
మరుగుజ్జుతనాన్ని జయించి, దేశకీర్తిని ఉన్నతంగా చాటాడు. ఆర్థిక కష్టాలు ప్రతిబంధకంగా మారినా వాటినీ సంకల్పబలంతో తిప్పికొట్టాడు. చిన్నప్పటి నుంచీ ఉన్న క్రీడాసక్తికి కఠోర శ్రమ, మెళకువలను జోడించి విజయాల బాట పట్టాడు. వెరసి అంతర్జాతీయ క్రీడా వేదికలపై ఏకంగా మూడు క్రీడల్లో పతకాల పంట పండిస్తున్నాడు. బ్యాడ్మింటన్, షాట్‌ఫుట్, జావెలిన్ త్రోలో ప్రత్యర్థులను మట్టికరిపించిన గట్టి మనిషిగా నిలుస్తున్నాడు. అతడే అనకాపల్లి జిల్లాకు చెందిన రొంగలి రవి. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో షాట్‌ఫుట్‌లో రజత పతకం గెలిచి మరోసారి దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశాడు. అయితే, రవి క్రీడా ప్రస్థానమేమీ అంత సులువుగా సాగలేదు. అనేక ఒడిదుడుకుల నడుమ సాగిన ఆయన క్రీడా జీవితం పలువురికి ఆదర్శం.

రవిది అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం, చిరికివానిపాలెం గ్రామం. తల్లిదండ్రులు దేముడుబాబు, మంగ. వ్యవసాయమే జీవనాధారం. రవి ఒకటి నుంచి పదో తరగతి వరకూ విశాఖ జిల్లా భీమిలిలోని రెసిడెన్షియల్ స్కూలులో చదువుకున్నాడు. ఇంటర్‌ను ఎస్.కోటకు సమీపంలోని పుణ్యగిరిలోనూ, డిగ్రీని విశాఖ ఎన్‌ఎడి జంక్షన్‌కు సమీపంలోని మహతి డిగ్రీ కళాశాలలోనూ పూర్తి చేశాడు. చిన్నతనం నుంచీ రవికి క్రీడలంటే ఇష్టం. అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్న వారితోనే అతను తలపడుతూ మండల, జిల్లా స్థాయిల్లో గెలుపునందుకుంటూ వచ్చాడు. ఇంటర్‌లో ఉన్నప్పుడు వికలాంగుల కోసం జరిగే పారా గేమ్స్ గురించి తెలుసుకున్నాడు. 2014 నుంచి పారా క్రీడలపై దృష్టి పెట్టాడు. తొలుత బ్యాడ్మింటన్‌పై పట్టు సాధించి పతకాల వేట మొదలుపెట్టాడు. పారా నేషనల్ స్పోర్ట్స్‌లో 2015లో డబుల్స్‌లో రజతం, సింగిల్స్‌లో కాంస్యం, 2016లో డబుల్స్, సింగిల్స్ విభాగాల్లో రజత పతకాలు, 2017లో డబుల్స్‌లో రజత పతకం సాధించాడు. ఆర్థిక పరిస్థితులు అతనికి సహకరించలేదు. స్పాన్సర్లూ దొరకలేదు. బ్యాడ్మింటన్ శిక్షణ అధిక ఖర్చుతో కూడుకున్నది కావడంతో రవికి ఇబ్బందులు తప్పలేదు. ఈ క్రమంలోనే పారా అథ్లెటిక్స్‌పై దృష్టి పెట్టాడు. షాట్‌ఫుట్, జావెలిన్ త్రోలో తక్కువ కాలంలోనే పట్టు సాధించి మెరికలాంటి క్రీడాకారునిగా తయారయ్యాడు. అతనికి కుటుంబ సహకారమూ తోడైంది. కుమారున్ని ఎలాగైనా మంచి క్రీడాకారునిగా చూడాలన్న తలంపుతో తల్లిదండ్రులు తమకున్న కొద్దిపాటి పొలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో క్రీడా శిక్షణ ఇప్పించారు. టోర్నీలకు పంపించారు. తన కుటుంబం తన కోసం ఇంత చేస్తున్నందున ఎలాగైనా తనవారికీ, దేశానికీ పేరు తేవాలని రవి సంకల్పించి తన ప్రతిభకు మరింత పదునుపెట్టాడు. అతనికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, కార్యదర్శులు జి.కోటేశ్వరరావు, వి.రామస్వామి అన్ని విధాలా అండగా నిలిచారు.
పతకాల పంట
2017లో హర్యానాలో జరిగిన 18వ పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌లో షాట్‌పుట్‌లో రవి బంగారు పతకం సాధించాడు. 2018లో బెంగళూరులో జరిగిన ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్స్‌లో షాట్‌ఫుట్, జావెలిన్ త్రో రెండింట్లోనూ పాల్గొని రెండింటా గోల్డ్ మెడల్ ఒడిసిపట్టాడు. ఈ క్రమంలోనే రవిని అంతర్జాతీయ మ్యాచ్‌లకు పంపించేందుకు అతని కుటుంబం పొలాన్ని అమ్మేసింది. తనకు ఎంతో కొంత ఊత దొరికిందన్న భరోసాతో ముందుకెళ్తున్న రవికి కోవిడ్ విపత్కర కాలం మరో సవాలు విసిరింది. రెండేళ్లపాటు దేశంలో ఎక్కడా పారా క్రీడలు జరగలేదు. దీంతో అతనిలో ఆందోళన మొదలైంది.
ఈలోగా కోవిడ్ పరిస్థితులు ఒక్కొక్కటిగా తొలగిపోయి మునుపటి వాతావరణం రావడంతో 2021లో మళ్లీ క్రీడలవైపు రవి తన దృష్టిని మరల్చాడు. 2021లో ముంబయిలో జరిగిన ఫజా పారా ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొని రాణించాడు. 2022లో పోర్చుగల్‌లో జరిగిన ఐవజ్ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్‌త్రో, షాట్‌ఫుట్ విభాగాల్లో పాల్గొని రెండింటా రజత పతకాలు సాధించాడు. 2023 జూన్‌లో పారిస్‌లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ రాణించాడు. పారా ఆసియా క్రీడలకు దేశం నుంచి ఎంపికయ్యాడు.

తాజాగా చైనాలో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో షాట్‌పుట్ ఎఫ్ - 40 విభాగంలో 9.92 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని అందుకున్నాడు. అతనికి ఇరాన్, ఇరాక్, చైనా, సింగపూర్, శ్రీలంక క్రీడాకారుల నుంచి గట్టి పోటీ ఎదురైనా తీవ్ర ఒత్తిడిని జయించి దేశానికి పతకాన్ని అందించాడు. అతన్ని దేశ ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్, సోషల్ మీడియా వేదికలుగా అభినందించారు. రవి తొలినాళ్లలో తన మరుగుజ్జుతనం వల్ల వివక్ష ఎదుర్కొన్నాడు. చీత్కారాలను చవిచూశాడు. వాటన్నింటినీ తొక్కుకుంటూ వెళ్లి నిరంతర శ్రమ, పట్టుదలతో పైకి ఎదిగాడు. ఇప్పటి వరకూ ఎనిమిది అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని నాలుగు పతకాలు సాధించాడు. మిగతావాటిలో తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు.
ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం
27 ఏళ్ల రవి ప్రస్తుతం బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన నడుస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరంలో నిరంతర సాధన చేస్తున్నాడు. అతనికి ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పరంగానూ సాయం అందుతోంది. స్పోర్ట్స్ కోటాలో ట్యాక్స్ ఆఫీసర్‌గా ఉద్యోగమూ వచ్చింది. తనలాగే ఎంతోమంది పేద క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారని, వారంతా కష్టాలను జయించి, వైకల్యాన్ని అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రవి ఆకాంక్షిస్తున్నాడు. క్రీడలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సాయం అందించాలని కోరుతున్నాడు. వికలాంగ క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, ఉద్యోగావకాశాలు కల్పించాలని విన్నవిస్తున్నాడు. 2024 పారా ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్నట్టు రవి 'ప్రజాశక్తి'కి తెలిపాడు.
- కోడూరు అప్పలనాయుడు,
94915 70765