- 20 వేల కుటుంబాల ఉపాధి దెబ్బతీసేలా విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ డైవర్షన్ ప్లాన్
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : విశాఖ ఫిషింగ్ హార్బర్‌పై ఏళ్ల తరబడి ఆధారపడిన 20 వేల మత్స్యకార కుటుంబాల జీవనాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం పొగబెడుతోంది. వైజాగ్ పోర్టు 1933లో రాక ముందు నుంచీ ఈ చేపల రేవుపైనే ఆధారపడి మత్స్యకారులు జీవిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రయివేట్ సంస్థ అయిన వైజాగ్ కంటైనర్ టర్మినల్ కార్పొరేషన్ (విసిటిపిఎల్) కోసం వైజాగ్ పోర్టుపై ఒత్తిడి తెచ్చి మత్స్యకారుల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా లోపాయికారిగా చర్యలు చేపట్టింది. గతంలో 30 ఎకరాలకుపైగా సముద్రంలోని హార్బర్ ప్రాంతంలో విసిటిపిఎల్ జెట్టీ ఏర్పాటుకు కేంద్రం అనుమతులిచ్చింది. తాజాగా హార్బర్ ఆధునికీక రణ, జెట్టీల నిర్మాణం, కోల్డ్ స్టోరేజీ, డయింగ్ ప్లాట్‌ఫా రాల కోసం ఉద్దేశించిన రూ.152 కోట్ల నిధులను పోర్టు ద్వారా డైవర్షన్ చేయిస్తోంది. విసిటిపిఎల్ పూర్తిగా హార్బర్‌ను ఆక్రమించేస్తోందంటూ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హార్బర్‌కు, మత్స్యకారులకు మధ్య విసిటిపిఎల్ గతంలోనే గోడ కట్టేసింది. 'మా ప్రాణాలు పోయినా మేం ఇక్కడ నుంచి కదలం. పోర్టు కాదు... ఎవరు చెప్పినా మా బతుకులు ఇక్కడే' అంటూ మత్స్యకార మహిళలు మైలపల్లి పెంటమ్మ, సూరాడ చిట్టెమ్మ 'ప్రజాశక్తి' ఎదుట వాపోయారు.
హార్బర్‌లో ఏం జరుగుతోంది ?
ఫిషింగ్ హార్బర్‌లో రూ.152 కోట్ల నిధులను మత్స్యకారుల అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్)ను విశాఖ పోర్టు మార్చేసింది. మత్స్యకారుల ప్రయోజనాలను పక్కనబెట్టి సరికొత్త గదులను టూరిస్టు ఆదాయం లక్ష్యంతో కట్టేందుకు సిద్ధమైంది. ఇక్కడ హార్బర్‌లో ఫింగర్ జెట్టీ నిర్మించాలనేది మత్స్యకారుల ప్రధాన డిమాండ్. హార్బర్‌లోని ఒకటో నెంబరు జెట్టీ నుంచి 9వ నెంబరు వరకూ రోడ్డుకు ఆనుకుని 500 మీటర్ల జెట్టీ నిర్మించాలని ఏళ్ల తరబడి వారు కోరుతున్నారు. కానీ, నీటిపై తేలియాడే జెట్టీలు (ఫ్లోటింగ్ జెట్టీలు)ను నిర్మించి మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం, వైజాగ్ పోర్టు పొమ్మనలేక పొగబెడుతున్నాయన్నది తాజా పరిస్థితుల నేపథ్యంలో స్పష్టమవుతోంది.
హార్బర్‌లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన బోట్లు
హార్బర్‌లో 890 మెకనైజ్డ్ బోట్లు, వెయ్యి మోటరైజ్డ్ బోట్లు, 200 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే మరో 500 బోట్లు విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో నిత్యం సముద్రం మీద రాకపోకలు సాగిస్తున్నాయి. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగినప్పుడు 40 బోట్లే ఉండేవి. పోర్టు నిర్మాణమప్పుడు భవిష్యత్తు అవసరాల కోసం 250 బోట్లకు సరిపడా హార్బర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 11 జెట్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.152 కోట్లు జెట్టీల నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉన్నా, ఆ పని చేయడం లేదు. ప్రస్తుతం 2,600 బోట్లకుపైగా ఇరుకు ఇరుకుగా సర్దుకుపోవాల్సి వస్తోంది. బోట్ల సంఖ్య పెరుగుతున్నా ఫింగర్ జెట్టీల నిర్మాణం సాగడం లేదు. విసిటిపిఎల్ బెర్తుకు అనుగుణంగా ఫ్లోటింగ్ జెట్టీలు, వైజాగ్ పోర్టు ఆధీనంలోకి ఫిషింగ్ హార్బర్ రావాలన్నది కేంద్ర విధానం. కానీ, ఫింగర్ జెట్టీల నిర్మాణ డిమాండ్ మత్స్యకారుల నుంచి ఉంది. వందమంది ఒకేసారి వెళ్లినా ఫింగర్ జెట్టీ అయితే ఏమీ కాదు. ఫ్లోటింగ్ జెట్టీపైకి 30 మంది వెళితే మునిగిపోతుంది.
స్టీల్‌ప్లాంట్ మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను ఎపి ప్రభుత్వం ఎలాగైతే బలంగా అడ్డుకోవడం లేదో వైజాగ్ ఫిషింగ్ హార్బర్ విషయంలోనూ అలానే వ్యవహరిస్తోంది. పోర్టు ద్వారా ఫిషింగ్ హార్బర్ మొత్తం 112.5 ఎకరాలను విసిటిపిఎల్‌కు గుండగుత్తగా కట్టబెట్టే చర్యలకు పోర్టు దిగుతోందని, నిధుల డైవర్షన్ కూడా అందుకేనని మత్స్యకార సంఘం నాయకులు చంద్రశేఖర్ విమర్శించారు. ఆర్‌టిఐ ద్వారా వివరాలడిగినా ఇవ్వడం లేదన్నారు. విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఈ ఫిషింగ్ హార్బర్ ప్రాంతం వస్తుంది. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కూడా విసిటిపిఎల్ కోసం పోర్టు చేపట్టే చర్యలపైనా, రూ.152 కోట్ల డైవర్షన్‌పైనా మాట్లాడడం లేదని చంద్రశేఖర్, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.










