నేనొక ఆశలపిట్టనై ఎగురుతూ ...
నింగినంతా చుట్టేస్తున్నాను.
తడబడుతున్న జీవితపు అడుగులను
సరిచేసుకుంటూ...కదిలిపోతున్న కాలాన్ని
నిలదీస్తూ...కష్టాల తుఫానులో చిక్కుకొని..
బతుకు నావను నడిపిస్తున్నాను.
హృదయపు గదిలో నిండిన తిమిరాన్ని..
నాలుగు వెలుగుచుక్కలను విసిరి పారద్రోలుతున్నాను
గతమంతా కత్తుల వేటలామారి వేదిస్తున్నా..
గడుస్తున్న కాలంతో యుద్ధం చేస్తునే వున్నాను.
ఆశించిన ఫలితం ఎప్పుడూ నన్ను పలకరించకున్నా
ఏనాడు కృంగిపోలేదు.
నా మదిలో బాదంతా భూతల్లికి తెలుసు.
రాలుతున్న చెమటచుక్కల సాక్షిగా...
పొలం ఒడ్డున పొద్దస్తమానం ఎవుసాయాన్నే
నమ్ముకొని బతుకు సాగిస్తున్నా.
కాడెడ్లు రెండు నెర్రలుబారిన నేలను దున్ని...
మట్టిలోంచి మాణిక్యాలను తియ్యమంటున్నవి.
విత్తిన విత్తులన్నీ నా మంచికోరి మొలుస్తున్నాయి.
పురుడోసుకుంటున్న మొక్కలన్నీ నన్ను..
మదిలో నింపుకొని మొలకెత్తుతున్నాయి.
పూస్తున్న పూలన్నీ నేత్రాల కిటికీలు తెరుచుకొని
నన్నే చూస్తున్నాయి.
తూనీగల గుంపంతా.. కైగట్టి పాడుతున్న నా కన్నీటి
పాటను వింటూ నా చుట్టే తిరుగుతున్నాయి.
మట్టి గంధమంతా నా నుదుటన తాకి...
వీరతిలకాన్ని దిద్దుతున్నాయి.
ఆకాశం నుంచి జారిన అంబువు..
పుడమితల్లి తనువుపై ..మొక్కలను
ముద్దాడుతున్నాయి.
పొట్టకొచ్చిన వరిపైరు..పాలపొంగుల్లా పొంగుతున్న
తెల్లబంగారం.. జొన్న కంకులన్నీ తమ మెడలు వంచి
కర్షకుడికి సలాం చేస్తున్నవి.
కళ ్లనుండి రాలుతున్న కన్నీరును తుడుస్తున్నాయి.
అవిశ్రాంత యుద్ధంలో గెలుపు పిలుపు ఎక్కడో మరి.
ధాన్యపురాసుల కళ్లంకాడ.. దళారుల గుంపు.
ఏడాది కష్టమంతా తాలు రూపంలో ఎగిరిపోతుంది.
తూకంలోని గింజలన్నీ బరువు తగ్గి...
సేద్యకాడి గుండెలో గుబులు రేపుతున్నాయి.
నిన్నంతా నిండిన సంతోషం.. కళ్ల ముందు
కదలాడుతున్న కల్లోలానికి ఊగిసలాడుతోంది.
నాలుగు పచ్చనోట్లు నాకాడికి రాగానే..
కలవడినట్లు వాలిపోతారు..
నూటికి ఐదుపైసల నా మిత్తి దోస్తులు.
నేనిప్పుడు మళ్లీ పరుగెత్తేది...
నేను నమ్ముకున్న సేద్యంకాడికే.
ఇంకెన్ని చెమటచుక్కలు బాకీవున్నానో...
ఇంకెన్ని రక్తపుబొట్లు దారపోయాలో..ఈ నేలతల్లికి.
నేను నేలతల్లికి సేవచేసే సైనికుణ్ణి..
నా అవిశ్రాంత యుద్ధం.. కొనసాగుతూనే వుంటుంది.
ఈ తనువు కాలేవరకూ.
అశోక్ గోనె
94413 17361