
2022 ఫిఫా వరల్డ్ కప్ క్రీడా స్ఫూర్తికి, సమిష్టి పోరాట విజయానికి సంకేతంగా నిలిచింది. ప్రపంచ విజేతగా అర్జెంటీనాను నిలిపింది. ఆ దేశ 36 ఏళ్ల కలను సాకారం చేయడంలో 35 ఏళ్ల కెప్టెన్ లియోనెల్ అండ్రస్ మెస్సీ కీలక పాత్ర పోషించాడు. మూడోసారి ఆ జట్టును జగజ్జేతగా నిలిపాడు. దిగ్గజ క్రీడాకారులు మారడోనా, పీలే సరసన స్థానం సంపాదించాడు. 96 ఏళ్ల ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్‌బాల్ (ఫిఫా) ప్రపంచకప్ చరిత్రలో మునుపెన్నడూ లేని మెరుపులు, ఉత్కంఠల నడుమ చివరి వరకూ వీక్షకులను కట్టిపడేసిన వరల్డ్ కప్‌గా చిరకాలం నిలిచిపోతుంది. గ్రూపు దశలో తొలిమ్యాచ్‌లోనే పసికూన సౌదీ అరేబియా చేతిలో ఓడినా, అర్జెంటీనా జట్టు సారథి మెస్సీ సమిష్టిగా చివరి వరకూ పోరాడేలా జట్టుకు స్ఫూర్తినిచ్చాడు. 2014 ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేర్చిన మెస్సీ, ఈ ఫిఫాలో తొలి ఓటమి తరువాత అన్ని జట్లపై అద్భుత విజయాలు సాధించడంలో కీలకపాత్ర పోషించి, తన వ్యూహంతో ఫైనల్‌లో గెలిపించాడు. ఈ టోర్నీలో మొత్తం ఏడు గోల్స్ కొట్టిన మెస్సీ, మరో నాలుగు గోల్స్‌కు సహాయకారిగా ఉండి, గోల్డెన్ బాల్ అవార్డును సాధించాడు. నాకౌట్ దశలో ప్రతి మ్యాచ్‌లోనూ గోల్ సాధించిన క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు. ఐదు వరల్డ్ కప్‌లలో ఆడిన, గత వరల్డ్‌కప్‌లో అత్యధికంగా 26 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా, అండర్-20 ప్రపంచకప్, ఒలింపిక్ గోల్డ్, కోపా అమెరికా, ఫిఫా ప్రపంచకప్ అందుకున్న ఏకైక కెప్టెన్‌గా రికార్డుల కెక్కాడు. 2022 సీజన్‌లో మొత్తంగా 29 మ్యాచుల్లో మెస్సీ 24 గోల్స్, 23 సార్లు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌లను అందుకున్నాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్ జట్టులో ఆటగాళ్లంతా ఒక ఎత్తయితే 23 ఏళ్ల ఎంబపే ఒక్కడే మరో ఎత్తు. ఏకపక్షంగా సాగుతున్న ఫిఫా ఫైనల్ మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చి, హ్యాట్రిక్ గోల్స్‌తో ఆటను పెనాల్టీ షూటవుట్ల దాకా తీసుకొచ్చాడు. ఏకంగా ఎనిమిది గోల్స్ చేసి, గోల్డెన్ బూట్‌ను సాధించాడు. ఫ్రాన్స్‌కు వలస వచ్చి స్థిరపడిన ఆటగాళ్లతో కూడిన ఆ జట్టు కూడా సమిష్టిగా పోరాడి, మంచి ప్రతిభ చూపడం అభినందనీయం.
పశ్చిమ దేశాలు విషం కక్కినా, అన్ని సవాళ్లను అధిగమించి ఆసియా ఖండంలోని ఖతర్ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను గొప్పగా మార్చింది. మన రాష్ట్రంలో ఒక జిల్లా జనాభా అంత కూడా లేని ఈ దేశం ఇంత గొప్పగా నిలవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజలు వీక్షించే క్రీడగా, ప్రైజ్ మనీలో, గుర్తింపులో తొలిస్థానం ఫిఫాదే. మనదేశంలోసైతం టివిలతోపాటు యాప్‌ల ద్వారా 11 కోట్లమంది వీక్షించారంటే ఫిఫాకి ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. 35 లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించారని అంచనా. మొరాకో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ జట్టుగా నిలిచింది. సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, జపాన్ వంటి ఆసియా జట్లు మంచి పోరాట పటిమను ప్రదర్శించాయి. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా 2026లో నిర్వహించే ఫిఫా వరల్డ్ కప్‌లో 48 దేశాలు ఆడనున్నాయి. ఖతార్‌లో 32 దేశాలు పోటీపడగా, వచ్చే ప్రపంచకప్‌లో 16 దేశాలు అధికం. ఇప్పటివరకూ ఫిఫా కప్‌ను ఎక్కువసార్లు గెలిచిన దేశం బ్రెజిల్.
1950-60లలో రెండుసార్లు ఆసియా ఫుట్‌బాల్ ఛాంపియన్‌గా నిలిచి, ఆసియాలోనే మంచి జట్టుగా గుర్తింపు పొంది, అనేక విజయాలను సాధించిన భారత్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. భారత్ ప్రస్తుత ర్యాంక్ 106. ప్రపంచకప్‌లో ఆసియా నుంచి జరిగే అర్హత పోటీల్లో భారత్ జట్టు ఏమాత్రం పోటీనివ్వలేకపోతోంది. రాజకీయ జోక్యం ఎక్కువ కావడం, గుత్తాధిపత్యం తదితరాలతో జాతీయ సమాఖ్య ఇటీవల ఫిఫా నుంచి నిషేధానికి గురై, ఆ తరువాత మళ్లీ తేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైనా నిర్లక్ష్యం మాని పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలి. బడ్జెట్‌లో అందుకు తగినవిధంగా నిధులు కేటాయించాలి. ఉన్న మైదానాలను కూడా ప్రైవేటువారికి అప్పగిస్తూ, పే అండ్ యూజ్ విధానాలను ప్రవేశపెట్టే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా పునరాలోచించాలి. ఫిఫా వరల్డ్ కప్‌ను నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ... అందులో విజయం సాధించే సత్తా ఉన్న క్రీడాకారులను తీర్చిదిద్దడంపై దృష్టి నిలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఫుట్ బాల్ లాంటి క్రీడల్లో మనం విశ్వవేదికలపై రాణించగలం.