Nov 13,2022 09:59

పిల్లలు అల్లనల్లన ఎదుగుతున్న తరుణంలో వాళ్ల ప్రపంచంలోకి మాటలు, ఆటలు, పాటలూ కలగలిసి ప్రవేశిస్తాయి. నేర్చుకోవడం అనేది వినటం, చూడడం అనే ప్రక్రియతో మొదలవుతుంది. పిల్లలు తాము విన్న మాటను శబ్దంగా గ్రహించి.. దృశ్యంతో కలగలిపి తమ బుర్రల్లో భద్రపరచుకుంటారు. లయాత్మకమైన ధ్వని కారణంగానే అక్షరాలు తెలియకముందే వారికి మాటలు పరిచయమవుతాయి. పదిలంగా మనసులో ముద్రించుకుపోతాయి. ఇలాంటి అవగాహనతోనే బుల్లి బుల్లి పిల్లల కోసం చంద్రలత 'గుటుక్కు .. గుటుక్కు .. బ్రేవ్‌' పుస్తకాన్ని రూపొందించారు. ఇది నేర్చుకునే వయసులోని పిల్లలకు పాటల ద్వారా భాషను నేర్పించే పుస్తకం.
అప్పుడప్పుడే పరిసరాలను అర్థం చేసుకుంటున్న పిల్లలకు ఇందులోని పాటలు అక్షరాలను పరిచయం చేస్తాయి. ధ్వని, అభినయం ప్రధానంగా సాగే ఈ పాటలు పిల్లలను అమితంగా ఆకర్షిస్తాయి. అలరిస్తాయి. ఈ ఆకర్షణ, అలరింపుల్లో పిల్లలు ఇష్టంగా మమేకమైపోయినప్పుడు- భాష దానంతట అదే పట్టుబడుతుంది. పాటల్లోని కొన్ని పదాలకు అర్థాలు తెలియకపోవొచ్చు. కానీ, పిల్లల మనసులోకి ఆ ధ్వని చేరుతుంది. తెలిసిన విషయంలోంచి తెలియని విషయం నేర్చుకోవటానికి అదొక సాధనంగా ఉపయోగపడుతుంది.
ఈ 134 పేజీలున్న ఈ పుస్తకంలో 100కు పైగా పాటలు ఉన్నాయి. అవన్నీ పిల్లల భావనా ప్రపంచపు పరిధిలోనివే! ఆ వయసు పిల్లలకు తెలిసిన పరిసరాల్లోనివే! ఆ పరిసరాల్లో తెలిసిన చాలా మాటల సముదాయం చేరువలోకి అప్పుడప్పుడు కొత్త మాటలు వచ్చి చేరతాయి. ఆ కొత్త మాటలు, విషయాలూ పాత వాటితో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ఆ సంబంధంలోంచి పిల్లలు సులభంగా గ్రహించగలుగుతారు. కొత్త సంగతులు తెలుసుకుంటారు. ఈ పుస్తకంలోని మొదటి పాట అ, ఆలను పరిచయం చేస్తుంది. అ, ఆ శబ్దాలను ధ్వనించే అజంతం, అనంతం, అమోఘం, అభిజ్ఞం; ఆహారం, ఆహార్యం, ఆవేశం, ఆచంద్రం వంటి పదాలు వాడారు. వాటి అర్థాలు పిల్లలకే కాదు; చాలామంది పెద్దలకూ తెలియవు! ఆ పదాలకు వస్తు రూపాలను కూడా చూపలేం. అంతమాత్రాన అవి పిల్లలను అలరించకుండా ఉండవు. ధ్వని ఆధారంగా గుర్తు పెట్టుకోవటమే ఈ పాటల ద్వారా ఒనగూడే ప్రయోజనం.
ఈ పుస్తకాన్ని రుషి వ్యాలీ పాఠశాల నిర్వాహకులు డాక్టర్‌ రాధికా హెర్జ్‌్‌ బర్గర్‌ సూచన మేరకు చంద్రలత రచించారు. 2014లో కలిగిన ప్రేరణ 2021 నాటికి సాకారం అయింది. చూసీ చూడగానే ఇది పిల్లల పుస్తకం అని తెలిసిపోతుంది. ముఖపత్రంపై పిల్లల దస్తూరి, బొమ్మల అలంకరణ మనల్ని ఆకట్టుకుంటుంది. ఇందులో చంద్రలత నిర్వహించే ప్రభవ పాఠశాల పిల్లలు గీసిన బొమ్మలు, వారి ఫొటోలూ ఉపయోగించారు. పుస్తకంలోని కుడివైపు పేజీలో పిల్లలకు నేర్పే పాటను, ఎడమవైపు పేజీలో ఆ పాటను ఎలా నేర్పాలో తెలిపే సూచనలు ప్రచురించారు. ఆ నేర్పే క్రమంలో తలెత్తే ప్రశ్నలకు అనుబంధంగా మిఠాయి పొట్లాం, మరమరాలూ అంటూ బోలెడు అంశాలు సమకూర్చారు. నేర్పించే ఉపాధ్యాయులకు, అమ్మానాన్నలకు ఇవెంతో ఉపయోగపడతాయి. నేర్పే పాట చిన్నదిగా అనిపించినా ... దానిచుట్టూ ఇంకా ఎన్నెన్ని విషయాలు అల్లి, పిల్లలను అలరించవచ్చో ఈ కూర్పు చెబుతుంది.
ఈ పుస్తకంలోని పాటలు పిల్లలకు నమస్కారాన్ని, సంస్కారాన్ని నేర్పుతాయి. ఇంటిని, దేశాన్ని, పరిసరాలను పరిచయం చేస్తాయి. వివిధ శబ్దాలను, ధ్వని పదాలను వినిపిస్తాయి. తీయతీయని లడ్డూలను తినిపిస్తాయి. పొద్దుపొద్దునే లేచేలా ప్రేరేపిస్తాయి. అంకెలను, రంగులను, వారాలను, ఆటలను తెలియజేస్తాయి. అహ్హహ్హ .. అని నవ్విస్తాయి. కూరగాయలు, పండ్లు వంటి వాటిపై ఇష్టాన్ని కలిగిస్తాయి. ... ఇలా ఎన్నో నేర్చుకోవటానికి, నేర్పటానికి ఈ పుస్తకం చక్కని ఆలంబన. తెలుగు చదవటం రాని తెలుగు పిల్లల కోసం ఇంగ్లీషు లిప్యంతీకరణ కూడా ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు, చిన్న పిల్లలున్న అమ్మానాన్నలకు ఈ పుస్తకం ఎంతో ప్రయోజనకరం. అయితే, ఈ పుస్తక పుటల్లో ఇచ్చిన అక్షరమాలకు, గేయాల్లో ధ్వనించే శబ్దాలకు పొంతన కుదరలేదు. పాటకు, అక్షరానికీ సంబంధం లేనప్పుడు అలాంటి కూర్పు చేయకుండా ఉండాల్సింది.
ఈ పుస్తకంపై జి.రంగాచార్యులు, రావెల సాంబశివరావు, సిఎ ప్రసాద్‌ చక్కని మాటలు రాశారు. ఈ పుస్తకం ఎలా ప్రారంభమైందో చంద్రలత ... 'చినుకులా మొదలవుతూ ...' అంటూ వివరించారు. కొత్తగా నేర్చుకునే పిల్లలకు ఇది నిజంగానే ఆటపాటల మిఠాయి పొట్లాం. ఎన్నో చక్కని పాటలను ఏర్చికూర్చిన చంద్రలతకు అభినందనలు.


- సత్యాజీ