కుంటున్నాడు. ధరల పెరుగుదలను అదుపు చేయడానికి వేతనాల తరుగుదలను సాధనంగా చేయాలనుకుంటున్నాడు.

లండన్‌ మహానగరంలో లివర్‌ పూల్‌ స్టేషన్‌కి ఒక చదరపు కి.మీ పరిధిలో ఉన్న ప్రాంతం బ్రిటిష్‌ ఫైనాన్సు పెట్టుబడికి దుర్గంగా ఉంది. ఇప్పుడు ఆ బ్రిటిష్‌ ఫైనాన్స్‌ పెట్టుబడి పూర్తి పైచేయి సాధించింది. తన విశ్వాసాన్ని కోల్పోయిన ఒక ప్రధానమంత్రిని కేవలం 44 రోజుల్లోనే సాగనంపడమే కాదు, తను ఎంపిక చేసిన ఇంకొక వ్యక్తిని వెంటనే ఆ స్థానంలో కూర్చోబెట్టగలిగింది. ఆసియా సంతతికి చెందిన మొదటి బ్రిటిష్‌ ప్రధాని అని, మొదటి హిందూ ప్రధాని అని-ఇలా రకరకాలుగా రిషి సునాక్‌ గురించి చెప్పుకుంటున్నారు. భారతదేశంలో అతని నియామకం గురించి ఎంత హడావుడి చేసినప్పటికీ, రిషి సునాక్‌కు సంబంధించిన ఈ వివరాలకు ఏ మాత్రమూ ప్రాధాన్యత లేదు. అతడు బ్రిటిష్‌ ఫైనాన్స్‌ పెట్టుబడి ఎంచుకున్న వ్యక్తి అన్నదే ప్రధానం. గోల్డ్‌మన్‌ సాక్స్‌ సంస్థలో అతను ఉద్యోగిగా ఇదివరకు పని చేశాడు. హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరించాడు. అతను ద్రవ్య పెట్టుబడి ప్రపంచం నుండి వచ్చిన వ్యక్తి. కార్పొరేట్‌ ఫైనాన్స్‌ మనిషి.
        బ్రిటిష్‌ ఫైనాన్స్‌ పెట్టుబడి బ్రిటిష్‌ రాజకీయాలను శాసించగలుగుతోందీ అంటే దానికి కారణం కన్జర్వేటివ్‌ పార్టీ అందుకు సరిగ్గా సరైన పనిముట్టుగా తోడ్పడడమే. గతంలో ప్రధానిగా వ్యవహరించిన మార్గరెట్‌ థాచర్‌ బ్రిటిష్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ శక్తుల వత్తిడి కారణంగా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు ఆమె ఈ విధంగా వాపోయారు:
         ''నేను ఎన్నడూ ఏ సాధారణ ఎన్నికలలోనూ ఓడిపోలేదు. బ్రిటిష్‌ పార్లమెంటు విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోలేదు. కన్జర్వేటివ్‌ పార్టీలో మెజారిటీ నావైపే ఎప్పుడూ మొగ్గు చూపారు. కాని నేను ఇప్పుడు పదవి కోల్పోవలసి వచ్చింది''. ప్రస్తుతం లిజ్‌ ట్రస్‌ కూడా అదే విధంగా చెప్పుకోవచ్చు. నిజానికి ఆమె ''నేను పోరాడతానే తప్ప రంగం వదిలిపెట్టి పోయేదాన్ని కాదు'' అని ప్రకటించారు. కాని ఆ మర్నాడే ఆమె ఎవరికీ అంతుపట్టని విధంగా పదవిని కోల్పోయారు.
          కన్జర్వేటివ్‌ పార్టీ లోపల అంతర్గతంగా ''1922 కమిటీ'' అనే వేదిక పైకి పెద్దగా కనిపించకుండా పనిచేస్తూ వుంటుంది. ఆ పార్టీ నాయకత్వ ఎంపికలో గాని, నాయకత్వాన్ని కొనసాగించడంలో గాని ఈ కమిటీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. మంత్రివర్గంలో, వారి సిబ్బందిలో బ్రిటిష్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ మనుషులు ఉంటారు. వారిలో కొందరికి ఆ పదవీ కాలం అయిపోయాక కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సంస్థలలో మంచి ఉద్యోగాలు కూడా సిద్ధంగా ఉంటాయి. అంతేగాక ఈ 1922 కమిటీ ద్వారా వెనుక నుండి చక్రం తిప్పే మనుషులు కూడా బ్రిటిష్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ తరఫున వ్యవహరిస్తూ వుంటారు. ఇక మీడియా కూడా వీరికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలిచే పనిలో ఉంటుంది. ఆ విధంగా పైకి కనిపించే ప్రభుత్వ యంత్రాంగంతో బాటు, రాజకీయ పార్టీ లతో బాటు, కనిపించని విధంగా బ్రిటిష్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ ఆ దేశం మీద తన పట్టు కొనసాగిస్తూ వుంటుంది. మరి ఈ బ్రిటిష్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ వర్గం లిజ్‌ ట్రస్‌ కన్నా రిషి సునాక్‌ వైపే మొగ్గు చూపడానికి కారణం ఏమిటి? అతను గతంలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా, హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరించడమో, లేక అతను స్వయంగా ఒక శతకోటీశ్వరుడు కావడమో ముఖ్యం కాదు. అతని ఎజెండాయే ముఖ్యం. లిజ్‌ ట్రస్‌ కార్పొరేట్లకు పన్ను రాయితీలను ప్రకటించింది. ఆ మేరకు బడ్జెట్‌ లోటు పెంచాలని ప్రతిపాదించింది. దానికి భిన్నంగా రిషి సునాక్‌ పన్ను రాయితీలను, ఇంకా అటువంటి మరికొన్ని రాయితీలను ఇవ్వడంతోబాటు, బడ్జెట్‌లో ద్రవ్యలోటు పెంచకుండా చర్యలు తీసుకోబోతున్నాడు (మరి ద్రవ్యలోటు పెరగకుండా ఉండడానికి కార్మికులమీద అదనపు పన్నులు వేస్తాడా? ఇప్పుడైతే అది సాధ్యపడేలా లేదు మరి). ఐతే బ్రిటిష్‌ ఫైనాన్స్‌ పెట్టుబడి ద్రవ్యలోటు లేని పన్ను రాయితీల వైపే ఎందుకు మొగ్గు చూపుతోంది? తనకు వచ్చే పన్ను రాయితీల కారణంగా ద్రవ్యలోటు పెరిగితే దానికి పోయేదేమిటి?
         ఫైనాన్స్‌ పెట్టుబడి ఎప్పుడూ కూడా ద్రవ్య లోటు ఎక్కువగా ఉండకూడదన్న వైఖరినే తీసుకుంటుంది. అందుకనే అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి ఆధిపత్యం కొనసాగుతున్న ప్రస్తుత కాలంలో దాదాపు అన్ని దేశాలలోనూ ద్రవ్య లోటును నియంత్రించి, దేశ స్థూల జాతీయోత్పత్తిలో (జిడిపి లో) ఒకానొక శాతానికి మించకుండా ఉండే విధంగా చట్టాలు రూపొందించారు. అమెరికా మాత్రం దీనికి మినహాయింపు. దాని రూటే వేరు. ఇప్పుడు బ్రిటన్‌ లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ద్రవ్యలోటును మరింత పెంచే చర్యలను కార్పొరేట్‌ ఫైనాన్స్‌ ఇంకా గట్టిగా వ్యతిరేకిస్తుంది.
        ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న కాలంలో ద్రవ్యలోటును ఇంకా పెంచితే దాని వలన స్థూల డిమాండ్‌ పెరుగుతుంది. అందువలన ఉపాధి కల్పన పెరుగుతుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఈ పరిస్థితులు అటు ద్రవ్యోల్బణాన్నీ, ఇటు కార్మికవర్గ సంఘటిత శక్తినీ పెంచుతాయి. ఇంకోవైపు ద్రవ్యపెట్టుబడి రూపంలో ఉండే ఆస్తుల నిజ విలువలు తగ్గిపోతాయి. అందుకే కార్పొరేట్‌ ఫైనాన్స్‌ శక్తుల ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న కాలంలో ద్రవ్య లోటు ఎక్కువ కాకూడదని బలంగా కోరుకుంటాయి. ఐతే ద్రవ్య లోటు ఫలితంగా కార్పొరేట్ల లాభాలు (పన్నులు చెల్లించిన అనంతర లాభాలు) పెరుగుతాయి. అటువంటప్పుడు అంత గట్టిగా ద్రవ్యలోటును ఎందుకు కార్పొరేట్‌ ఫైనాన్స్‌ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి?
          పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారుల లాభాల మొత్తం (పన్నుల చెల్లింపు అనంతర లాభాలు) పెట్టుబడిదారీ వర్గం చేసిన వినిమjం + వారు పెట్టిన పెట్టుబడి + ద్రవ్యలోటుతో సమానంగా ఉంటు ంది. ఇందులో పెట్టుబడిదారులు చేసిన వినిమయం గాని, వారు పెట్టిన పెట్టుబడి గాని అదే సంవత్సరంలో వచ్చే లాభాలలో కనిపించవు. కాబట్టి వాళ్ళకి ఎంత ఎక్కువగా పన్ను రాయితీలు ఇచ్చినా, దాని వలన అదే ఏడాదిలో వారికి వచ్చే లాభాల మీద ఆ రాయితీల ప్రభావం ఏమీ ఉండదు. ఆ రాయితీల వలన ప్రభుత్వం కోల్పోయే ఆదాయాన్ని ద్రవ్యలోటు ద్వారా భర్తీ చేసినప్పుడే వారి లాభాలు ఆ ఏడాది పెరుగుతాయి. అంటే కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఎంత భారీగా ఇచ్చినా, అదే మోతాదులో ప్రభుత్వ వ్యయాన్ని గనుక తగ్గించినట్టైతే పెట్టుబడిదారీ వర్గ లాభాలలో పెరిగేది ఏమీ ఉండదు.
          ఐతే ఈ సూత్రం పెట్టుబడిదారీ వర్గం మొత్తంగా (అంటే మొత్తం అన్ని రకాల పెట్టుబడిదారులనూ కలిపి చూసినప్పుడు) చూసుకున్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఆ వర్గంలో పన్ను రాయితీలు కొందరికి మాత్రమే వర్తిస్తాయి. తక్కినవారికి రాయితీలు రావు. పైగా ప్రభుత్వ వ్యయం తగ్గినందువలన వారి లాభాలు మరింత తగ్గుతాయి కూడా. ప్రభుత్వం ప్రకటించే రాయితీలు ఎక్కువగా బడా కార్పొరేట్లకు వర్తిస్తాయి. అదే ప్రభుత్వ వ్యయం తగ్గినందువలన అన్ని తరగతుల పెట్టుబడిదారులకూ లాభాలు తగ్గుతాయి. అందుచేత అటు పన్ను రాయితీలు, ఇటు ప్రభుత్వ వ్యయం తగ్గింపు-రెండూ ఒకేసారి అమలు జరిగినప్పుడు దేశంలో వచ్చే మొత్తం లాభాలలో కార్పొరేట్లకు వచ్చే వాటా పెరుగుతుంది. అదే సమయంలో చిన్న, మధ్య తరహా పెట్టుబడిదారుల వాటా తగ్గుతుంది. ఫైనాన్సు పెట్టుబడి బడా కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇవ్వాలని కోరుతూనే, ఆ మేరకు ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకోవాలని పట్టు పట్టడం వెనుక మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది: ప్రభుత్వ వ్యయం తగ్గితే ఆ మేరకు నిరుద్యోగం పెరుగుతుంది. అదే ప్రభుత్వ వ్యయం పెరిగితే, ఆమేరకు నిరుద్యోగం తగ్గుతుంది. ప్రభుత్వ వ్యయంలో రూ.100 తగ్గిందనుకుందాం. అప్పుడు స్థూల డిమాండ్‌ కూడా రూ.100 తగ్గుతుంది. అదే రూ.100 ను కార్పొరేట్లకు పన్ను రాయితీగా ఇస్తే, దానివలన స్థూల డిమాండ్‌ రూ.100 మేరకు పెరగదు. ఎందుకంటే ఆ పన్ను రాయితీలో అధిక భాగాన్ని పెట్టుబడిదారుడు భద్రంగా దాచుకుంటాడే తప్ప ఆ మొత్తం రూ.100 పూర్తిగా పెట్టుబడి పెట్టడు. అందువలన పన్ను రాయితీ వలన స్థూల డిమాండ్‌ తగ్గుతుంది. దాని ఫలితంగా ఉత్పత్తి తగ్గుతుంది. అది నిరుద్యోగం పెరగడానికి దారి తీస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి నిరుద్యోగాన్ని మరింత పెంచడమే పరిష్కారం అని భావిస్తుంది (అప్పుడు స్థూల డిమాండ్‌ తగ్గిపోతుంది. మార్కెట్‌లో డబ్బు పరిమాణం తగ్గుతుంది. ద్రవ్యోల్బణం తగ్గుతుంది. కాని పెట్టుబడిదారులకు లాభాలు తగ్గవు. ఎందుకంటే పెరిగిన నిరుద్యోగాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు కార్మికులకిచ్చే వేతనాలను మరింత దిగ్గోస్తారు.).
రెండవది: పన్ను రాయితీలు ఇచ్చి, ఆ మేరకు ప్రభుత్వ వ్యయాన్నిత గ్గించినప్పుడు మొత్తంగా పెట్టుబడిదారీ వర్గానికి లాభాలలో పెరుగుదల లేకపోయినా, వచ్చిన లాభాల్లో బడా కార్పొరేట్ల వాటా పెరిగి, చిన్న పెట్టుబడిదారుల వాటా తగ్గిపోతుంది.
 

మూడవది : దేశంలో ద్రవ్య పెట్టుబడికి లాభాలు పెరుగుతున్నప్పుడు అది విదేశాలలోని ద్రవ్య పెట్టుబడిని మరింత ఎక్కువగా ఆకర్షిస్తుంది. తద్వారా దేశంలో ద్రవ్య పెట్టుబడి ద్వారా జరిగే మొత్తం వ్యాపారం పెరుగుతుంది.
          ఐతే రిషి సునాక్‌ ఇంకా తన మొత్తం ఆర్థిక ప్యాకేజీని వెల్లడి చేయలేదు. ఒక విషయం స్పష్టం. అతడు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి మాత్రం కృతనిశ్చయంతో ఉన్నాడు. మరి ఎంతమేరకు కార్పొరేట్లకు పన్ను రాయితీలను ప్రకటిస్తాడో అది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియదు. కాని రాయితీలు మాత్రం ఉంటాయి. పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తూ వుంటేనే పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి కొనసాగుతుందన్న మూఢ విశ్వాసం ఎటుదిరిగీ ఉంది కదా. అందుచేత రిషి సునాక్‌ ఆర్థిక కార్యక్రమం ఫైనాన్స్‌ కార్పొరేట్‌ దిగ్గజాలకు లాభాలను కురిపిస్తుంది. అదే సమయంలో నిరుద్యోగాన్ని కూడా పెంచుతుంది. అందుచేతనే కార్పొరేట్‌ ఫైనాన్స్‌ శక్తులకు లిజ్‌ ట్రస్‌ కన్నా రిషి సునాక్‌ పైనే ఎక్కువ అభిమానం ఉంటుంది. అందుకనే బ్రిటిష్‌ కార్మిక వర్గానికి లిజ్‌ ట్రస్‌ కన్నా రిషి సునాక్‌ వల్లనే ఎక్కువ తిప్పలు కలుగుతాయి.
          రిషి సునాక్‌ విధానం వలన ద్రవ్యోల్బణం పెరగకుండా అదుపులో ఉంటుంది గనుకను, ద్రవ్యోల్బణం పెరిగితే దాని భారాలు కార్మికవర్గం మీద పడతాయి గనుకను రిషి సునాక్‌ ను కార్మిక వ్యతిరేకిగా ముద్ర వేయకూడదని భావించేవారు ఉండొచ్చు. కాని ఆ విధంగా భావించేవారు మరిచిపోతున్న విషయం ఏమంటే రిషి సునాక్‌ కార్మిక వర్గాన్ని బలి చేయడం ద్వారా మాత్రమే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలను కుంటున్నాడు. ధరల పెరుగుదలను అదుపు చేయడానికి వేతనాల తరుగుదలను సాధనంగా చేయాలనుకుంటున్నాడు. ద్రవ్యోల్బణం పెరిగినా కార్మికుల వేతనాల నిజ విలువ తగ్గుతుంది. వేతనాల తరుగుదల జరిగినా అదే ఫలితం ఉంటుంది. రెండింటిలోనూ వేతనాలను తగ్గించడాన్నే కార్పొరేట్‌ ఫైనాన్స్‌ శక్తులు ఎందుకు కోరుకుంటాయంటే దానివలన ద్రవ్య పెట్టుబడి రూపంలో ఉన్న వారి ఆస్తుల విలువ తగ్గిపోకుండా ఉంటుంది. ప్రభుత్వ వ్యయంలో కోత పడితే దాని వలన నిరుద్యోగం పెరుగుతుంది. అంతే కాదు, ప్రభుత్వ సేవలు, సంక్షేమ కార్యక్రమాలు చాలా కుదించబడతాయి. రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో బ్రిటన్‌లో ప్రవేశపెట్టిన ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం వంటి సేవలు ఇప్పటికే నిధుల కోతతో కునారిల్లుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ వ్యయం గనుక మరింత తగ్గితే, ఆ రంగాలు కోలుకోలేనంతగా దెబ్బ తింటాయి. దాని వలన ఎక్కువగా నష్టపోయేది బ్రిటిష్‌ కార్మికవర్గమే. మరి ఆ కార్మికవర్గం రిషి సునాక్‌ ఎజెండా అమలు జరగకుండా అడ్డుకోగలుగుతుందా?

(స్వేచ్ఛానువాదం)
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌