Jan 28,2023 07:27

       ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో పెరుగుతున్న యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఎఎంఆర్‌) ప్రజారోగ్యానికి పెను సవాలు విసురుతోంది. యాంటీ బయాటిక్స్‌ వాడకంతో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడాన్నే యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఎఎంఆర్‌) అంటారు. సాంక్రమిత (అంటు) వ్యాధుల నిర్వహణలో అనేక సమస్యలకు దారి తీసి, పేషెంట్లను తీవ్ర అనారోగ్యం పాలు చేస్తుంది. దీంతో పాటు వారి వైద్య వ్యయాన్ని, జీవిత కాలాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఎఎంఆర్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య 7 లక్షలకు పైగా వుంటుందని అంచనా. ఇందులో ఆస్పత్రుల ద్వారా సంక్రమించిన ఇన్ఫెక్షన్ల బారినపడి మరణించిన వారి సంఖ్య 99 వేలు. దీనితో పాటు ఆరోగ్య సేవల వ్యయం, దెబ్బతింటున్న ఉత్పాదకత వంటి అంశాలతో ఈ ఎఎంఆర్‌...ఒక్క అమెరికాపైనే 2050 నాటికి ఏటా 10 వేల కోట్ల డాలర్ల ఆర్థిక భారాన్ని మోపనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎఎంఆర్‌ కారణంగా అల్పాదాయ, మధ్యాదాయ దేశాలలో 90 శాతం మేర మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అల్పాదాయ మధ్యాదాయ దేశాలతో పోలిస్తే ఎఎంఆర్‌ సంబంధిత ఇన్ఫెక్షన్‌ భారం మన దేశం మీదే ఎక్కువగా పడుతోంది. వివిధ రకాల సూక్ష్మ జీవులతో పాటు వాటిని అంతం చేసేందుకు పెరుగుతున్న యాంటీబయాటిక్స్‌ వాడకం కూడా ఇందుకు కారణమని ల్యాబ్‌ రిపోర్టులు చెబుతున్నాయి
       ఎఎంఆర్‌ పెరిగిపోతే ఆరోగ్య పరిరక్షణ కూడా ఆర్థిక భారంగా మారుతుంది. ఇది వ్యక్తులకే కాదు... ఆరోగ్య వ్యవస్థలకు, దేశాలకూ వర్తిస్తుంది. ఎఎంఆర్‌ పెరిగితే ఉత్పాదకత తగ్గుతుంది. ఫలితంగా వేతనాలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం పొంచి వుంది. 2050 నాటికి యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఎఎంఆర్‌) కారణంగా ప్రపంచ జీడిపిలో 3.5 శాతం మేర గండి పడుతుందని తాజా అంచనాలు హెచ్చరిస్తున్నాయి.
       ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యల్ని తీసుకోవాల్సిన అవసరముంది. మన దేశంలో విచక్షణా రహితంగా యాంటీబయాటిక్స్‌ను ఉపయోగించటం, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మెడికల్‌ షాపుల్లో కొనసాగుతున్న కౌంటర్‌ విక్రయాలు ఎఎంఆర్‌ పెరిగిపోతుండటానికి కారణాలుగా చెప్పవచ్చు. పరిశుభ్రమైన తాగునీటి కొరత, పారిశుధ్య లోపం, వ్యక్తిగత పరిశుభ్రత కొరవడడం వంటి అంశాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి.
      ఎఎంఆర్‌ కట్టడిలో ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ పశుసంక్షేమ సంస్థ వంటి విభాగాలు భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా 2017లో జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. జాతీయ వ్యాధి నియంత్రణా సంస్థ (ఎన్సిడిసి) మార్గదర్శకత్వంలో పలు రాష్ట్రాలు సైతం తమ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశాయి. విచక్షణా రహితంగా పెరుగుతున్న యాంటీ బయాటిక్స్‌ వాడకాన్ని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సి వుంది.

- కె.వి.రమణమూర్తి,
సీనియర్‌ పాత్రికేయులు
.