- చేతివాటం చూపిస్తున్న రియల్ ఎస్టేట్
- అనధికార లేఅవుట్లలో లావాదేవీలు
- న్యాయ చిక్కులు, అభివృద్ధికి అడ్డంకి
- ప్రభుత్వానికి జిల్లాల నుంచి నివేదికలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పట్టణీకరణ ప్రభుత్వం మొగ్గు చూపిస్తుంటే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ ప్రక్రియకు అడ్డు తగులుతోంది. అనధికార లేఅవుట్ల కారణంగా సమస్యలు పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా మధ్య తరగతి ప్రజలు ఈ లేఅవుట్లపై ఆశక్తి చూపిస్తుండడంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు వారు చెబుతున్నారు. ఇదే అంశంపై అనేక ఉడాల (పట్టణాభివృద్ధి సంస్థలు) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నట్లు తెలుస్తోంది. స్వచ్ఛమైన, నాణ్యత కలిగిన ఇళ్లు మధ్యతరగతి వారికి అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంటోందని వారు చెబుతున్నారు.
పట్టణీకరణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉడాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. రోడ్లు, ఇళ్లు, ఇతర కార్యక్రమాలు ఉడాల ద్వారానే జరుగుతున్నాయి. ఎవరైనా ప్రయివేటు సంస్థలు, వ్యక్తులు లే అవుట్లు వేయాలన్నా కూడా ఉడాల అనుమతి తప్పనిసరి. అయితే అనేక ప్రాంతాల్లో అనుమతి లేని లేఅవుట్లు పెరిగిపోతున్నాయని, వాటి వల్ల ట్రాఫిక్ వంటి సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని అధికారులు అంటున్నారు. చివరకు న్యాయపరమైన చిక్కులు కూడా రావడంతో వందల, వేల కేసులు న్యాయస్థానాల్లో పేరుకుంటున్నాయి. ఇటువంటి లే అవుట్లలో ప్లాట్లు కొన్న వారు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ లేఅవుట్ల వల్ల అవరానికి ఉపయోగబడే ఖాళీ స్థలాలు లేకుండాపోతున్నాయని, సామాజిక, మౌళికాభివృద్ధి కూడా చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వమే ఇళ్లు కట్టాలి
ఈ సమస్యలు తొలగిపోవాలంటే మధ్య తరగతి వారికి ఎంఐజి గృహాలను ప్రభుత్వమే అందించాల్సి ఉంటుందని అధికారులు తేల్చిచెబుతున్నారు. అందుకే ఉపాలు ప్రతిపాదిస్తున్న ఎంఐజి ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఉడాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేయాలని ఆర్ధికశాఖను కూడా వారు కోరుతున్నారు.










