ఒకరోజు ఒక స్వామీజీ అడవిలో వెళ్తూ, విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద ఆగాడు. అప్పుడు ఏడుపు వినిపించి పైకి చూశాడు. ఆ చెట్టు మీద కాకి కూర్చుని ఏడుస్తోంది. 'ఎందుకేడుస్తున్నావు?' అని అడిగాడు స్వామీజీ.
అప్పుడు ఆ కాకి 'నన్ను చూసి లోకమంతా నల్లగా ఉన్నానని గేలి చేస్తుంది. ఆ దేవుడు నాకు మంచి ఆకారాన్ని ఇచ్చాడు.. కానీ మంచి రంగును ఇవ్వలేదు. దానివల్ల నన్నెవ్వరూ ఇష్టపడటం లేదు' అంది వెక్కి వెక్కి ఏడుస్తూ.
'నువ్వు నల్లగా ఉన్నావని బాధపడుతున్నావా..? సరే నీకు ఎలాంటి రంగు కావాలో కోరుకో! నిన్ను అలా మార్చేస్తాను' అన్నాడు స్వామీజీ.
అప్పుడు ఆ కాకి ఆనందంగా 'స్వామీజీ! నేను హంసలా మారాలనుకుంటున్నాను. ఎందుకంటే హంసది సుందరమైన ఆకారం. చాలా బాగుంటుంది' అంది.
'సరే మార్చేస్తాను. కానీ ఒక షరతు. ఒక్కసారి వెళ్లి హంసను కలిసిరా' అన్నాడు స్వామీజీ.
కాకి హంస దగ్గరకు వెళ్లింది. హంసను 'ఏమి అందం.. ఏమి తేజస్సు.. అదృష్టమంటే నీదే' అని పొగడటం మొదలుపెట్టింది.
'ఓ కాకి మిత్రమా! నువ్వు నా పైనున్న రంగుని, రూపాన్నే చూశావు కానీ నా మనసులో ఉన్న భయాన్ని చూడలేదు' అంది హంస.
'అదేంటి నీకెందుకు భయం? అందరూ నిన్ను ఇష్టపడతారుగా' అంది కాకి.
'అవును మిత్రమా! అందరూ ఇష్టపడతారు. ఫోటోలు దిగడానికి వస్తారు. ఫోటోలు దిగడానికి వస్తున్నారో, వేటగాడి రూపంలో వస్తున్నారో తెలియక ప్రతిక్షణం బిక్కుబిక్కుమని బతుకుతున్నా' అని చెప్పింది హంస.
కాకి 'మరి నువ్వు, నేను కాకుండా ఎవరు బాగుంటారు ఈ లోకంలో' అంది.
'ఈ లోకంలో రామచిలుక బాగుంటుంది. దానిని ఇంట్లో పెట్టుకుని, మంచి ఆహారం పెట్టి పెంచుతారు' అంది హంస.
అప్పుడు కాకి 'సరే, మనం స్వామీజీ దగ్గరకు వెళ్లి రామచిలుకల్లాగా మార్పించుకుందాం' అని ఆ రెండూ స్వామీజీ దగ్గరకు వెళ్ళాయి.
'మమ్మల్ని రామచిలుకల్లా మార్చేయండి స్వామీజీ! అందరూ రామచిలుకను ఇష్టపడతారు' అన్నాయి రెండూ.
'సరే, నాది ఒక షరతు. మీరిద్దరూ రామచిలుకను కలిసి రండి' అని చెప్పాడు స్వామీజీ.
అప్పుడు ఆ రెండూ రామచిలుక దగ్గరకు వెళ్లాయి. చెట్టు అంతా వెతికాయి. కానీ ఒక్క రామచిలుక కూడా కనబడలేదు. వెళ్ళిపోదాం అనుకునేసరికి రామచిలుక గొంతు వినిపించింది. 'చిలుక మిత్రమా! నీ రంగు నీ ఆకారం చాలా అందంగా ఉంటాయి. నీలాంటి అందం ఇంకొకరికి ఉండదు. అందుకే నిన్ను మనుషులంతా తమ ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. నీ అంత అదృష్టం ఇంకెవరికీ ఉండదు' అంటూ రామచిలుకను పొగిడాయి.
'మిత్రులారా! నా కష్టం మీకేమి తెలుసు..? నన్ను మనుషులంతా పంజరంలో బందీ చేస్తారు. నాకు స్వేచ్ఛ లేదు. ఇంకా నా రంగు అంటారా చెట్ల రంగు, నాది ఒకటే రంగు. నన్ను ఎవరూ గుర్తుపట్టలేరు, మీరు కూడా నన్ను ఎంతసేపు వెతికారో కదా!' అంది బాధపడుతూ రామచిలుక.
'అయినా మనందరి కంటే నెమలి చాలా అందమైనది. నాట్యం బాగా చేస్తుంది. నెమలి జాతీయ పక్షి. జనులంతా నెమలిని ఎంతగానో పొగుడుతారు' అని చెప్పింది రామచిలుక.
అది విన్న కాకి, హంస 'నిజమే చిలుక మిత్రమా! మనం స్వామీజీ దగ్గరకు వెళ్లి నెమలి వలే మారిపోదాము' అని స్వామీజీ దగ్గరకు వెళ్లాయి.
'స్వామీజీ! మా అందరి కంటే గొప్ప పక్షి నెమలి. చాలా అందమైన పక్షి, మమ్మల్ని నెమళ్లలాగా మార్చండి' అని కోరాయి.
స్వామీజీ 'సరే, మీకు ఒక షరతు. మీరంతా నెమలిని కలుసుకొని రండి' అన్నాడు స్వామీజీ.
కాకి, హంస, రామచిలుక నెమలి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాయి. 'నెమలి మిత్రమా! నీ సోయగం, నీ అందం, నీ నాట్యం దగ్గర మేమంతా బలాదూర్' అని పొగడ్తలతో ముంచెత్తాయి.
అప్పుడు నెమలి 'మిత్రులారా! నా బాధలు నాకు ఉన్నాయి. జనాలంతా నాట్యాన్ని, అందాన్ని చూడడానికి వస్తారు. అందులో వేటగాడు ఎవరో తెలియక నేను కూడా బిక్కుబిక్కుమని బతుకుతున్నాను' అంది.
కాకి, నెమలి 'మిత్రమా! మరి నీకంటే అదృష్టం కలవారు ఈ లోకంలో ఎవరున్నారు?' అని అంటుంది.
'ఆ అదృష్టవంతురాలు నీవే కాకి మిత్రమా. నిన్ను ఎవరూ బంధించరు.. వేటాడరు.. నువ్వు స్వేచ్ఛగా తిరగగలవు. నీకు ఈ లోకంలో తిరుగేలేదు' అంది.
అప్పుడు ఆ పక్షులన్నీ తమ తప్పును తెలుసుకొని, వేరే వాళ్ళతో పోల్చుకోకూడదని నిర్ణయించుకొని, స్వామీజీ దగ్గరకు వెళ్లాయి.
'స్వామీజీ! మేమంతా మాలాగే ఉంటాం. మమ్మల్ని క్షమించండి. ఇతరులతో పోల్చుకుని లేని దానికోసం పాకులాడకుండా.. ఉన్న దాంతో సంతృప్తిపడతాం. తోటివారితో కలసిమెలసి ఉంటాం!' అన్నాయి.
బల్ల కృష్ణవేణి
ashaballa33@gmail.com