Nov 15,2022 07:32

           ప్రధాని నరేంద్ర మోడీ శుక్ర, శని వారాల్లో చేసిన ఆంధ్రప్రదేశ్‌ పర్యటన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను మరో మారు వమ్ము చేసింది. మోడీ టూర్‌ కోసం ఎ.పి. ప్రభుత్వం చేసిన కోట్లాది రూపాయల వ్యయం, సమయం వృధా ప్రయాసగా మిగిలిపోయింది. ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారంటే, ఏమేమి వరాలిస్తారోనన్న ఉత్సుకత సహజంగానే ప్రజల్లో కలుగుతుంది. రాష్ట్ర విభజనతో సతమతవుతున్న మనకైతే ఆ ఉత్సుకత ఇంకా ఎక్కువగా ఉంటుంది. పార్లమెంట్‌ పాస్‌ చేసిన విభజన చట్టం అమలు, ఆ సమయంలో ఇచ్చిన హామీలు, వాటికి తోడు కేంద్ర విధానాల్లో భాగంగా విశాఖ ఉక్కు మెడపై వేలాడుతున్న ప్రైవేటీకరణ కత్తి వంటి ఎన్నెన్నో జఠిల సమస్యలపై ప్రధాని వివరణ ఇస్తారని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. కానీ మోడీ తన పర్యటనలో వాటి ఊసెత్తకపోవడంతో ఆయనది నిరర్ధక పర్యటనే అయింది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు పరిమితమైంది. అవేమీ కొత్తవేం కాదు. ఆ మాటకొస్తే ప్రధాని శంకుస్థాపనలకు విలువే లేదనడానికి ప్రత్యక్ష ఉదాహరణ రాజధాని అమరావతి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేసి, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని చెప్పి, ఎనిమిదేళ్లల్లో రూ.2,500 కోట్లివ్వడం గగనమైంది.
          హైదరాబాద్‌ను కోల్పోవడంతో ఎ.పి. పారిశ్రామికంగా ఏమీ లేని రాష్ట్రమైంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ, ఆయన పార్టీ బిజెపి. అనంతరం హోదా అనేది ముగిసిన అధ్యాయమని మాట తప్పారు. విశాఖలో రైల్వే జోన్‌ అన్నారు. ఇన్నేళ్లయినా నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేయలేదు. విశాఖ వచ్చిన మోడీకి ఆ విషయం గుర్తు లేక కాదు, కావాలనే విస్మరించారు. ఎందరో త్యాగాలు, బలిదానాలతో సాధించుకున్న వైజాగ్‌ స్టీల్‌ను కేంద్రం అమ్మేస్తామనడంతో కార్మికులు ఏడాదిన్నరకుపైగా ఆందోళనలు చేస్తున్నారు. విశాఖ అభివృద్ధికి తలమానికంగా ఉన్న వైజాగ్‌ స్టీల్‌ గురించి ప్రస్తావించకుండా సమ్మిళిత వృద్ధి అంటే ప్రజలెలా నమ్ముతారు? విశాఖలో మెట్రో రైలు అంశం విభజన చట్టంలో పొందుపర్చగా అతీగతీ లేదు. విశాఖను ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాపార కేంద్రంగా మారుస్తామనడం ఎవరిని మభ్యపెట్టడానికి? వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ఇస్తామన్న నిధులను ఎగ్గొట్టారు. ఉన్న వైజాగ్‌ స్టీల్‌ను అమ్మకానికి పెట్టి కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీకి ఎగనామం పెట్టారు. విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధాని తెలుగు ప్రజల సుఖ సంతోషాలు కోరుకోవడం పెద్ద దగా.
        రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయం చేసిన కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిలదీయకపోవడం అభ్యంతరకరం. 'కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీతో మా బంధం రాజకీయాలకు అతీతం. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వేరే ఎజెండా మాకు లేదు' అని సభా ముఖంగా ప్రకటించిన జగన్‌, రాష్ట్రానికి ద్రోహం చేసినా బంధాన్ని కొనసాగించడానికి కారణమేంటో వెల్లడిస్తే బాగుండేది. కేంద్రాన్ని 'అడుగుతూనే ఉంటాం' అన్న జగన్‌ విశాఖ సభలోనూ అదే పని చేశారు తప్ప గట్టిగా మోడీని నిగ్గదీసింది లేదు. మోడీతో ఏకాంతంగా సమావేశమైన పవన్‌ కళ్యాణ్‌, రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధానిని ప్రశ్నించినట్లేమీ కనబడలేదు. ప్రతిపక్ష టిడిపి సైతం కేంద్రాన్ని, మోడీని గట్టిగా డిమాండ్‌ చేసింది లేదు. రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమైన వామపక్షాలను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో నిలువరించింది. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఉద్యమిస్తున్న కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేసింది. తతిమ్మా రాష్ట్రాల్లో కేంద్రం చేస్తున్న అన్యాయాలపై ప్రభుత్వాలు, అక్కడి పార్టీలు వ్యతిరేకిస్తుండగా, మన దగ్గర అందుకు భిన్నంగా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు నోరెత్తట్లేదు. రాష్ట్రానికొచ్చిన ప్రతిసారీ తెలుగు ప్రజల తెగువను ఆకాశానికెత్తడం ప్రధానికి రివాజైంది. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బిజెపిపై తెలుగు ప్రజలు తెగువ ప్రదర్శించి తమ సత్తా నిరూపించాలి.