Sep 10,2022 06:52

         మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ మహాసభ అనకాపల్లిలో సెప్టెంబర్‌ 10, 11 తేదీల్లో జరుగుతున్న సందర్భంగా...

ఐసిడిఎస్‌, మిడ్‌ డే మీల్‌, ఆశా పథకాల వలన మాతా శిశు మరణాల సంఖ్య తగ్గిందని, బాలల డ్రాపౌట్లు తగ్గాయని, బడికి వెళ్ళే పిల్లల సంఖ్య పెరిగిందని ప్రశంసలు వస్తూనే వున్నాయి. మానవ వనరుల అభివృద్ధికి స్కీమ్‌ల ద్వారా అందుతున్న సేవలు చాలా ఉపయోగకరమని, స్కీం వర్కర్లు మానవ వనరుల అభివృద్ధికి వెన్నెముక లాంటి వారిని, స్కీం వర్కర్ల డిమాండ్లు సమంజసమైనవని, పరిష్కరిస్తామని ఏలికలు చెప్తున్నారు. కానీ ఆర్థిక వనరులు లేవన్న సాకు చూపి గత కాంగ్రెస్‌, ప్రస్తుత బిజెపి ప్రభుత్వాలు మొండి చేయి చూపుతున్నాయి.

డి పిల్లలకు బడిలోనే మధ్యాహ్న భోజనం పెట్టే సదుపాయం అనేక దేశాల్లో అమలులో ఉంది. మన దేశంలో 12.65 లక్షల పాఠశాలల్లోని 11.80 కోట్ల మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ తెలిపింది. పాఠశాలల్లో నమోదును పెంచి, డ్రాపవుట్లను నివారించి విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించడం ప్రధాన లక్ష్యం. 1995 ఆగుస్టు నుంచి అమలవుతున్న ఈ పథకాన్ని 'ప్రధానమంత్రి పోషణ్‌ శక్తి నిర్మాణ యోచన'గా కేంద్ర ప్రభుత్వం 2021లో పేరు మార్చింది.
     ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు పిల్లలకు ఆహారం వండటానికి (ఒక్కో విద్యార్థికి) రోజుకు రూ. 4.57 పైసలు, ఆరు నుంచి పదవ తరగతి వరకు రూ.7.45 పైసలు కేటాయింపులు ఉన్నాయి. పెరుగుతున్న ధరలకనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపుల పెరుగుదల లేకపోవటంతో విద్యార్ధులకు పౌష్టికాహారం అందించడం తీవ్ర సమస్యగా ఉంది. మన దేశంలో పౌష్టికాహార లోపం చాలా తీవ్రంగా ఉంది. ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల జాబితాలో భారత్‌ 101వ స్థానంలో ఉంది.
     మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న 26 లక్షల మంది కార్మికుల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చ చేయటంలేదు. ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్‌ వర్కర్లను కార్మికులుగా గుర్తించడంలేదు. మూడు దశాబ్దాలుగా ఈ స్కీమ్‌లు అమలులో ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాల్లో దాదాపు కోటి మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ వర్కర్ల రిక్రూట్‌మెంట్‌, ఎంపిక పద్ధతులను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. వారి పని పద్ధతులను, పనిని కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఎక్కడైనా తప్పు జరిగితే క్రమశిక్షణా చర్య చేపడుతుంది. కానీ వీరిని కార్మికులుగా గుర్తించదు. వేతనాలు, ఇతర సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత నుండి తప్పించుకునే విధంగా రకరకాల పేర్లు పెట్టి మోసపూరితమైన కుట్ర చేస్తోంది. వీరిని 'సోషల్‌ వర్కర్లుగా' పిలుస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం పేరుతో నెలకు రూ.1000 చొప్పున 10 నెలలకు మాత్రమే వేతనం ఇస్తారు. వారు ఆరేడు గంటలు పని చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌, గ్రాట్యూటీ మరే ఇతర సామాజిక సంక్షేమ పథకాలు అందించటం లేదు. వేలాది మంది మధ్యాహ్న భోజన కార్మికులు వారి పని పరిస్థితుల్లో మెరుగుదల కోసం, వేతనాల పెంపు కోసం రాష్ట్రంలోనూ, ఢిల్లీ లోనూ ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. అనేకసార్లు సంబంధిత మంత్రులను, అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. కాని ప్రభుత్వం మాత్రం ప్రైవేటు స్కూళ్ళను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తోంది.
     నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తూ 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో మెర్జ్‌ చేయటం వలన ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న వర్కర్ల ఉపాధి పోయింది. రాష్ట్ర ప్రభుత్వం 'జగనన్న గోరుముద్ద' పేరుతో రోజుకొక వంటకం చేయాలని మెనూ నిర్ణయించింది. కానీ మెనూ చార్జీలు పెంచలేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మోడీ అధికారంలోకి రాకముందు రూ.456 వున్న గ్యాసు సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.1150కి పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న ధరలకనుగుణంగా మెనూ చార్జీలు పెంచకపోవడంతో వర్కర్ల పైన భారం పడుతున్నది.
     స్కూల్‌ డ్రాపవుట్‌ శాతాన్ని తగ్గించడం, బాల కార్మికులను బడి బాట పట్టించి వారిని ప్రధాన స్రవంతి లోకి తీసుకురావటానికి ఉద్దేశించిన ఈ పథకం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో కునారిల్లుతోంది. 45వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ (ఐఎల్‌సి) 2013 మేలో జరిగిన సమావేశంలో స్కీమ్‌ వర్కర్ల అంశాన్ని చర్చించి ఏకగ్రీవంగా కొన్ని సిఫార్సులు చేసింది. -సోషల్‌ వర్కర్లు, యాక్టివిస్టులు, మిత్రులు, గెస్టులు మొదలగు పేర్లతో పిలవబడుతున్న స్కీమ్‌ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి. వారికి కనీస వేతనాలు చెల్లించాలి. సామాజిక సంక్షేమ సదుపాయాలు కల్పించాలి. స్కీములను ప్రైవేటీకరించకూడదు-అని చెప్పింది.
     ఐఎల్‌సి చేసిన నిర్ణయాలు అమలుకు నోచుకోలేదు. 2015 నాటికి మిడ్‌ డే మీల్‌ కార్మికులకు రూ.3 వేలు ఇస్తామని ప్రకటించిన కేంద్ర విద్యాశాఖా మంత్రి ఇంత వరకు అమలుకు పూనుకోలేదు. పైగా 46వ ఐఎల్‌సి నివేదికలో ఆ సిఫార్సులను తోసిపుచ్చింది. స్కీం వర్కర్లు 'పార్ట్‌టైం', 'గౌరవ వర్కర్లు' అని ...ఈ సిఫార్సులను అమలు చేయడానికి వీలుపడదని చెప్పింది.
     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఇప్పటికే ఇస్కాన్‌, అక్షయ పాత్ర, బుద్దవరపు ట్రస్టు, హరే రామ హరే కృష్ణ వంటి సంస్థలకు కొన్ని జిల్లాల్లో అప్పగించారు. స్వచ్ఛంద సంస్థలు సరఫరా చేసే భోజనంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్న భోజన పథకం అమలు గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు, జాతీయ పౌష్టికాహార సంస్థ చేసిన సిఫార్సులు, సుప్రీంకోర్టు తీర్పు లోని ఆదేశాలకు విరుద్ధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్‌ తదితర సంస్థలు ప్రవర్తిస్తున్నాయి. అధునాతన యంత్రాలతో కేంద్రీకృత వంటశాలలు నెలకొల్పి...బడికి అందుబాటులో ఉండే బలహీన వర్గాల మహిళలకు పథకంలో అవకాశం లేకుండా చేశారు. ఈ సంస్థలు తెల్లవారుజామున వండి చల్లారిపోయిన భోజనం పెడుతున్నాయి. చల్లారిపోయిన చప్పిటి భోజనాన్ని విద్యార్ధులు తినడం లేదు. స్వచ్ఛంద సంస్థలు తయారుచేసిన 187 శాంపిల్‌ భోజనాలను పరిశీలించి వాటిలో నిర్దేేశిత పోషకాలు లేవని, పదార్ధాల పరిమాణం కూడా తక్కువగా ఉందని కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) 2005లో తేల్చింది. పౌష్టికాహారమైన కోడిగుడ్డు పెట్టడం లేదు. వంటకంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వేయడం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం తొలగించాలని దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల ఆహారపు అలవాట్లతో స్కూళ్లలోని ప్రభుత్వ సిఫార్సుల ప్రకారం వర్కర్ల్లు వేడివేడిగా వండి పెట్టే భోజనాన్ని విద్యార్థులు ఇష్టంగా తింటున్నారు. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల భోజనాన్ని స్టడీ చేసి పథకం అమలులో జరుగుతున్న అవకతవకలను పరిశీలించి స్వచ్ఛంద సంస్థలను తొలగించాలని రాష్ట్రంలో యూనియన్‌ జరిపిన ఆందోళనల ఫలితంగా రెండు సంస్థలను నిషేధించారు. రాజకీయ ప్రమేయంతో అక్షయ, ఇస్కాన్‌ సంస్థలు కొన్ని జిల్లాలలో నేటికీ కొనసాగుతున్నాయి.
     ఐసిడిఎస్‌, మిడ్‌ డే మీల్‌, ఆశా పథకాల వలన మాతా శిశు మరణాల సంఖ్య తగ్గిందని, బాలల డ్రాపౌట్లు తగ్గాయని, బడికి వెళ్ళే పిల్లల సంఖ్య పెరిగిందని ప్రశంసలు వస్తూనే వున్నాయి. మానవ వనరుల అభివృద్ధికి స్కీమ్‌ల ద్వారా అందుతున్న సేవలు చాలా ఉపయోగకరమని, స్కీం వర్కర్లు మానవ వనరుల అభివృద్ధికి వెన్నెముక లాంటి వారిని, స్కీం వర్కర్ల డిమాండ్లు సమంజసమైనవని, పరిష్కరిస్తామని ఏలికలు చెప్తున్నారు. కానీ ఆర్థిక వనరులు లేవన్న సాకు చూపి గత కాంగ్రెస్‌, ప్రస్తుత బిజెపి ప్రభుత్వాలు మొండి చేయి చూపుతున్నాయి. కార్మికుల కోర్కెలు తీర్చడానికి డబ్బులు లేవని చెప్పే ప్రభుత్వాలకు బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రాయితీలు ఇవ్వడానికి మాత్రం నిధుల కొరత ఉండదు. పేదలకు ఇచ్చే సబ్సిడీలకు నిరంతరం కోతలు పెడుతూ ధరలు, పన్నులు పెంచుతూ కార్పొరేట్లకు మాత్రం రూ.లక్షల కోట్ల ప్రోత్సాహకాలందిస్తోంది మోడీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనాలు, సామాజిక భద్రతా సౌకర్యాలు, కార్మికులు గుర్తింపు మొదలైన ప్రాథమిక డిమాండ్ల సాధనకు ఐక్య పోరాటాలు నిర్వహించాల్సి వుంది.

/ వ్యాసకర్త : మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి /
కె. స్వరూపరాణి

కె. స్వరూపరాణి