చింటూ చిన్న సైకిల్ కావాలని ఎన్నిసార్లు అడిగినప్పటికీ వాళ్ల నాన్న చిన్న సైకిల్ కొనివ్వకపోగా చివాట్లు పెట్టేవారు.
'చిన్నోడు అడుగుతున్నాడు. సైకిల్ కొనివ్వచ్చు కదా!' అని చింటూ వాళ్ళ అమ్మ అంటే.. 'వాడు ఇంకా చిన్నవాడే కదా! వాడికప్పుడే సైకిల్ ఎందుకూ..? నువ్వూ వాడికి వంత పాడతావు' అని కసురుకునేవారు.
'చిన్నప్పుడే కదండీ, చిన్న సైకిల్ తొక్కేది! పెద్దయితే పెద్ద సైకిలో, పెద్ద మోటార్ సైకిల్‌నో నడుపుతాడు' అని చింటూ వాళ్ళ అమ్మ అనేది.
'ఆహా! నడుపుతాడు పెద్ద సైకిల్, పెద్ద మోటార్ సైకిల్' అని వెటకారంగా అనేవాడు చింటూ వాళ్ళ నాన్న.
ఆదివారం నాడు చింటూ ఇంట్లో ఉన్న పెద్ద సైకిల్ తీసుకుని, ఊరి పొలిమేరవైపు తోసుకొని వెళ్ళసాగాడు. అంతలోనే తోటి స్నేహితులు చిన్న సైకిల్ మీద 'రరు రరు' మంటూ దూసుకుని, చింటూని దాటుకొని, వెళ్ల సాగారు.
చింటూ చిన్నబోయి పెడల్ మీద కాలు వేశాడు. అంతే సైకిల్ చైన్ ఊడిపోయింది! చింటూ ఎంత ప్రయత్నించినప్పటికీ, చైను పెట్టడం కుదరడం లేదు చింటూ చేతులకంతా నల్లగా ఆయిల్ మరకలు అంటుకున్నాయి.
ఇంతలో విజరు అనే కుర్రాడు వచ్చాడు చింటూని ఏమైందని అడిగి, సైకిల్ స్టాండ్ వేసి చిన్న కట్టెపుల్ల సహాయంతో చిటికెలో చైన్ పెట్టేశాడు. అప్పుడు చింటూకి వాళ్ళ నాన్న కారు డ్రైవర్ కావడం కారుకు స్వయంగా తనే టైర్లు మార్చుకోవడం, కారును రిపేరు చేసుకోవడం కళ్ళ ముందు కదలాడింది. నెమ్మదిగా పెద్ద సైకిల్ తోసుకొని, ఇంటికి వచ్చి, జాగ్రత్తగా సైకిల్ స్టాండ్ వేసి, శుభ్రంగా తుడవ సాగాడు.
'చూశారా! చింటూ పెద్ద సైకిల్ ఎంత పండులాగా ఉంచుకుంటున్నాడో' అంది చింటూ వాళ్ళ అమ్మ. 'అవునవును' అని చిరునవ్వు నవ్వాడు చింటూ వాళ్ళనాన్న.
'నాన్న గేర్ కేస్ అంటే ఏంటి?' అని ఆరాగా అడిగాడు చింటూ. వెంటనే వాళ్లనాన్న సైకిల్ దగ్గరకొచ్చి, గేర్ కేసును చూపించారు. 'మరి మడ్గర్ అంటే?' అని మళ్ళీ అడిగాడు చింటూ. తండ్రి చూపించారు. అలాగే సైకిల్లో అన్ని భాగాలను, వస్తువులను చింటూ వాళ్ళ నాన్నను అడిగి మరీ తెలుసుకున్నాడు. వాళ్ళ నాన్న కూడా విసుక్కోకుండా వివరంగా చెప్పారు.
ఆ రోజు సంక్రాంతి పండుగ. పొద్దునే చింటూని వాళ్ళ నాన్న పిలిచి 'ఇదిగో' అంటూ కీ చైన్ ఇచ్చారు.
'దేనిది నాన్న!' అంటూ ఆశ్చర్యంగా అడిగాడు చింటూ. 'నీ చిన్న సైకిల్‌ది.' అన్నారు వాళ్ళ నాన్న.
'నిజమా!' అని చింటూ ఎగిరి గంతేశాడు. 'నిజమే చింటూ నీకు ఇప్పుడు సైకిల్ తొక్కడమే కాదు, సైకిల్‌ను శుభ్రంగా ఉంచుకోవడం, జాగ్రత్తగా వాడుకోవడం కూడా వచ్చింది. మనిషికి ఏదైనా గాయమైతే డాక్టర్ దగ్గరికి వెళ్లే లోపలే ప్రథమ చికిత్సగా గాయాన్ని కడిగి, పసుపు రాయడం, గాయం తీవ్రతను బట్టి కట్టు కట్టడం చేయాలి. అలాగే సైకిల్‌కు ఎప్పుడైనా, ఏదైనా పోయినా మనం బాగు చేసుకునేలా ఉండాలి. ఆ నేర్పు నీకిప్పుడు వచ్చింది. అందుకే ఇప్పుడు నీకు చిన్న సైకిల్ కొనిచ్చాను' అని అసలు విషయం చెప్పారు చింటూ వాళ్ళ నాన్న.
అమ్మిన వెంకట అమ్మిరాజు
9440708656