Sep 18,2022 07:42

ఊపిరి పోసిన తల్లుల
ఉసురు తీసిన ఆ పాపమెవరిది.....??

నవ మాసాలూ మోసి
కడుపు చించుకొని
బిడ్డలకు జన్మనిచ్చి
మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న
కన్నతల్లుల ముచ్చట మూన్నాళ్లకే కడతేరింది.

ఆ తల్లుల కడుపుకోతకు బాధ్యులెవరు....?
గుండె కోతను అంకితమిచ్చిన పాపమెవరిది?

పూట గడవడమే కష్టమైన జన్మ
కార్పొరేట్‌ ఆస్పత్రి గడప తొక్కలేని దైన్యం
కూటికి గతిలేని వాడు
ప్రభుత్వ దవాఖానలో కాలుమోపితే
కర్కశంగా కాటికి పంపిన దుర్మార్గం...

పేదోడి కష్టం ఉన్నోడికేం ఎరుక...?
బీదోడి అవస్థ పాపపు వ్యవస్థకేం గుర్తు...?
ఎక్కడ చూసినా దోపిడి, దౌర్జన్యం
లంచాలకు చేతులు చాపే దాష్టీకం

దోచుకునే వాడికి తెచ్చి ఇవ్వలేక
దాచుకున్న పైకం అణాకైనా నోచుకోక
తెల్లకోటును ఆశ్రయిస్తే...
ఆయువు పొసే వాళ్లే ఊపిరి తీసి
కించిత్‌ పశ్చాత్తాపం చూపని
నేటి కలియుగ కుటిల నీతి

అమ్మెక్కడ నాన్నా...?
అలా చలనం లేకుండా పడుకుంది..!!
ఆకలేస్తోంది నాన్న
అమ్మను లేవమని చెప్పు...!!

అభం శుభం తెలియని ఆ చిన్నారుల
ఆక్రందనలకు, సంధిస్తున్న ప్రశ్నలకు
జవాబు చెప్పే గొంతులేవి..?
వారి మౌనరోదనను
అశ్రుధారలను వెలకట్టే నరులేరి..?

ముప్పాతిక వసంతాల స్వర్ణోత్సవాలు
ఆడకూతురి ప్రాణాల్ని కాపాడుకోలేని
అమృతోత్సవాలు...
ధనిక సమాజంలో అల్పుడికి
అనునిత్యం ఓటమి ఎదురవుతుంటే...
ఏం సాధించామని ఈ విజయోత్సవాలు?
ఎవరిని ఉద్ధరించడానికి ఈ స్వర్ణోత్సవాలు?

ఎటువైపు ఈ సమాజ పయనం...?
ఎందాక ఈ పాతాళ పతనం...?

(కు.ని శస్త్ర చికిత్స వికటించి, మృతి చెందిన మహిళల వార్త విని చలించి.....)
ఎన్‌.లహరి
98855 35506