Dec 31,2022 07:43

            ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పిఎంజికెవై) పథకాన్ని ఆహార భద్రత చట్టం (ఎఫ్‌ఎస్‌ఎ) - 2013లో విలీనం చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న 'ఉచిత రేషన్‌' నిర్ణయం ఒకే దెబ్బకు రెండు పిట్టలు వ్యూహంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ జనాభాలో మూడింట రెండొంతుల ప్రజానీకానికి (81.35 కోట్ల మంది) ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని ప్రకటించి సబ్సిడీ ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగించబోమని ప్రకటించడంతో నిరుపేదలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ప్రపంచ ఆహార సూచీలో భారత్‌ అట్టడుగున నిలిచిన నేపథ్యంలోనూ ఆహార ధాన్యాలను కుదించడం ఒక ఎత్తుగడ కాగా, రెండోది 'ఉచితం' ప్రచార హోరుతో సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లకు గాలం వేయవచ్చున్నది సర్కారు ఎత్తుగడ. 81.35 కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున మాత్రమే ఇక నుంచి ఉచిత ఆహార ధాన్యాలు అందుతాయి. ఇదే సమయంలో ఆహార భద్రత చట్టం కింద ఒంటరి మహిళలు, వికలాంగులు, నిరాశ్రయులు, వితంతు ఫించను పొందేవారు, ఏ ఆసరా లేని నిరుపేదలు, నిరుద్యోగులు, వయోవృద్ధులు వంటి లక్షిత కుటుంబాలకు రాయితీ ధరకు లభించే బియ్యం (కిలో రూ.3), గోధుమలు (కిలో రూ.2), ఇతర తృణ ధాన్యాలు (కిలో రూ.1) ఇక అందవు. కేవలం ఉచితంగా ఇచ్చే 5 కిలోల బియ్యం మాత్రమే అందుతాయి. పర్యవసానంగా ఈ నిరుపేదలంతా పౌష్టికాహారం కోసం ప్రయివేటు మార్కెట్‌పై ఆధారపడాల్సివస్తుంది. బయట మార్కెట్లో తక్కువలో తక్కువ కిలో గోధుమల ధర రూ.30గాను, కిలో బియ్యం ధర రూ.40గాను ఉంటోంది. రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమ జీవులకే నోటి ముద్ద గగనమైపోతున్న ధరాఘాత సమయంలో ఏ ఆసరా, ఏ పని చేయలేని నిస్సహాయ జీవితాలకు రాయితీ తిండి గింజలు నిరాకరించడం దుర్మార్గం.
ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించేందుకు ప్రజలందరికీ అన్ని వేళలా అవసరమైన ఆహార ధాన్యాలను తగిన మోతాదులో అందుబాటులో ఉండేలా చూడటం, పౌష్టికాహారం తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడం, సహకరించడం ప్రభుత్వాల బాధ్యత. తద్వారా ఆహార సుస్థిరతను సాధించడమనేది ఆహార భద్రతకు విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నిర్వచనం. ఆహార భద్రత హక్కును మన రాజ్యాంగంలో నేరుగా ప్రస్తావించలేదు. కానీ రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం కల్పించిన 'జీవించే హక్కు' అర్థంలోనే హుందాగా జీవించడమని స్పష్టతనిచ్చింది. హుందాగా జీవించడమంటే అర్థాకలితో అనికాదు కదా. అందుకనే ఆహారం, మనిషి జీవనానికి అవసరమైన ప్రాథమిక అవసరాలు అనేవి కూడా రాజ్యాంగ కల్పించిన హక్కులే. 2013లో ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది కూడా ఈ నేపథ్యంలోనే. కానీ ప్రపంచ ఆహార సూచీలో దేశం ఏటికేడూ దిగజారిపోతోంది. పాలకుల 'అమృతోత్సవ భారతావని' గొప్పలు ఎంత ఘోరమైనవో..ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో తరుచూ వెలుగుచూస్తున్న ఆకలి చావులు స్పష్టం చేస్తున్నాయి. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆహార భద్రత హక్కు, ఉపాధి హామీ వంటి పేదలకు సంబంధించినవాటిపైనే కన్నేసి వాటిని నీరుగార్చే కుట్రలు సాగిస్తూనేవుంది. ఇప్పుడు ఉచిత ఆహారధాన్యాల ఎత్తుగడ కూడా అలాంటిదేనన్న విమర్శకుల విశ్లేషణ సమంజసంగానే కనిపిస్తోంది.
              కోవిడ్‌ సంక్షోభం, లాక్‌డౌన్‌ నిర్బంధాల నేపథ్యంలో 2020 మార్చిలో పిఎంజికెవైని మోడీ సర్కార్‌ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకానికి ముందు 'జాతీయ ఆహార భద్రతా చట్టం' కింద ఆహార ధాన్యాల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం 2021-22లో రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సబ్సిడీ ఆహార ధాన్యాల్ని నిలిపివేయడం అంటే ఈ మేరకు పేదలందరిపై భారం వేయడమేన్న మాట. గర్భిణీలకు, తల్లులకు, చిన్నారులకు పౌష్టికాహరం అందించే ఐసిడిఎస్‌లకు, మధ్యాహ్న భోజన పథకాలకు కూడా కేంద్రం నిధులను తెగ్గోస్తోంది. ఆ మేరకు రాష్ట్రాలపై భారాలు పెరిగి ఆ పథకాలు క్రమంగా నీరుగారిపోతున్నాయి. కోవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయి పేదరికం కోరలు చాచిన నేపథ్యంలో పాలకులు ఆహార ధాన్యాల సబ్సిడీ కవరేజీని విస్తృతం చేయాల్సిన అవసరముంది. అలాంటి సమయంలో కోటాకు కోత పెట్టడం అమానుషం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున్ణ పరిశీలించడం అవసరం. ఉచిత ధాన్యాలతో పాటు సబ్సిడీ ఆహార ధాన్యాలను కూడా కొనసాగించాలి.