
2018 తరువాత రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన అతి పెద్ద భారీ ప్రదర్శన ఇది. తమ సమస్యల్ని ఢిల్లీకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్ని ప్రజాసంఘాలు నిర్ణయం చేసినప్పటి (సెప్టెంబర్ 2022) నుండే ఈ ప్రదర్శనకు సమీకరణ ప్రారంభమైంది. మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు దారితీసిన రైతుల నిరసనలు విజయవంతం కావడం ఈ కార్యక్రమానికి ప్రేరణ అని నిర్వాహకులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తిని తెలియచెప్పేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని ...ఎఐకెఎస్ ఉపాధ్యక్షుడు, రైతుల నిరసనలకు నాయకత్వం వహించిన 'సంయుక్త కిసాన్ మోర్చా' ముఖ్య నేత హన్నన్ మొల్లా అన్నారు.
'నేను ముప్పై ఐదేళ్ల నుంచి అంగన్వాడీ కార్మికురాలిగా పని చేస్తున్నాను. ఇతర ప్రభుత్వోద్యోగుల మాదిరిగా ప్రభుత్వం మమ్ముల్ని 60 ఏళ్ళకు ఉద్యోగ విరమణ చేయిస్తుంది. కానీ... ప్రభుత్వోద్యోగులకు ఇచ్చే హోదా, జీతం మాత్రం ఇవ్వదు. వృద్ధాప్యంలో మమ్ముల్ని ఎవరు చూస్తారు? మోడీ ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేసి, రాష్ట్ర హోదాను ఎత్తేసి మమ్ముల్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తెచ్చింది కానీ మా జీతాల్ని ఏమాత్రం పెంచలేదు. మా సమస్యల్ని ప్రభుత్వానికి వినిపిద్దామని ఇక్కడికి వచ్చామ'ని కాశ్మీర్‌కు చెందిన ఐ.సి.డి.ఎస్ వర్కర్ పర్వీనా చెప్పింది. కుల్గాం జిల్లా లోని ఒక బ్లాక్ అంగన్వాడీ యూనియన్‌కు ఆమె అధ్యక్షురాలు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని రకాల పనులు చేసినందుకు నెలకు రూ.4100 గౌరవ వేతనం అందుతుందామెకు. ఏప్రిల్ 6వ తేదీన తమ సమస్యల్ని ప్రభుత్వానికి వినిపించాలని ఢిల్లీ ఎండలను సైతం లెక్కచేయకుండా రైతులు, కార్మికులతో కలిసి ఢిల్లీ లోని రామ్ లీలా మైదాన్‌కి వచ్చింది.
ఆ నిరసన ర్యాలీ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు వుంచింది. అవి: నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలి. విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కింద చేసే పనిని 200 పని దినాలకు పెంచాలి. నెలకు 10 వేల రూపాయల సార్వత్రిక పెన్షన్ ఇవ్వాలి. నెలకు రూ. 26 వేల కనీస వేతనం ఇవ్వాలి. ఒప్పంద పని విధానాన్ని రద్దు చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన ( సి2ం50 ) ఫార్ములా ప్రకారం చట్టబద్ధమైన కనీస మద్దతు ధరను కల్పించాలి. పై డిమాండ్లతో పాటు సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని, వివాదాస్పద అటవీ హక్కు చట్ట సవరణల్ని విరమించుకోవాలని కూడా ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్), సిఐటియు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
శ్రమజీవులైన పారిశ్రామిక కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు సమస్యల సాధనకు ఐక్యతను చాటడం చారిత్రాత్మకమని ఉపన్యాసకుల్లో ఒకరైన ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ అన్నారు. 'ఉత్పాదక వర్గాలైన ఈ శ్రామిక వర్గాలు నయా ఉదారవాదం చేతుల్లో ఘోరంగా దెబ్బ తిన్నాయ'ని ఆయనన్నారు.
'మాకు రూ.4000 ఏ మాత్రం సరిపోవు. నెలకు రూ.26 వేలకు తక్కువ వేతనాన్ని మేం ఒప్పుకునే ప్రసక్తే లేద'ని ప్రదర్శనలో కార్మికులు నినదించారు. వారిలో ఐసిడిఎస్ సహాయకులు, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వున్నారు. కోటి మందికి పైగా ఉన్న ఈ 'స్కీం వర్కర్లు' మంచి వేతనాలు, సామాజిక భద్రతతో తమను శాశ్వత కార్మికులుగా గుర్తించాలని అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు.
దేశ నలుమూలల నుండి ఎంతో క్రమశిక్షణతో, శ్రేణి తప్పకుండా దేశ రాజధాని లోని రామ్‌లీలా మైదానం వరకు జరిగిన ఈ ప్రదర్శనలో భాగస్వాములైన కార్మికుల్ని చూసి ఒక పోలీస్ అధికారి ప్రశంసలు కురిపించారు. ఒకరోజు ముందే ట్రాఫిక్ పోలీసులు రూట్ మార్చిన విషయాన్ని ప్రతిరోజూ వచ్చిపోయే ప్రజలకు తెలియజేశారు. కానీ ఈ ప్రదర్శనలో దాదాపుగా 70 వేలకు పైగా భాగస్వాములైన కార్మికులు ఢిల్లీ నగరవాసులకు ఎలాంటి అసౌకర్యం కలిగించలేదు.
2018 తరువాత రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన అతి పెద్ద భారీ ప్రదర్శన ఇది. తమ సమస్యల్ని ఢిల్లీకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్ని ప్రజాసంఘాలు నిర్ణయం చేసినప్పటి (సెప్టెంబర్ 2022) నుండే ఈ ప్రదర్శనకు సమీకరణ ప్రారంభమైంది. మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు దారితీసిన రైతుల నిరసనలు విజయవంతం కావడం ఈ కార్యక్రమానికి ప్రేరణ అని నిర్వాహకులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తిని తెలియచెప్పేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎఐకెఎస్ ఉపాధ్యక్షుడు, రైతుల నిరసనలకు నాయకత్వం వహించిన 'సంయుక్త కిసాన్ మోర్చా' ముఖ్య నేత, పశ్చిమ బెంగాల్ నుండి గతంలో లోక్‌సభకు ఎన్నికైన హన్నన్ మొల్లా అన్నారు.
ఈ ప్రదర్శనలో దాదాపు 20 వేలకు పైగా వ్యవసాయ కార్మికులు (అందులో ఎక్కువగా మహిళలు) హాజరయ్యారు. వ్యవసాయ కూలీలకు, గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పని చేసే కూలీల వేతనాల చెల్లింపులు, వారి పని దినాల తగ్గింపు ప్రధానమైన సమస్యగా వుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ అన్నారు. పురుషులు కష్టమైన పనుల కోసం వలస వెళ్తుంటే, మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగమవుతున్నారు. ఈ రంగంలో ఈ పని చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. ఇది, విద్యా రంగానికి సంబంధించిన వర్గాల్లో కూడా ఒక పెద్ద చర్చగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం 200 పని దినాలకు, రోజుకు రూ. 600 లేదా అంతకంటే ఎక్కువ వేతనానికి హామీ ఇవ్వాలని అన్ని సంఘాల నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధి హామీ చట్టం కింద పని చేసే వారికి ఆన్‌లైన్ హాజరు విధానం విధింపు, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఆధార్‌తో అనుసంధానం చేయబడిన నగదు బదిలీ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సేవల ప్రైవేటీకరణ పెరుగుతుండడంతో దళితులు వెనక్కి నెట్టివేయబడి, ప్రభుత్వ సేవలకు దూరమవుతున్నారని, వ్యవసాయ కార్మికుల్లో దళితులే అధిక సంఖ్యాకులని కూడా సింగ్ అన్నారు.
కొన్ని రాష్ట్రాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కింద పనిచేసే వారికిచ్చే వేతనాలు వ్యవసాయ కార్మికులకిచ్చే కనీస వేతనాల కంటే తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ కూలీలకిచ్చే వేతనాల విషయంలో కూడా రాష్ట్రాల మధ్య చాలా తేడాలున్నాయి. కేరళలో రూ.700 లేదా ఆపైన ఉంటే, బీహార్ లో రూ.170 మాత్రమే చెల్లిస్తున్నారు. స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్ళ తరువాత కూడా కేంద్రం సమగ్రమైన చట్టాన్ని తీసుకురాలేదు. ఇది ఈ ర్యాలీ చేస్తున్న ముఖ్యమైన డిమాండ్లలో ఒకటి. కమిటీలను రూపొందించారు, కొన్ని ప్రైవేటు బిల్లుల్ని కూడా ప్రవేశపెట్టారు. కానీ వ్యవసాయ కార్మికులకు ఒక కేంద్ర వేతన చట్టాన్ని ముందుకు తెచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని'' విక్రమ్ సింగ్ అన్నారు.
పట్టించుకోని ప్రభుత్వాలు
పని ఉంటే బీహార్‌లో ఎక్కడైనా రూ.100-150 మధ్య కూలీ వస్తుందంటాడు ప్రదర్శనలో పాల్గొన్న వ్యవసాయ కార్మికుడు సురేష్ పాశ్వాన్. ఇతను బీహార్ లోని బెగుసరారు కి చెందినవాడు. 'బీహార్‌లో 22 లక్షల ఎకరాల భూమి ఉంది. దానికి సమానంగా వ్యవసాయ కార్మికులున్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వం భూసంస్కరణలకు సంబంధించి ఏమీ చేయలేదు. ఆ భూసంస్కరణల ద్వారానే మాకు పట్టాలిస్తామని చెప్పార''ని పాశ్వాన్ అన్నాడు. బీహార్ భూసంస్కరణలపై డి.బంధోపాధ్యాయ రూపొందించిన నివేదికను పాశ్వాన్ ప్రస్తావించాడు. పిప్రా దొద్రాజ్ పంచాయితీలో భూమి లేని 500 కుటుంబాలు 2010-12 నుండి క్షేత్రవాసాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. కానీ 2019లో బుల్డోజర్‌తో అన్ని కుటుంబాల్ని వెళ్ళగొట్టారు. ఆ భూమి అలానే ఉంది. ఇప్పుడు దానిని ఒక జమీందారు సాగుచేస్తున్నాడని పాశ్వాన్ చెప్పారు.
మాధేపురకు చెందిన సంజరుశ్రీ రజత్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. ''మాకు 100 రోజుల పని దినాలు లేవు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద జరిగే పనుల్లో మానవ శ్రమకు బదులుగా జెసిబి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ, భారీ వాగ్దానాలు చేస్తుంది. కానీ మాకు పని కల్పించేందుకు పరిశ్రమలు లేవు. నూనె లీటర్ రూ.200. మేమేం తినాలి? మమ్ముల్ని ఎవరు కాపాడతారు?'' అని ప్రశ్నిస్తున్నాడు సంజయ్.
ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించకుండా, పంట సేకరణకు హామీ ఇవ్వకుంటే రైతులు పంట పండించకుండా నిలిపివేస్తారని ఘజియాబాద్ రైతు బ్రజేష్ అంటున్నాడు. ''మాకు ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది (ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇచ్చే పైకాన్ని ఉదహరిస్తూ). మా నుండి 20 వేల రూపాయలు తీసుకుంటుంది'' అన్నాడు ఆవేదనగా. ఎరువులు, గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏడు సంవత్సరాల క్రితం ఒక కేజీ పొటాష్‌ను రూ.700కు విక్రయించారు. ఇప్పుడది రూ.1700. గ్యాస్ సిలిండర్ ధర రూ.1130కు పెరిగింది కాబట్టి పి.ఎం కిసాన్ యోజన కింద ఇచ్చే డబ్బుకు అర్థం లేకుండా పోయిందన్నాడు.
ప్రభుత్వ సహకార సంఘాల దగ్గర ఎరువులను పంపిణీ చేస్తారన్నారు. కానీ అక్కడ ఎప్పుడూ ఫెర్టిలైజర్ అందుబాటులో ఉండదు. అంతా బ్లాక్ మార్కెట్ వ్యాపారం నడుస్తున్నదని అలీగఢ్‌కు చెందిన రైతు కరంవీర్ సింగ్ ఆరోపణ. రబీ పంటలు పండించే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఎరువుల కొరత ఏర్పడినట్లు నివేదికలు ఉన్నాయి. ''మా కుటుంబం మొత్తం వ్యవసాయ పనుల్లో నిమగమవుతుంది. మేము రుణాలు తీసుకుంటాం. ఒకవేళ రైతు పండించిన పంటకు సరైన ధర రాకుంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డుపై బ్యాంక్ మాకిచ్చిన రుణాల వల్ల ప్రయోజనం ఏముంది? ద్రవ్యోల్బణం నెలకొన్న ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల రూపాయల వల్ల ఏం ఒరుగుతుంది?'' అని కరంవీర్ సింగ్ ప్రశ్నిస్తున్నాడు. వ్యవసాయ కూలీకి, రైతుకు మధ్య ఎలాంటి తేడా లేదని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు.
చెరుకు రైతుల వెతలు
చెరుకు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గడచిన నాలుగు సంవత్సరాల్లో చెరుకుకు ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ (ఎఫ్.ఆర్.పి)ను కేవలం రూ. 70 మాత్రమే పెంచిందని వారు చెప్తున్నారు. పెట్టుబడి పెరిగింది కాబట్టి ప్రభుత్వం క్వింటా చెరుకుకు రూ.500 లేదా టన్ను చెరుకుకు రూ.5000 చెల్లించాలని వారన్నారు. ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌పి ప్రకారం ఒక టన్ను చెరుకు రూ.2820 మాత్రమే. చెరుకు మిల్లుల యాజమాన్యాలు రైతులకు చెల్లించాల్సిన డబ్బులు సరిగా చెల్లించడంలేదని చెరుకు రైతు, హర్యానా రాష్ట్ర కిసాన్ సభ నాయకుడు బల్వంత్ సింగ్ అన్నాడు. రైతులు ఆందోళన చేపట్టిన సందర్భంలో మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. కొన్ని సహకార చెక్కర మిల్లులున్నాయి కాని వాటిని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పాడు.
ఇంత పెద్ద ప్రదర్శనను కూడా ప్రధాన స్రవంతిలోని మీడియా పట్టించుకోనేలేదు. ఒకవేళ ఇదే రాజకీయ నాయకుడి ప్రసంగమైతే...అది కూడా అధికార పార్టీకి చెందిన నాయకుడి ఉపన్యాసం అయితే టీవీ ఛానెళ్లు రోజంతా ప్రసారం చేసేవి. ఈ కార్యక్రమానికి సంబంధించి వారికి సమయం లేదేమో...అని కుల్గాంకు చెందిన ఐసిడిఎస్ వర్కర్ పర్వీనా వ్యాఖ్యానించింది. ప్రభుత్వం మా బాధల్ని ఆలకించకుంటే ... మేం మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తూనే వుంటాం...అంటోందామె.
('ఫ్రంట్‌లైన్' సౌజన్యంతో)
టి.కె.రాజాలక్ష్మి