Jan 17,2023 07:52

వాళ్ళు చెప్తున్నట్టు ఉక్రెయిన్‌ యుద్ధం వల్లనే ఈ మాంద్యం ముంచుకొచ్చింది వాస్తవమే అయితే, ఆ యుద్ధాన్ని త్వరగా ముగించడానికి పూనుకోవాలి కదా. కాని పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదులు ఈ యుద్ధాన్ని త్వరగా ముగించడానికి సుముఖంగా లేరు. దానికి బదులు, ఈ యుద్ధాన్ని సాగదీసి, ఆ క్రమంలో రష్యా పూర్తిగా బలహీనపడి తమకు దాసోహం కావాలని వాళ్ళు కోరుతున్నారు.

నిజానికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక మార్గాంతరం లేని స్థితిలో పడిపోయిన వాస్తవ పరిస్థితిని ఇది సూచిస్తోంది.

ఇది ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంచుకున్న మార్గమే. ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ దేదు. దానిని ప్రతిఘటించడమే ముందున్న కర్తవ్యం.

2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత మందగించబోతున్నదని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టినా జార్జీవా మొత్తానికి బహిరంగంగా ఒప్పుకున్నారు. అంతే కాదు, దాదాపు మూడో వంతు ప్రపంచంలో స్థూల జాతీయోత్పత్తి ఇప్పుడు ఉన్నదానికన్నా తగ్గిపోతుందని కూడా ఆమె ప్రకటించారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తులు అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, చైనా - ఈ మూడూ వృద్ధిలో వేగం తరుగుదలను చవిచూడనున్నాయి. ఇదే ప్రపంచ ఆర్థిక మాంద్యం ముదిరిపోడానికి కారణమవనుంది. ఆ మూడింటిలో చైనాలో కోవిడ్‌ తిరిగి విజృంభించడం వలన అక్కడ వృద్ధి వేగం దెబ్బ తిననుంది. వాటిలో అమెరికా వరకూ తక్కిన దేశాలకన్నా సాపేక్షంగా మెరుగైన రీతిలో ఆర్థిక వ్యవస్థ నడక ఉండవచ్చునని క్రిస్టినా విశ్వసిస్తున్నారు. దానికి ప్రధాన కారణం అమెరికాలో కార్మికుల వేతనాల స్థాయి పెద్దగా పడిపోకుండా నిలదొక్కుకోగలగడం. వాస్తవానికి దాని వలన అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థకే కాక ప్రపంచానికి కూడా ప్రయోజనం ఉంటుంది.
            జార్జీవా వ్యాఖ్యలలో పొంతన కుదరని రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది: కార్మికుల ఆదాయాలను నేరుగా వేతనాల కోత రూపంలో గాని, లేకపోతే వారి సంక్షేమం కోసం చేసే ఖర్చుపై కోత విధించే రూపంలో గాని కుదించాలని ఐఎంఎఫ్‌ ఎప్పుడూ ప్రచారం చేస్తుంది. వ్యవస్థీకృత సర్దుబాటు చర్యలలో ఒక భాగంగా కార్మికుల ఆదాయాలను కుదించడం గురించి పట్టుబట్టే ఐఎంఎఫ్‌ ఇప్పుడు ఆ కార్మికుల ఆదాయాలు అమెరికాలో పెద్దగా పడిపోకుండా నిలబడినందువల్లనే అక్కడి పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉందని ఒప్పుకోవడం ఆశ్చర్యకరమైన విషయమే అయినా, ఆహ్వానించదగినది కూడా. కార్మికుల వేతనాలు పడిపోకుండా ఉన్నందువల్లనే అమెరికా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోగలిగిందని ఆమె సూటిగా అంగీకరించకపోవచ్చు. ఆ వాస్తవాన్ని తిరగేసి అమెరికా ఆర్థిక వ్యవస్థ గట్టిగా నిలదొక్కుకోగలిగినందువల్లనే అక్కడి కార్మికుల వేతనాలు పడిపోకుండా నిలబడ్డాయని జార్జీవా వాదించవచ్చు. కాని ఆ విధంగా కార్మికుల వేతనాలు పడిపోకుండా ఉండడం ఒక ''వరం''గా ఆమె పరిగణించడం అంటే, మార్కెట్‌లో కొనుగోలుశక్తిని నిలబెట్టడంలో కార్మికుల వేతనాలు పోషించే కీలకపాత్రను ఆమె గుర్తించిందన్నమాట.
          సంక్షోభంలో ఉన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోడానికి మాత్రమే వ్యవస్థీకృత సర్దుబాటు విధానాలను గురించి ఐఎంఎఫ్‌ పట్టుబడుతుందని, అంతే తప్ప ఆర్థిక వృద్ధికి దారి తీయడానికి మార్గంగా సర్దుబాటు విధానాలను ఐఎంఎఫ్‌ ఎప్పుడూ ప్రతిపాదించలేదని, అందువలన ఇప్పుడు జార్జీవా ప్రకటనను బట్టి ఐఎంఎఫ్‌ దృక్పథంలో ఏదో మార్పు వచ్చేసిందని మనం భావించకూడదని కొందరు చెప్పవచ్చు. కాని ఒకటి మాత్రం వాస్తవం. ఇంతకాలమూ తాను ప్రబోధిస్తూవస్తున్న విషయానికి భిన్నంగా ఇప్పుడు ఐఎంఎఫ్‌ చెప్పింది. అమెరికా ఆర్థికంగా నిలదొక్కుకోడానికి అక్కడి కార్మికుల వేతనాలు పడిపోకుండా ఉండడం తోడ్పడుతుందని ఒప్పుకుంది. సంక్షోభంలో ఉన్న ఇతర దేశాలలో కూడా తమ తమ సంక్షోభాలను అధిగమించడానికి అదేమాదిరిగా ఎందుకు ప్రత్యక్ష చర్యలు తీసుకోకూడదు? అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. దేశీయ డిమాండ్‌ ను పడిపోకుండా నిలుపుకోడానికి కార్మికుల వేతనాలను తగ్గించమో, వారి సంక్షేమానికి చేసే ఖర్చు తగ్గించడమో చేసే బదులు, దిగుమతులపై ఆంక్షలు విధించడం, ధరలను ప్రభుత్వం ప్రత్యక్షంగా నియంత్రించడం వంటి చర్యలకు ఎందుకు పూనుకోకూడదు? నయా ఉదారవాదం ఇంతకాలమూ ప్రచారం చేస్తూ ఐఎంఎఫ్‌ ఇంతవరకూ గట్టిగా పట్టుబడుతున్నదానికి, ఇప్పుడు జార్జీవా ఒప్పుకున్న విషయానికి (కార్మికుల వేతనాలు పడిపోకుండా నిలబడడం అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడడానికి దోహదం చేస్తుంది అన్న విషయం) మధ్య పూర్తి తేడా ఉంది అన్న విషయం గమనించాలి.
          ఇక జార్జీవా చెప్పిన దాంట్లో పొంతన లేని రెండో విషయం సంగతి చూద్దాం. అమెరికాలో కార్మికుల వేతనాలస్థాయి పడిపోకుండా నిలబడడం అమెరికా వృద్ధికి దోహదం చేస్తూనే, మరోపక్క అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీస్తుందని, దానివలన అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వు అక్కడ వడ్డీరేట్లను మరింతగా పెంచక తప్పదని ఆమె చెప్పారు. ఇది రెండు పర్యవసానాలను సూచిస్తోంది. మొదటిది: ప్రస్తుతానికి అమెరికా వృద్ధి రేటు కొనసాగినా, రాబోయే మాసాల్లో ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచడం వలన దెబ్బ తినవచ్చు. తక్కిన దేశాలతో పోల్చితే అమెరికా పరిస్థితి 2023లో బాగానే ఉన్నట్టు కనిపించినా ఈ పరిస్థితి దీర్ఘకాలంపాటు కొనసాగబోవడం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో జరిగే పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద మొత్తంగానే ప్రభావం చూపుతాయి. కాబట్టి రాబోయే మాసాల్లో ప్రపంచ ఆర్థిక మందగమనం మరింత పెరిగే అవకాశాం స్పష్టంగా ఉంది. కోవిడ్‌ తాకిడినుండి కోలుకుని చైనా గణనీయంగా పురోగమించితే తప్ప ప్రపంచ ఆర్థిక మాంద్యం మరింత దిగజారడం అనివార్యంగా కనిపిస్తోంది. 2023 ప్రారంభంలో ప్రపంచంలో మూడో వంతు వరకూ ఆర్థికమాంద్యం ఆవరించినది కాస్తా అనతికాలంలో మరింత ఎక్కువ భాగానికి ఆ మాంద్యం విస్తరించనుంది. ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఏవిధంగా ఉండబోతోందో ఆ వ్యవస్థ ప్రతినిధే స్వయంగా ప్రకటించారు.
ఇదేమాదిరిగా ప్రపంచబ్యాంకు కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న ఆర్థిక మాంద్యపు తీవ్రత గురించి, ప్రత్యేకంగా మూడో ప్రపంచ దేశాల మీద దాని ప్రభావం ఏవిధంగా పడబోతోంది అన్న విషయం గురించి హెచ్చరిస్తోంది. 2022 సెప్టెంబర్‌లో ప్రపంచబ్యాంకు విడుదల చేసిన ఒక పత్రంలో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2023లో 1.9 శాతంగా ఉండబోతోందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. ఐతే, ప్రపంచబ్యాంకు గాని, ఐఎంఎఫ్‌ గాని ముంచుకొస్తున్న ఆర్థికమాంద్యం ప్రధానంగా ఉక్రెయిన్‌ యుద్ధం వలన, దాని కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణం వలన ( దానితోబాటు కొంతవరకూ కోవిడ్‌ మళ్ళీ తలెత్తడం వలన) వచ్చిందేనని చెప్తున్నాయి. ఆ ద్రవ్యోల్బణం కారణంగానే అన్నిదేశాల్లోనూ వడ్డీరేట్లు పెరిగాయని, ఇప్పుడు అది ఆర్థిక మాంద్యానికి దారితీసిందని అంటున్నాయి. అంతే తప్ప ఈ ముప్పు వెనుక నయా ఉదారవాద విధానాల పర్యవసానాలు పోషించిన పాత్ర వూసు ఎత్తడం లేదు.
       ఇంతకూ, ఆర్థికమాంద్యం ముంచుకు రావడానికి ఈ రెండు సంస్థలూ చూపుతున్నవి సరైన కారణాలు కావు. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలవడానికి చాలా ముందే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం తలెత్తింది. అప్పటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోవిడ్‌ తాకిడి నుండి కోలుకోవడం కూడా మొదలైంది. కోవిడ్‌ కారణంగా సరుకుల సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నదని, దానివల్ల ద్రవ్యోల్బణం తలెత్తిందని అప్పుడు చెప్పుకొచ్చారు. కాని అప్పుడు కూడా చాలామంది ఆ వివరణతో ఏకీభవించలేదు. వాస్తవ సరుకుల కొరత కన్నా, సరుకుల కొరత ఏర్పడబోతోందన్న అంచనాతో బడా కార్పొరేట్లు ముందస్తుగా తమ లాభాల మార్జిన్‌లను బాగా పెంచివేసి పరుకుల ధరలు పెరిగిపోడానికి కారణమయ్యాయని, అందువల్లనే ద్రవ్యోల్బణం ఏర్పడిందని వారు అసలు సంగతి బైటపెట్టారు. ఆ విధంగా ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న సమయంలో ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైంది. ఆ పేరుతో పశ్చిమ పెట్టుబడిదారీ దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించాయి. ఇదంతా కలిసి ద్రవ్యోల్బణం ఇతోధికంగా పెరగడానికి దారితీసింది.
           ముడిచమురు ధరలు ఏవిధంగా పెరిగిపోయాయో పరిశీలిస్తే ఉక్రెయిన్‌ యుద్ధం తోనే ద్రవ్యోల్బణం మొదలైందన్న వాదన తప్పు అని స్పష్టం అవుతుంది. ప్రపంచం కోవిడ్‌ సంక్షోభం నుండి 2021లో కోలుకుంటున్న సమయంలో క్రూడాయిల్‌ ధరలు పెరగడం మొదలైంది. 2021 ఆరంభంలో బ్యారెల్‌ ముడిచమురు 50.37 డాలర్లు ఉన్నది కాస్తా ఆ ఏడాది చివరికి 77.24 డాలర్లకు ఎగబాకింది. ఇది 50 శాతం కన్నా ఎక్కువ పెరుగుదల. అదే ఉక్రెయిన్‌ యుద్ధం జరిగిన ఏడాది 2022లో చూస్తే 78.25 డాలర్ల నుండి 82.82 డాలర్లకు పెరిగింది. ఇది 5.8 శాతం పెరుగుదల మాత్రమే. వాస్తవానికి ప్రస్తుతం సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో ఉన్న ద్రవ్యోల్బణం రేటు కన్నా ఇది తక్కువ. రష్యా మీద ఆంక్షలు విధించినట్టు ప్రకటించగానే క్రూడాయిల్‌ ధర అమాంతం 133.18 డాలర్లకు పెరిగిపోయింది. ఐతే ఆ వెంటనే అంతే వేగంగా వెనక్కి వచ్చింది. అంటే ఉక్రెయిన్‌ యుద్ధం వల్లనే ద్రవ్యోల్బణం అన్న వాదన తప్పు అని స్పష్టం అవుతోంది. నిజానికి యుద్ధం కన్నా ప్రధాన కారణం అమెరికా విధించిన ఆంక్షలు .
బ్రెట్టన్‌వుడ్‌ సంస్థల విశ్లేషణ లోపభూయిష్టంగా ఉండడం మాత్రమే కాదు. ఆ సంస్థలకు ఈ ప్రపంచ మాంద్యం ఏవిధంగా ముగింపుకు రాబోతోందో కూడా అవగాహన లేదు. వాళ్ళు చెప్తున్నట్టు ఉక్రెయిన్‌ యుద్ధం వల్లనే ఈ మాంద్యం ముంచుకొచ్చింది వాస్తవమే అయితే, ఆ యుద్ధాన్ని త్వరగా ముగించడానికి పూనుకోవాలి కదా. కాని పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదులు ఈ యుద్ధాన్ని త్వరగా ముగించడానికి సుముఖంగా లేరు. దానికి బదులు, ఈ యుద్ధాన్ని సాగదీసి, ఆ క్రమంలో రష్యా పూర్తిగా బలహీనపడి తమకు దాసోహం కావాలని వాళ్ళు కోరుతున్నారు. అందుకే ఈ రెండు సంస్థలూ ఉక్రెయిన్‌ యుద్ధం త్వరగా ముగిసిపోవడానికి అనుగుణంగా ఏ ప్రతిపాదనలనూ చేయడం లేదు. అంతే కాదు, వడ్డీ రేట్లను మరింత పెంచడం మినహా, తద్వారా మాంద్యాన్ని మరింత ముదరబెట్టడం మినహా, వాళ్ళ దగ్గర ఏ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలూ లేవు. స్వేచ్ఛామార్కెట్‌ సూత్రానికి ఆ సంస్థలు ఎంతగా అంకితం అయిపోయాయంటే వారి ఊహల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి తోడ్పడే మరే ఇతర ప్రతిపాదనలూ లేనే లేవు (నిజానికి ప్రభుత్వాలు నేరుగా మార్కెట్‌ లో జోక్యం చేసుకుని ధరలను నియంత్రించవచ్చు. అప్పుడు ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.). ఆర్థికమాంద్యం ప్రభావం గురించి వాపోవడం మినహా వారేమీ చేయడం లేదు.
          ప్రపంచబ్యాంక్‌ అధ్యక్షుడు డేవిడ్‌ మల్పాస్‌ రుణభారాలతో మగ్గిపోతున్న మూడో ప్రపంచ దేశాల గురించి మాట్లాడుతూ, ఆ దేశాల రుణభారానికి ప్రధాన కారణం అధిక వడ్డీరేట్లు అని చెప్తున్నాడు. కాని ఆ అధిక వడ్డీరేట్లను తగ్గించే ప్రతిపాదన ఏదీ చేయడం లేదు. ఈ బ్రెట్టన్‌వుడ్‌ సంస్థలు చాలా అతిగా మూడో ప్రపంచదేశాల పేదలమీద జాలి పడుతున్నాయి కాని వారి కష్టాలకు పరిష్కారం చూపే విషయంలో చాలా తక్కువగా కదులుతున్నాయి.
ఇది కేవలం ఆ సంస్థలకున్న పిరికితనం వల్ల వచ్చినది కాదు. నిజానికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక మార్గాంతరం లేని స్థితిలో పడిపోయిన వాస్తవ పరిస్థితిని ఇది సూచిస్తోంది. పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదం కొన్ని సంవత్సరాలుగా బిగించిన పట్టును యథాతథంగా నిలబెట్టుకోవాలంటే అవి ఉక్రెయిన్‌ యుద్ధాన్ని కొనసాగించాల్సిందే. అప్పుడు ఈ ద్రవ్యోల్బణం, దానితోబాటు వాళ్ళు సృష్టించిన ఆర్థిక మాంద్యం కొనసాగాల్సిందే. అప్పుడు నిరుద్యోగం పెరగక తప్పదు. ఇది ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంచుకున్న మార్గమే. ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ దేదు. దానిని ప్రతిఘటించడమే ముందున్న కర్తవ్యం.

(స్వేచ్ఛానువాదం)
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌