
ముస్లిం మైనారిటీలపై అడ్డూ అదుపు లేని దాడులు, దానికి తోడు విద్వేష ప్రసంగాలు, మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను శ్లాఘించడం... వంటి వాటితో 'అమృత కాలం' అసలు అర్ధం బయటపడుతోంది.
మహారాష్ట్రలో, షిండే-బిజెపి ప్రభుత్వం ముస్లిం పేర్లు వున్న నగరాలన్నింటికీ ఆ పేర్లను రద్దు చేసి కొత్త పేర్లు పెడుతున్న ప్రక్రియను కొనసాగిస్తోంది. ఔరంగాబాద్ ఛత్రపతి శంభాజి నగర్‌గా మారింది. ఉస్మానాబాద్ ఇప్పుడు దారాశివ్ అయింది. అహ్మద్‌నగర్ జిల్లాను అహల్యాబాయి హోల్కర్ నగర్‌గా మార్చారు. ఈ మార్పులకు తోడు మెజారిటీవాదుల విజయం, ముస్లిం పాలకులు, చారిత్రిక వ్యక్తులను రాక్షసుల్లాగా చిత్రీకరించడం జరుగుతోంది. దీనికి ముందు, మహారాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నెలల పాటు 'హిందూ జన ఆక్రోశ్ మోర్చా' ర్యాలీలు 50 నిర్వహించారు. ఈ ర్యాలీలు ముస్లింల పట్ల విద్వేషాన్ని, హిందూ మతోన్మాదాన్ని బహిరంగంగానే ప్రదర్శించాయి.
అహ్మద్‌నగర్ జిల్లా లోని షివ్‌గావ్ గ్రామంలో మత హింస చోటు చేసుకుంది. ఆ వెంటనే కొల్హాపూర్‌లో మత ఘర్షణలు జరిగాయి. ఈ పరిస్థితికి కారణం ''ఔరంగజేబ్ వారసుల''ని మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర స్థాయిలో హోం మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ బిజెపి నేత ఇటువంటి ప్రకటన చేయడం చూస్తుంటే ఉన్నత స్థాయి పదవుల్లో వున్న వారు అనుసరించే విద్వేష రాజకీయాలు ఎలాంటివో తెలుస్తున్నాయి.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో, ముస్లింలను వారి స్థానాల్లో వుంచి ఆర్థికంగా వారిని దెబ్బ తీయడమనేది ఉద్దేశ్యపూర్వకంగా అనుసరిస్తున్న విధానంగా కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లో, ముస్లింలు జనాభాలో చాలా తక్కువ సంఖ్యలో వున్నారు. ఉత్తర కాశీ లోని పురోలాలో ముస్లిం దుకాణదారులను వారి దుకాణాలను ఖాళీ చేయాల్సిందిగా కోరారు. ముస్లిం దుకాణాలకు నల్లటి క్రాస్ గుర్తు పెట్టి జూన్ 15 తేదీకల్లా వాటిని ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. మైనర్ బాలికను అపహరించిన సంఘటనలో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం వుందని వెల్లడి కావడం అందులో ఒకరు ముస్లిం యువకుడు కావడం ఇందుకు కారణంగా వుంది. ఇప్పటికే మార్కెట్‌లో కొంతమంది ముస్లింలు తమ దుకాణాలను మూసివేసి వెళ్లిపోయారు. ఇతర ప్రాంతాల్లో కూడా బజార్లను వీడి వెళ్లాల్సిందిగా ముస్లిం వ్యాపారస్తులను డిమాండ్ చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఇటువంటి ముస్లిం విద్వేషమే విద్వేష రాజకీయాలు, బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి మతోన్మాదంలో భాగంగా వుంది. ఇటీవల, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, నాథూరామ్ గాడ్సేను భారత 'పుత్రుడి'గా అభివర్ణించారు. ''ఆయన మహాత్మా గాంధీ హంతకుడైనా...భారతమాత పుత్రుడు కూడా.'' అని పేర్కొన్నారు. గాడ్సేను ఇలా కీర్తించడమనేది బిజెపి నాయకత్వానికి నిత్యకృత్యమై పోయింది. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు వెలువడడానికి కొద్ది రోజులు ముందు, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ, ''గాంధీజీ హత్యకు గురయ్యారు. అది వేరే విషయం. కానీ గాడ్సే కూడా దేశభక్తుడే.'' అని పేర్కొన్నారు. అంతకు ముందు, 2019లో, భోపాల్ బిజెపి ఎం.పి, తీవ్రవాద కేసులో నిందితురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించారు. కర్ణాటకకు చెందిన బిజెపి ఎం.పి నళిన్‌కుమార్ కటీల్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ''గాడ్సే ఒకరినే చంపారు కానీ రాజీవ్ గాంధీ 17 వేల మందిని చంపారు.'' అన్నారు. ఇలా అన్ని స్థాయిల్లో బిజెపికి గాడ్సే పట్ల ప్రేమ చూపించడమన్నది సర్వసాధారణంగా మారింది. గాంధీ విద్వేషకుడు సావర్కర్ పట్ల ఆరాధన కూడా దీనితో పాటూ కోరస్‌గా వినిపిస్తూ వుంటుంది.
గాడ్సేను శ్లాఘిస్తూ హిందూత్వ దేశాన్ని స్థాపించాలనుకుంటున్న పార్టీ 'నూతన భారత దేశం' గురించి చెప్తున్నదిదే.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)