Sep 18,2022 08:02

నది అంటే ఒక సజీవ ప్రవాహం. మట్టి రేణువుల అణువణువునీ తడిదనంతో స్పర్శించి, మొలకెత్తే తత్వాన్ని ప్రసాదించే సచేతనా స్వరం. అలాంటి నదీతీరం వెంట నడుస్తూ, తడుస్తూ, చెమరుస్తూ వసుధారాణి ఆత్మీయంగా మొలకెత్తించిన పచ్చని కవిత్వం 'నది వెంట నేను..'
      గాలి వీచినంత సహజంగా, నీరు పారినంత సరళంగా అల్లుకున్న చిన్న చిన్న కవితా మాలికలు ఇవి. 100 పేజీల పుస్తకంలో 90 వరకూ ఉన్నాయి. మనకు తెలిసిన మామూలు పదాలతోనే రూపొందాయి. అలతి అలతి మాటలతో అల్లుకొని అనంత అర్థాలను స్ఫురింపజేస్తాయి. చల్లని పిల్ల తెమ్మరలా హృదయాన్ని స్పర్శిస్తాయి. 'వానను ఒక అద్భుత స్తోత్రంగా వినే' ప్రకృతి పారవశ్యం ఈ కవయిత్రిది. అందుకనే నది వెంట నడిచిన ఆమె అడుగుల జాడల నిండా మనసును ముద్దాడే అక్షర సుగంధాలు పరిమళిస్తాయి.
     అలా అని మొత్తం వైయక్తిక స్వరమే కాదు, సమూహాలకు అన్వయించే సార్వత్రిక సత్యాలను ఈ కవయిత్రి వివరిస్తారు. ''కళ్లు చెమర్చటం/ ఆగిపోయి/ చాలా రోజులైంది/ అంటే / ముళ్లు గుచ్చుకోవడం / లేదని కాదు, దానర్థం' అని బతుకు సారాంశం చెబుతారు. 'వెలుగును ఎదురుగా పెట్టుకొని/ రాబోయే చీకటి గురించి ఎందుకు ఆలోచన/ పత్తీ జమురూ ఉన్నంతకాలం వెలుగులో ఉండక ..' అంటారు. చిన్ని చిన్ని సహజ విజయాలను చూసి సంబరపడతారు. కొండ ధీరత్వం గురించి కాక అణగిన ప్రతిసారీ తిరిగి నిలబడే గడ్డిపోచ శూరత్వం గురించి మాట్లాడతారు. ప్రతి కవితలోనూ గొప్ప జీవకళ, తాత్వికత మనల్ని తాకి మురిపిస్తాయి. నది అనేక నవ నాగరికతల, చరిత్రల మూల స్తంభం. 'నదిని తాకి చూశాను/ తడితో పాటుగా/ చేతికి అంటిన చరిత్ర/ కొత్త నీటితో పాత నది' అన్నారు ఈ కవయిత్రి. ఓ పెద్ద ప్రవాహం లాంటి నదీ నాగరికతల చరిత్రను రెండు మాటల్లో కుదించి చెప్పేశారు. 'దీపం వెలుగుతోందన్న స్పృహ లేకుండా/ ఆ వెలుగులోనే కూర్చొని/ చీకటిని తల్చుకుంటే / దీపం చిన్నబుచ్చుకోదా?' ఒక అద్భుత ప్రబోధం. ఇలాంటి అర్థ స్ఫురణనే ఇచ్చే రెండు మూడు కవితా గుచ్ఛాలు భావ పునరుక్తిని గుర్తు చేస్తాయి. అయితే, విడిగా చూసినప్పుడే దేనికదే గుండెను హత్తుకుంటుంది.
      'ఈ వెన్నెల దీపం వెలిగించే వారెవరో కానీ/ పున్నమి రోజున మాత్రమే/ సరిపడా చమురు పోస్తున్నారు' అన్న మాటలో చమత్కారం; 'పిట్ట వెంట ప్రయాణం/ విశాల ప్రపంచంలోకి/ అడుగడుగునా నాకాశ్చర్యం!/ నాలోకమెంత ఇరుకని' అనటంలోని జీవన ఎరుక; 'నీ ఎదురుగా నిలబడి/ నీకోసం కాకుండా/ ఇంకా వేటికోసమో/ ఏడుస్తాను చూడూ/ అప్పుడు నీ క్షమాగుణాన్ని ఏమని చెప్పను?' అనటంలోని ఒప్పుకోలూ. 'కొంచెం చిరునవ్వూ కొంచెం కన్నీళ్లూ అమ్ముతాం/ కొన్ని ఉద్వేగాలూ కొన్ని ఉద్రేకాలూ కొంటాం/ ... గ్లోబల్‌ విలేజి సంత వాళ్లం' అని కార్పొరేటీకరణకు ఈసడించిన వైనమూ ... ఈ పుస్తకంలోని ప్రతి పుటనీ ఆస్వాదించేలా చేస్తాయి. మనసును ఆహ్లాదపరిచి, సతత హరిత వనాల్లో విహరింపజేసే అనుభవం పొందటం కోసం ఈ నది వెంట .. కవిత్వంలోకి మనమూ నడవ్వొచ్చు. రూ.120 విలువైన ఈ పుస్తకం.. ప్రతుల కోసం 99598 39446 మొబైల్‌ను సంప్రదించవచ్చు.
 

- శాంతిమిత్ర