
కొంచెం కారం, కొంచెం తీపి, కొంచెం చేదు అన్నట్లుగా నవంబరు 15-16 తేదీల్లో ఇండోనేషియా లోని బాలిలో జరిగిన జి20 శిఖరాగ్ర సమావేశ ప్రకటన ఉంది. వర్తమాన ప్రపంచ విభేదాలను ప్రతిబింబిస్తూ పదిహేడు పేజీల పత్రం తమ ఎత్తుగడలు, వ్యూహం, రాజకీయాలకు అనుగుణంగా ఎవరికి వారు భాష్యం చెప్పుకొనేందుకు వీలుగా ఉందని చెప్పవచ్చు. పందొమ్మిది దేశాలూ, ఐరోపా సమాఖ్యలతో ఉన్న ఈ బృందం అంతర్ ప్రభుత్వాల వేదిక. ప్రపంచ ఆర్థిక రంగానికి సంబంధించి ద్రవ్య స్థిరత్వం, వాతావరణ మార్పులను పరిమితం గావించటం, నిరంతర అభివృద్ధి సంబంధింత అంశాల మీద పని చేస్తున్నది. ప్రపంచ భద్రతా సమస్యల చర్చకు వేదిక కానప్పటికీ కొన్ని దేశాల ఒత్తిడి మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్ సంక్షోభం మీద కూడా బాలి శిఖరాగ్ర ప్రకటనలో ప్రస్తావించారు. ప్రధాన నేతలలో వ్లదిమిర్ పుతిన్ ఈ సభకు రాలేదు. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా-ఐరోపా సమాఖ్య ఒక వైపు, రష్యాను సమర్ధించే దేశాలు మరోవైపు, తటస్థ చైనా, భారత్‌లు ఈ కూటమిలో భాగస్వాములు. వీటి మధ్య తీవ్ర విభేదాల పూర్వరంగంలో అసలు ఒక ప్రకటన చేస్తారా అన్న సందేహాలు తొలుత వెలువడినప్పటికీ రష్యా నిరసన మధ్య ఎట్టకేలకు వెలువడింది.
సందిగ్ధానికి తావులేకుండా ఉండాలని కొన్ని దేశాలు డిమాండ్ చేసిన కారణంగా ఎక్కువ మంది సభ్యులు ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఖండించినట్లు బాలి ప్రకటనలో పేర్కొన్నారు, మిగిలిన వారు ఆ వైఖరికి దూరంగా ఉన్నట్లు ఈ పదజాలం స్పష్టం చేసింది. ఇది యుద్ధాల యుగం కాదని షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో భారత ప్రధాని మోడీ అన్న మాటలను కూడా ఈ ప్రకటనలో చేర్చారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి విరాళంగా ఇచ్చిన ఎరువులు, నల్లసముద్రంలో ఆహార ధాన్యాల నడవా ఏర్పాటు గురించి కూడా పేర్కొని రష్యాను సంతృప్తిపరచేందుకు చూశారు. సంఘర్షణలు మానవాళికి ముప్పు కలిగిస్తాయంటూ సమావేశం ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచ గోధుమ, ఎరువుల మార్కెట్లను స్థిరీక రించేందుకు తమకు తగినంత సామర్ధ్యం ఉందని తమ మీద అక్రమంగా ఆంక్షలను విధించి ఆటంకాలను కలిగించినప్పటికీ ఇప్పటికే 105 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఎగుమతి చేశామని, వాటిలో 60 శాతం ఆసియా, 40 శాతం ఆఫ్రికా ఖండానికి పంపినట్లు ఈ సమావేశాల్లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ ఉద్ఘాటించారు. ఈ విషయంలో పశ్చిమ దేశాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు.
ఈ సమావేశాలలో పాల్గొన్న నేతలు ఎడముఖం పెడముఖంగా ఉండటం కూడా ప్రపంచం గమనించింది. చైనా తమ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారిందన్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఈ సమావేశాల్లో మాట్లాడుతూ...ముప్పు బదులు సవాళ్లను విసురుతున్నదని సవరించుకోవాల్సి వచ్చింది. చైనా అధినేత సీ జిన్‌పింగ్-రిషి ఈ సమావేశాల సందర్భంగా విడిగా భేటీ అవుతారని భావించినప్పటికీ చివరి క్షణంలో వీలుగాక రద్దయినట్లు చెప్పారు. ప్రధాని పదవికి పోటీ పడినపుడు, ఇతర సందర్భాలలో చైనా వ్యతిరేక వైఖరి ప్రదర్శించిన రిషి ఏ ముఖం పెట్టుకొని జిన్‌పింగ్‌తో భేటీ అవుతారని స్వదేశంలో విమర్శలు తలెత్తవచ్చనే కారణంగా రద్దు చేసుకొని ఉండవచ్చు. నేతల మధ్య జరిగే సంభాషణలను మీడియాకు లీక్ చేసే బుద్ధి ఏమిటని ఈ సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడేవ్‌ను సీ జిన్‌పింగ్ నిలదీసినట్లు వార్తలొచ్చాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే చర్చించుకుందాం రండన్నారు. దీనికి జస్టిన్ స్పందిస్తూ ప్రతి అంశాన్ని బహిరంగంగా చర్చించటం తమకు అలవాటని దాటవేశారు. లడఖ్ సరిహద్దులో జరిగిన సంఘటనల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ సమావేశాల్లో కొందరు నేతలతో భేటీ జరిపినా సీ జిన్‌పింగ్‌తో విందు సందర్భంగా కరచాలనానికే పరిమితమయ్యారని, అది కూడా వచ్చే ఏడాది జి20 సారథిగా భారత్ ఉండటం, షాంఘై సహకార సంస్థ 2023 శిఖరాగ్ర సభ భారత్‌లో జరగనున్న పూర్వరంగంలో సంప్రదింపులకు అవసరం రీత్యా ఆ మేరకైనా స్పందించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. జి20 18వ సమావేశం మన దేశంలో జరగనుంది. ఎక్కడ సమావేశం జరిగితే ఆ దేశం ఏడాది పాటు సారథిగా ఉంటుంది. జి20ని ఐదు బృందాలుగా చేశారు. రెండవ గ్రూపు లోని రష్యా, టర్కీల్లో ఇప్పటికే సమావేశాలు జరగ్గా మన దేశంలో వచ్చే ఏడాది, దక్షిణాఫ్రికాలో 2025లో జరపాలని గతంలోనే ఖరారైంది. వచ్చే ఏడాది జరిగే సమావేశాలను మరుసటి ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా నరేంద్రమోడీ ముందుకు తెస్తారని కాంగ్రెస్ పేర్కొన్నది. ప్రతి దాన్ని తమ ఖాతాలో వేసుకొని ప్రచారం చేసుకుంటున్న తీరుతెన్నులను చూసిన తరువాత నరేంద్రమోడీ 2023ను ఎంచుకోవటంలో ఆ కోణం లేదని చెప్పలేము. సమావేశ లోగోలో బిజెపి కమలం గుర్తును పెట్టటం కూడా దీనికి బలం చేకూర్చుతున్నది. నిజానికి వరుస క్రమంలో ఏ దేశం అంతర్జాతీయ వేదికలకు సారథ్యం వహించినప్పటికీ సదరు దేశానికి ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదు.
- ఎం.కె.ఆర్