
ఏం జరుగుతుందో బిగ్గరగా చెప్పడమే ఎవరైనా, ఎప్పుడైనా చేయగల అత్యంత విప్లవాత్మకమైన పని. - రోజా లగ్జంబర్గ్, మార్క్సిస్టు సిద్ధాంత కర్త.
పోరాట యోధులకు, దేశ ద్రోహులకు తేడా ఈ విధంగా ఉంటుంది. భగత్‌సింగ్ బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేసినందుకు ఇరవైమూడేళ్ల వయసులో ఉరిశిక్షకు గురయ్యాడు. చంద్రశేఖర్ ఆజాద్ కూడా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసినవాడే. కాని, శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక ఇరవై అయిదేళ్ల వయస్సులో పిస్తోలు తన కణతలకు గురిపెట్టి కాల్చుకున్నాడు. పోరాట యోధులకు, ఉద్యమకారులకు ఎప్పటికీ వీరు స్ఫూర్తిదాయకులే. ఇక సావర్కర్ ఏం చేశాడన్నది ప్రపంచానికి తెలుసు. క్షమాభిక్ష పిటిషన్లు రాసి రాసి, బ్రిటిష్ వారికి లొంగిపోయినవాడు సావర్కర్. ఇక ఆ రోజుల్లో మహ్మదాలీ జిన్నాతో చేతులు కలిపి, స్వాతంత్య్రోద్యమాన్ని నీరుగార్చడానికి బ్రిటిష్ వారికి సహకరించినవాడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ! యోధులకు, ద్రోహులకు తేడా తెలుసుకోవాలంటే, ఈ నలుగురి జీవిత చరిత్రలు తెలుసుకుంటే చాలు !
ఇక గోల్వాల్కర్ ఏమన్నాడో చూడండి. ''హిందూస్తాన్‌లో ఉన్న విదేశీ జాతుల వారంతా హిందూ సంస్కృతి, భాషను అవలంభించాలి! హిందూ మతం పట్ల గొప్ప భక్తి శ్రద్ధలను కలిగి ఉండాలి. దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. హిందూ జాతిని కీర్తించడం తప్ప, వారు మరొక భావజాలాన్ని కలిగి ఉండకూడదు. వారు, వారి ప్రత్యేకమైన ఉనికిని వదులుకుని, హిందూ జాతిలో కలిసిపోవాలి. లేదా దేశంలో ఉంటే హిందూ జాతికి పూర్తి బానిసలుగా ఉండాలి. దేనినీ తమదిగా ప్రకటించుకోరాదు. వారికి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలూ ఉండగూడదు. పౌర హక్కులు సైతం ఉండగూడదు'' అని 'అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్' అనే గ్రంథంలో స్పష్టంగా రాశారు గోల్వాల్కర్. ఈయన ఆర్‌ఎస్‌ఎస్‌కు రెండో గురువు. ఆరెస్సెస్ స్థాపించింది హెడ్గేవార్ అయినప్పటికీ, గోల్వాల్కర్ నేతృత్వంలోనే ఆరెస్సెస్ భావజాలం బాగా వ్యాప్తి చెందింది.
ఆ రోజుల్లో జర్మన్ జాతి ప్రతిష్ట విశ్వవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వారు తమ జాతి స్వచ్ఛతను, సంస్కృతినీ కాపాడుకోవడానికి - తమ దేశాన్ని యూదులు లేని దేశంగా (సెమిటిక్) శుభ్రపరుచుకోవాలని అనుకున్నారు. దీనినే ఆరెస్సెస్ వారు ఇక్కడ భారతదేశంలో అమలు చేయాలనుకున్నారు. యూదులపై హత్యాకాండ జరిపించిన హిట్లర్‌ను, జర్మనీని గోల్వాల్కర్ కీర్తించాడు. ప్రపంచమంతా జర్మనీని ఫాసిస్ట్ దేశంగా, హిట్లర్‌ను ఫాసిస్ట్ నియంతగా తిట్టిపోస్తుంటే... ఇక్కడ గోల్వాల్కర్ మాత్రం - యూదు జాతి లేకుండా జర్మనీ తనను తాను శుభ్రపరచుకుందని కీర్తించాడు. ఆ విధంగా ఆ దేశం కల్తీ లేని స్వచ్ఛమైన జాతిగా ఆవిర్భవించిందని ప్రశంసించాడు. అదే జర్మనీ ఫార్ములాను భారతదేశంలో అమలు చేయాలని కలలు గన్నాడు. భారతదేశంలో స్వచ్ఛమైన హిందూ జాతిని మాత్రమే మిగుల్చుకుని, మిగతా వారిని ఇక్కడి నుండి తరిమేయాలని పథకాలు, కుట్రలు సిద్ధం చేసుకున్నాడు. గోల్వాల్కర్ వారసులు 2002లో గుజరాత్‌లో సృష్టించిన అల్లర్లను తాజాగా గుర్తుచేసుకోవచ్చు. గోద్రాలో రైలు తగలబెట్టి, వేల మంది మరణానికి కారణమైన ఆ నేరమేధాన్ని ఎలా మరవగలం? గుజరాత్‌లో ముస్లింలపై సాగించిన హత్యాకాండ, వేల మందిని గాయాల పాలు చేసిన వికృత చేష్ట ఆరెస్సెస్ వారిదే కదా? వారి భావజాలానికి గుజరాత్‌ను ఒక ప్రయోగశాలగా చేసుకున్నారు.
మతోన్మాద ఆరెస్సెస్ - బీజేపీలు ఒకప్పటి ఫాసిస్టు జర్మనీని ఇప్పటికీ అనుసరిస్తున్నాయి. కానీ అధిక సంఖ్యాకులైన ఈ దేశ ప్రజల అభిప్రాయం అందుకు భిన్నంగా ఉంది. మరీ ముఖ్యంగా సమకాలీన భారతదేశపు యువతీ యువకుల అభిప్రాయం లౌకిక తత్త్వం వైపు ఉంది. ఎందుకంటే ఈ భారతదేశం ఒక లౌకికదేశం. ఇక్కడ లౌకికవాదులే ఉండాలని యువతరం ఆశిస్తోంది.
''ఆరెస్సెస్ - విశ్వహిందూ పరిషత్ పుట్టుకొచ్చి కనీసం వందేళ్లయినా కూడా కాలేదు. మరి అంతకు ముందు దేశంలో హిందువులు లేరా?'' అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రశ్నించారు. ''ఆరెస్సెస్ హిందుత్వ ఎక్కడి నుండి వచ్చింది? వారు ఆరాధించే దేవుడూ - దేవతా ఎవరూ?'' అని నిలదీశారు. హింస, గుండాగిరి, మన దేశ సంస్కృతి కాదని చెపుతూ మహాత్మాగాంధీని పొట్టన పెట్టుకుంది ఆ సంస్థేనని గుర్తుచేశారు. ''మనుషుల్ని జంతువుల కన్నా హీనంగా చూసేవారు ఈ సంస్థ సభ్యులే'' అని దుయ్యబట్టారు. ఆయన అన్నదాంట్లో అబద్ధాలేమీ లేవు. యధార్థవాది లోకవిరోధి - అనే మాటను మార్చుకోవాల్సి ఉంది. యధార్థవాదే లోకానికి శ్రేయోభిలాషి. అబద్ధాలు చెప్పేవాడే లోకవిరోధి. అంటే లోకానికి కీడు చేసేవాడు. ఉదాహరణకు మాతా కల్కి శివజ్యోతి ప్రకటనను గమనించండి. ఆరెస్సెస్ - బీజేపీ నాయకులు వారి అనుయాయులు జనాన్ని ఎలా రెచ్చగొట్టగలరో ప్రతి నిత్యం మీడియాలో చూస్తున్నాం. ''ఒక అమ్మాయి రేప్‌కు గురయ్యిందంటే, అది ఆమె ఖర్మ ఫలితం! గత జన్మలో ఆమె పురుషుడిగా ఉన్నప్పుడు అన్యాయంగా అక్రమంగా ఏ అమ్మాయినో రేప్ చేసి ఉంటుంది. దాని ఫలితమే ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తుంది'' అనే ఒక తుక్కు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అయితే దైవభక్తి పరులే ఇంతటి మూర్ఖ జ్ఞానాన్ని జనానికి ప్రసాదించగలరు.
విశ్వహిందూ పరిషత్, బజ్‌రంగ్ దళ్‌లకు మన భారతీయ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా లేఖ రాశాడు... ''నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీ మనోభావాలు దెబ్బతింటాయి. మీరు నిజంగా భరతమాత బిడ్డలయితే ''గాడ్సే ముర్దాబాద్'' అని నినదించండి చూద్దాం! అలా చేయలేకపోతే మీరు హిందూ వ్యతిరేకులుగా, ఉగ్రవాదులుగా పరిగణింపబడ తారు. ఇలాంటి పరిస్థితిని గమనించే ఉర్దూ కవి అక్బర్ అలహాబాదీ అంటారు... ''ఆహ్ భి కర్‌తే హై / తొ హో జాతే హై బద్‌నామ్ / ఓ కత్ల్ భి కర్‌తా హై / తొ చర్చా నహీ హోతీ'' అని. మేం వేదన ప్రకటిస్తేనే - నిందకు గురి అవుతాం- అదేమిటో వాడు హత్య చేసినా అది చర్చకే రాదు అన్నది ఆ చరణాల సారాంశం. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారు ఉన్నంత కాలం, నిజాయితీ పరులైన సామాన్య జనానికి బాధలు తప్పవు.
హిజాబ్ (తలపై కప్పుకునే గుడ్డ) ధరించడం, ధరించకపోవడం ఆయా మహిళల ఇష్టం. ఇరాన్‌లో హిజాబ్ వద్దంటున్నారు. మన కర్నాటక రాష్ట్రంలో హిజాబ్ కావాలంటున్నారు. అది వేసుకునే వారి ఇష్టం. దేశ ప్రధాని మోడీతో పాటు, ఆయన అనుచర గణమంతా నగ స్వాముల ముందు సాగిలపడుతుంటారు. వీరికి డ్రెస్ కోడ్ వర్తించదా ?
కర్ణాటక లోని బిజేపీ ప్రభుత్వం 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ఒక అసంబద్ధమైన అంశం ప్రచురించింది. పిల్లలకు బోధిస్తున్నారు. విషయం ఏమిటంటే సావర్కర్ అండమాన్ సెల్యులార్ జైలులో ఉండగా మాతృభూమిని చూడాలని అనిపించినప్పుడల్లా అక్కడ ఉండే బుల్‌బుల్ పక్షుల రెక్కల మీద కూర్చుని భారతదేశం వచ్చేవాడట. దేశాన్ని కళ్ళారా చూసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవాడట. చరిత్రను పురాణంగా, పురాణాన్ని చరిత్రగా మలిచే తెలివితేటలు అదేమిటో ఆరెస్సెస్ బీజేపీలకే ఉంటాయి. ఆ పాఠం చదువుకుంటున్న బాలబాలికల పరిస్థితి ఏమిటీ? రేపు వారు నిజం తెలుసుకుని... కల్పించిన అబద్ధాలను పాఠ్యాంశాలుగా ఎందుకు పెట్టారని నిలదీస్తే ప్రభుత్వ పెద్దలు ఎక్కడ దాక్కుంటారు? అయినా జైలు నుండి బయటపడి పక్షిరెక్కల మీద ఇండియా రాగలిగినవాడు ఇక్కడే ఉండిపోవచ్చుగదా? క్షమాపణలు కోరుతూ బ్రిటిష్‌వారి కాళ్ళమీద ఎందుకు పడ్డాడూ ?
అయినా వారిని అని ఏం లాభం? సంసారం ఎలా నడపాలో సన్యాసిని అడుగుతున్నాం మనం !
/వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త/
డా|| దేవరాజు మహారాజు