Dec 16,2022 07:46

           బీమా కొరెగావ్‌ కేసులో ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్న అంశాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ బరితెగింపు తనానికి, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరుకు ఈ కేసు నిలువెత్తు నిదర్శనం. ఈ కేసులో భాగంగా దేశద్రోహ ఆరోపణలతో జైలులోనే మగ్గి కనీస సౌకర్యాల తిరస్కరణకు గురై కటకటాల వెనుకే మృతి చెందిన 80 సంవత్సరాల వృధ్దుడు స్టాన్‌స్వామిని నేరస్తుడుగా నిరూపించేందుకు జరిగిన కుట్ర తాజాగా బట్టబయలైంది. ప్రఖ్యాతి చెందిన అమెరికా ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఆర్సెనల్‌ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి, పౌరహక్కులకు ఏ స్థాయిలో ముప్పు పొంచి ఉందో ఇట్టే అర్ధమవుతుంది. ఇటువంటి నివేదిక వెల్లడి కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి నివేదికలు వెల్లడయ్యాయి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పెదవి విప్పకపోగా వేధింపు చర్యలను, ఈ కేసులో నిందితులపై నిర్బంధాన్ని మరింత తీవ్రం చేసింది. తాజాగా వెల్లడైన ఆర్సెనల్‌ నివేదిక ఐదవది కాగా, మరింత స్పష్టంగా కుట్ర సాగిన తీరును, తాము లక్ష్యంగా ఎంచుకున్న వారిపట్ల దర్యాప్తు సంస్థల వ్యవహారశైలిని బట్టబయలు చేసింది. ఈ వ్యవహారంపై చర్చించాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఎంపి ఎ.ఎం అరిఫ్‌ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.
            2017 నుండి 2019 మధ్య కాలంలో స్టాన్‌స్వామి ఉపయోగించిన కంప్యూటర్లలో హ్యాకర్లు 40 ఫైళ్లను చేర్చారని ఆర్సెనల్‌ నివేదిక స్పష్టం చేసింది. ఆ ఫైళ్లను ఆయన చూడను కూడా లేదని పేర్కొంది. ఇంకా ఆందోళన కలిగించే అంశమేమిటంటే పూణే పోలీసులు స్టాన్‌స్వామిని అరెస్ట్‌ చేయడానికి ఒక్కరోజు ముందు హ్యాకర్లు తమ చొరబాటుకు సంబంధించిన ఆధారాలను తొలగించారు. అంటే అర్ధమేమిటి? పోలీసులు అరెస్ట్‌ చేస్తున్న విషయం వారికి ముందుగా తెలుసనే కదా! హ్యాకర్లు దొంగచాటుగా పెట్టిన ఫైళ్ళే స్టాన్‌స్వామిపై నేరారోపణకు ప్రధాన సాక్ష్యాధారాలుగా జాతీయ దర్యాప్తు సంస్థ చూపుతోంది. వాటిని అడ్డంపెట్టే 80 ఏళ్ల వయసులో ఆయనకు బెయిల్‌ మంజూరుకాకుండా, కనీస సౌకర్యాలు ఇవ్వకుండా అడ్డుకుంది. తన అనారోగ్యాన్ని, వృధ్ధాప్యం కారణంగా ఏర్పడిన నిస్సహాయతను ఆయన పదేపదే వ్యక్తం చేసినా కనికరం చూపలేదు. చివరకు కస్టడీలోనే ఆయన తుదిశ్వాస విడవాల్సిరావడం ఎంత బాధాకరం? ఇది సర్కారీ హత్య గాక మరేమిటి? ఈ కేసులో 16 మందిని అరెస్ట్‌ చేయగా, వారిలో ముగ్గురికి బెయిల్‌ లభించింది. ఒకరు హౌస్‌ అరెస్ట్‌లో ఉన్నారు. మరొకరు మృతి చెందారు. మిగిలిన వారు జైలులోనే మగ్గుతున్నారు. మరోవైపు స్టాన్‌స్వామితో పాటు ఇతర నిందితులపై పోలీసులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, కుట్రపూరితంగా వారి కంప్యూటర్లలోచొరబడి నకిలీ పత్రాలను చొప్పించారన్న సాక్ష్యాధారాలు ఒకదాని తరువాత ఒకటిగా బయటకు వస్తున్నాయి.
            నేరస్తుడు శిక్షపడకుండా తప్పించుకోవచ్చుగానీ, నిరపరాధికి పొరపాటున కూడా శిక్షపడకూడదన్నది మన న్యాయశాస్త్ర సూత్రం. కానీ, బీమా కొరెగావ్‌ కేసులో జరుగుతున్నదేమిటి? హ్యాకర్లు పెట్టిన నకిలీ పత్రాలు, మెయిళ్లను ఆధారంగా చేసుకుని, మేధావులు, న్యాయవాదులు, రచయితలు.కవులు, కళాకారులపై దేశద్రోహ ముద్ర వేశారు. అర్బన్‌ నక్సల్స్‌ అంటూ దుర్భాషలాడారు. ఇప్పుడు అవి నకిలీవని ఒకటికి ఐదు ఫోరెన్సిక్‌ సంస్థలు తేల్చిన తరువాతకూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. ప్రజాస్వామ్యం పట్ల, పౌరహక్కుల పట్ల ఏమాత్రం శ్రద్ద ఉన్న ప్రభుత్వమైనా ఈ నివేదికలను సీరియస్‌గా తీసుకుంటుంది. నిందితులకు తక్షణం బెయిల్‌ మంజూరు చేసి, న్యాయవిచారణకు ఆదేశిస్తుంది. ఇది ప్రజా ప్రభుత్వాల కనీస బాధ్యత. కానీ, మోడీ ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. రేపు ఇదే పరిస్థితి ఇతరులకు కూడా ఏర్పడవచ్చు. ప్రతిపక్షపార్టీలను, నేతల పరికరాలను హ్యాక్‌ చేసి నకిలీపత్రాలను చొప్పించి వేధించవచ్చు. ఇదే జరిగితే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. జి-20 గ్రూపునకు నాయకత్వం వహిస్తున్నామని ఒకవైపు గొప్పలు చెప్పుకుంటూ మరోవైపు మేడిపండు చందంగా ప్రజాస్వామ్యాన్ని మార్చడం దుర్మార్గం. ప్రజాస్వామ్యం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కేసులోని నిందితులందరిని తక్షణం విడుదల చేయాలి. వాస్తవాలను ప్రజలకు వివరించాలి. దీనికోసం ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు ఉద్యమించాలి.