
ఎనభై ఏళ్ల వయసులో తనపని తాను చేసుకోలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధమహిళ ఒంటరితనపు జీవితంలో పడే సంఘర్షణను చాలా హృద్యంగా వర్ణిస్తూ 'ఎదురీత' నవల మొదలవుతుంది. తల్లిని తీసుకెళతానని కొడుకు వచ్చినా ఆ తల్లి వెళ్లదు. తన కాళ్ల మీద సరిగ్గా నిలబడలేని ఆ వయస్సులో ఎవరో ఒకరు తోడు ఉండాలి. అయినా కొడుకు ఆహ్వానాన్ని తిరస్కరిస్తుంది. ఎందుకు? అన్న ప్రశ్న పాఠకులకు కలిగేలా తల్లీ, కొడుకుల మధ్య సంభాషణలు నడుస్తాయి. ఆ మాటలు మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తారసపడ్డ సందర్భాలుగా తోచడం ఒక నవల చదువుతున్నట్లుగా అనిపించదు. మనకు తెలిసిన ఓ అమ్మ గురించి తెలుసుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇలా కథ నడుస్తుండగానే ఆ వృద్ధ స్త్రీ తన ఒంటరిపాటును దూరం చేసుకునేందుకు సాహిత్య రంగంలోకి అడుగులు వేయడం పాఠకులకు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు కథ అప్పుడే మొదలవుతుంది.
సంప్రదాయం ముసుగులో సుశీల జీవితం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో వివరిస్తూ సాగిన ఈ రచన పాఠకుణ్ణి 60 ఏళ్ల క్రితంనాటి సమాజానికి తీసుకెళ్తుంది. పదహారేళ్ల పడుచుకు 30 ఏళ్ల వాడితో పెళ్లిచేయడం. కట్నం డబ్బు ఇవ్వలేదని 20 ఏళ్లు కాపురానికి తీసుకెళ్లని భర్త. ఆ సమయంలో మొదట్లో తీవ్రంగా కలత చెందిన సుశీల, ఆ తరువాత తనకిష్టమైన చదువును కొనసాగిస్తుంది. ఒక్కో మెట్టూ ఎక్కుతూ తను చదివిన కాలేజీలోనే ఉపాధ్యాయురాలిగా స్థిరపడడం వెనుక ఆమె పట్టుదల, కార్యదీక్షను చక్కగా వర్ణించారు రచయిత్రి. బాధలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ఎలా నిలబడాలో సుశీల పాత్ర ద్వారా తెలియజేసిన విధానం పాఠకులను కట్టిపడేస్తుంది. సంప్రదాయం పేరుతో ఒక తరం ఆడపిల్లలు ఎన్ని బాధలు పడ్డారో, అవమానాలు భరించారో సుశీల కథలో చెప్పారు రచయిత. రెండు దశాబ్దాలు గడిచిన తరువాత భార్యను వెతుక్కుంటూ వచ్చిన భర్త దగ్గరకు వెళ్లే పరిస్థితి ఎదురౌతుంది ఆమెకు. సగటు స్త్రీలా భర్తతోడు, సంసార జీవితం, పిల్లలపై ఆశతో భర్తతో వెళ్లేందుకు సిద్ధపడిన సుశీల కొన్ని ఆంక్షలతో భర్తను చేరుతుంది. ఇవన్నీ ఆర్థిక స్వాతంత్య్రం ఉన్న మహిళ వేసే అడుగులు ఎంత ప్రభావశీలంగా ఉంటాయో అనడానికి నిదర్శనం. ఒక పక్క సంసార జీవితం, పిల్లలు, మరోపక్క ఉద్యోగం అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించిన సుశీల లాంటి మహిళలు మనకు చాలాసందర్భాల్లో తారసపడిన భావన కలుగుతుంది. ఆమెకు ఎదురైన ప్రతి సందర్భాన్నీ వర్ణించే క్రమంలో సాగిన రచనా శైలి పాఠకుణ్ణి కట్టిపడేస్తుంది. బిడ్డను పెంచే క్రమంలో అక్కరకు రాని భర్తతో బిడ్డ యోగక్షేమాలు పట్టించుకోవడానికి తన సర్వస్వాన్నీ త్యాగం చేసిన సుశీలలో ఎందరో అమ్మలు కనపడతారు. బిడ్డ ఉన్నతి కోసం అంతగా తపన పడ్డ అమ్మ ఆ తరువాత బిడ్డ బాగుకోసమే తననుండి దూరంగా బతకడం కంటతడి పెట్టిస్తుంది. ఎంతో హృద్యంగా సాగుతున్న నవలలో అక్కడక్కడా జాతకాలు, మూఢనమ్మకాల ప్రభావం, పర్యవసానాలు ఆలోచింపజేసేవిలా ఉంటాయి. ముళ్లబాటగా నిలిచిన తన జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని అధిగమిస్తూ సుశీల చేసిన ప్రయాణం ఆద్యంతం ఎన్నో సంఘర్షణల మయం. వృద్ధాప్యంలో కూడా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. సుశీల జీవిత ప్రయాణం సగటు మహిళకు స్ఫూర్తిగా నిలిచేలా నవల నడిపించిన తీరు హర్షణీయం.
'ఎదురీత'
రచయిత : కుమ్మమూరి సుబ్బాయమ్మ
పేజీలు : 98
వెల : రూ.100
ప్రతులకు : సాహితీకిరణం, హైదరాబాద్. అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాల్లో
ఫోను : 040-24030810